[wpdts-weekday-name] - [wpdts-date]

ప్రజా తీర్పుకు ఫిరాయింపుల తూటా

దేశ రాజకీయాల్లో స్వార్ధమే పరమాధి గా అవకాశ రాజకీయాలు నడుస్తున్నాయి. రాజకీయ నాయకులు ప్రజల ఆశలనే తమ పెట్టుబడిగా, అవకాశాలుగా మారుకుంటున్నారు. ఓట్లు అడిగి వేయించుకున్న తరువాత వారి అసలు రంగు, బయటపెడుతున్నారు. ఇక్కడ మనం పార్టీలు మారే వారి గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి. ప్రజల ఆశలను సమాధి చేస్తూ తమ రాజకీయ భవిష్యత్తు కోసం మాత్రం పాటు పడుతున్నారని చెప్పవచ్చు. ఒక పార్టీ తరపున గెలిచి మరో పార్టీలోకి వెళ్తున్నారంటే ప్రజల నమ్మకాన్ని ఎలా నిర్వీర్యం చేస్తున్నారో తెలుస్తోంది.
రాజకీయాల్లో అధికారం సంపాదించడం కోసం ప్రజలను ఆకట్టుకోవడం కోసం, ఎన్నో అబద్ధాలతో మభ్యపెడుతున్నారు. తీరా గెలిపిస్తే కొంతమంది నాయకులు వారి రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీలు మారి ప్రజల ఆశలను గాల్లో కలిపేస్తున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికై సర్కారు చేత పనులు చేయించకుండా.. అధికారం కోసం అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్ళిపోతున్నారు.
పార్టీ మారడం చట్ట విరుద్ధం అని తెలిసినా రాజకీయ వలసలను ఎవ్వరూ కట్టడి చేయాట్లేదు . ఒక రకంగా చూస్తే పక్క పార్టీ వాళ్ళని తీసుకోవడం అంటే వాళ్లు కూడా ప్రజలను అవమానించినట్లే. ప్రజల వెనుకబాటుకు పార్టీ మారడం కూడా కారణంగా ఉంటోంది.
ఇక పార్టీ మారాక ప్రజల కు సేవ చేయాలన్న బాధ్యతను పక్కనపెట్టి.. ఆ పార్టీలో కూడా రాజకీయంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ ఫిరాయించే అయారం గాయారం వల్ల పార్టీలో ఉన్న నికార్సైన కార్యకర్తలు, నేతలకు అన్యాయం జరుగుతోంది. దాంతో ప్రజలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం, విశ్వాసం సన్నగిల్లుతోంది. ప్రజా సేవ పేరుతో గెలిచి ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా పార్టీలు మారుతున్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే.
రాజకీయ ఫిరాయింపుల చట్టం రాజకీయ ప్రక్షాళనకు ఎంతో అవసరం. ఒక పార్టీ పై గెలిచి మరో పార్టీలోకి మారినోళ్లపై వేటు పడాల్సిందే. రాజకీయ సంస్కరణలు తేకుండా అభివృద్ధి జరగదు. దీనిపై స్పీకర్ కు ఉన్న అధికారాన్ని సక్రమంగా వినియోగించాలి. ఫిరాయింపులు కొనసాగితే.. పేదలతో పాటు యువత కూడా రాజకీయాలకు దూరమయ్యే అవకాశం ఉంటుంది.
గెలిసి ప్రజలను మోసం చేసిన నాయకులను శిక్షించడానికి పార్టీ ఫిరాయింపులు చట్టం కచ్చితంగా అమలు చేయాలి. ఎందుకంటే ఇది నేతల కంటే పబ్లిక్ కే ఎక్కువ అవసరం.
ఇకపోతే ఫిరాయింపులకు వ్యక్తిగత ఆస్తులు, వ్యాపారాలు కూడా కారణంగా మారుతున్నాయి. ఆస్తులు, వ్యాపారాల రక్షణ కోసం పార్టీలు మారాల్సిన పరిస్థితి వస్తోంది. దేశంలో ఇలాంటి రాజకీయాలు సాధారణమైపోయాయి. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉంటే కక్షతో… అధికారపక్ష నేతలు వివిధ సంస్థలు (సిబిఐ, ఈడి,ఐటి) లతో దాడి చేయించి అధికార పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ప్రజలచేతే ఏర్పడే ప్రభుత్వాలు కూల్చడం లాంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి మచ్చ తేవడమే. రాజకీయ పిరాయింపుల వల్ల ఓటు వేయాలన్న ఆలోచన చనిపోతోంది. రాజకీయ వ్యవస్థ బాగు పడనంత కాలం పబ్లిక్ ఆశించిన మార్పు రాదు. జవాబు దారి నాయకత్వం చాలా అవసరం. యువత కూడా రాజకీయాలను క్షుణ్ణంగా గమనించాలి. ఫిరాయింపులు అభివృద్ధికి అడ్డం పడుతుంది. కనుక ఫిరాయింపు నేతలకు అవకాశం ఇవ్వకుండా ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
l======= పట్ట.హరినాథ్

Related Posts

Cartoons Sence

Galleries

Latest Updates