ఒక దేశాన్ని కానీ, ఒక సమాజాన్ని గానీ, సర్వనాశనం చేయాలంటే ఇతర దేశాలు దాడి చేయడం పెద్ద పెద్ద అనుబాంబులు వేసే అవసరం లేదు. ఆ దేశ విద్యా వ్యవస్థను నాశనం చేస్తే చాలు… దేశం దానంతట అదే పతనమైపోతుంది. మన దేశంలో నాణ్యతా విలువలు లేని విద్య వ్యవస్థ, మాస్ కాఫీయింగ్, లీకేజీల ప్రోత్సాహానికి ఎక్కువ ప్రాధాన్యత లభిస్తోందనిపిస్తోంది. విద్యా వ్యవస్థ లోపభూయిస్టంగా ఉంటే, దీర్ఘ కాలంలో తయారయ్యే డాక్టర్ల చేతిలో పేషెంట్, ఇంజనీర్ చేతిలో భవనాలు, జడ్జిల చేతుల్లో న్యాయం అన్యాయం అయిపోవడం, ఆర్థిక వేత్తల చేతుల్లో ఆర్థిక విధానం నలిగిపోతోంది. ఏ దేశంలో అయితే విద్య నాశనం అవుతుందో ఆ దేశం పతనం అయిపోతుంది. విద్య వ్యక్తి వికాసం కోసమని, జ్ఞాన సముపార్జన కోసం మని, ఆ మనిషి సమున్నతి కోసం పని చేస్తుందని అంటారు. కానీ.. నేటి వ్యవస్థలో విద్యా వ్యవస్థలో ఓ పెద్ద వ్యాపార వస్తువుగా మారిపోయింది.
మౌలిక వసతుల్లో విద్య ప్రాధాన్యమైనది. విద్యా రంగం ద్వారా మానవ వనరులను మరింత బలంగా తీర్చు దిద్దుకోవచ్చు. దేశంలో ప్రతి పౌరుడికి విద్య, సమాన అవకాశాలు, మన రాజ్యాంగం చెబుతోంది. కానీ విద్యా రంగంలోకి ప్రైవేట్ విద్యా వ్యవస్థ వేళ్ళూనుకుని పోయింది. పోటీగా కార్పొరేట్ రంగంగా మారిపోయింది.. ఎప్పుడైతే విద్య వ్యాపార వస్తువుగా మారిందో లాభాలే లక్ష్యం గా పని చేయడం ప్రారంభమైంది. దాంతో లాభాల కోసం అక్రమాలకు దారితీసింది. పత్రికలు, టీవీ చానల్స్, వివిధ రకాల ప్రకటనలు, యాడ్స్ లో ప్రైవేట్ విద్య సంస్థలు ర్యాంకులు సాధించినట్లు చెప్పుకుంటున్నాయి. ప్రైవేట్ విద్యా సంస్థల నిర్వహణకు ప్రభుత్వ పర్యవేక్షణ, ప్రమేయం అవసరం ఉంటుంది. అయితే ప్రైవేట్-ప్రభుత్వ రంగంలో ఉన్న స్వార్ధ పరులు చేతులు కలుపడంతో అవినీతి, అక్రమాలకు అడ్డులేకుండా పోయింది.
దేశంలో ఇంటర్ పూర్తయిన విద్యార్థులు నీట్ పరీక్ష రాస్తే పేపర్ లీక్ అయింది. విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ జూన్ లో రాసిన పరీక్ష రద్దయింది. తరువాత నీట్ పీజీ పరీక్ష కూడా వాయిదా పడింది. ఈ పరీక్షలను ఎన్టిఏ నిర్వహిస్తోంది. అయితే లీకేజీలపై వేసిన హై పవర్ కమిషన్ చైర్మన్ గా ఎన్టిఏ చైర్మన్ ను నియమించడం పలు ఆరోపణలకు దారి తీస్తోంది. రకరకాల విద్యార్హతలు కలిగిన ఫేక్ సర్టిఫికెట్లు, స్కామ్ లు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తెలంగాణలో 2014 నుండి ఇప్పటివరకు పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా నిర్వహించిన 15 పోటీ పరీక్షల ప్రశ్నా పత్రాలు లీకయ్యాయి. ఆంధ్రాలో 2022లో టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయ్యింది. కానీ అక్కడ ఎలాంటి పోటీ పరీక్షల పేపర్లు లీక్ కాలేదు. అంటే అక్కడ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించారని కాదు. అక్కడ అసలే ఉద్యోగ నియామక ప్రకటనలు చేయలేదు. దానికి మరో కారణం ఉంది. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ బేసిక్ ద్వారా మరో అవినీతి యంత్రాంగం తయారు కావడమే.
పేపర్ లీకేజీల వెనుక 100 కోట్ల కుంభకోణాలు దాగి ఉన్నది. ఈ లీకేజీలు ఎక్కువ సంపద కలిగిన వ్యక్తుల కోసం చేస్తున్నట్లుంది. ఎకనామిక్ అండ్ పొలిటికల్, బిజినెస్ స్టాండర్స్ గణాంకాల ప్రకారం బ్లాక్ మనీని ఉత్పత్తి చేస్తున్న వాటిలో ఫార్మాసిటికల్, రియల్ ఎస్టేట్ తో పాటు విద్యారంగం కూడా చేరిపోయింది. దీన్ని బట్టి విద్య వ్యవస్థలో అవినీతిని అంచనా వేయవచ్చు. అకడమిక్ అడ్మినిస్ట్రేటివ్స్, పొలిటికల్ ఇమేజ్ తో వచ్చి రూల్స్ కు వ్యతిరేకంగా నియామకాలు, భవనాల నిర్మాణాల్లో అవినీతితో కోట్లు సంపాదిస్తున్నారు. తరువాత రాజకీయాల్లోకి వచ్చి విద్యారంగంలో చేసిన తప్పులను మాఫీ చేసుకుంటున్నారు. ఎన్ని అక్రమాలకు పాల్పడినా.. ఏ అధికారి అక్రమాలు రుజువయ్యనట్లు, లేదా శిక్ష పడే దాఖలాలు లేవు. అందుకే అక్రమాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అవినీతి చేయడం ఆ డబ్బుతో మళ్ళీ రాజకీయాల్లోకి రావడం వాళ్ళు చేసిన తప్పులను కప్పిపుచ్చు కోవడమే జరుగుతోంది. ఇలా దేశంలో విద్య నిర్వీర్యం అయితే ఆ దేశాలు పతనమవడం ఖాయం. ఇందులో సందేహమే లేదు.
అయితే విద్యా వ్యవస్థలో చాలామంది నిజాయితీగా పనిచేసే అడ్మినిస్ట్రేటివ్స్, ఎంటర్ పెన్యువర్స్ కూడా ఉన్నారు. చట్టం ప్రకారం పని చేయడం వారికి కఠినంగా మారుతోంది. ఒకపక్క రాజకీయ ఒత్తిడిలు, మరోపక్క అవినీతి విధానాల నుంచి నిజాయితీగా పనిచేసే అడ్మినిస్ట్రేటర్స్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత… ప్రభుత్వాలు, పబ్లిక్ పై ఉంది. భవిష్యత్ తరాల కోసం వీరికి రక్షణ కల్పించవలసిన అవసరం కూడా ఉంది.
రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలు చేసే వారిని చట్టం ప్రకారం శిక్షించాలి. నిర్వీర్యం అవుతున్న విద్యా వ్యవస్థను కాపాడుకోవడానికి రెగ్యులేషన్, అక్రమాల నియంత్రణకు కఠిన చట్టాలు వెంటనే తీసుకురావాల్సిన అవసరం ఉంది. చట్టం ప్రకారం పని చేస్తున్న వారికి రక్షణ ఇచ్చి విద్యా ప్రమాణాలు, నైతిక విలువలు పెరిగేలా, అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే విధంగా…. విద్య వ్యవస్థను తయారు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు సమాజంలోని మేధావులు దృష్టి సారించాలి.
రచన…పట్ట. హరనాథ్ , జర్నలిస్ట్.