ఏ పని చేయాలన్నా మనం కనీసం ఆ విషయం గురించి తెలుసుకుంటాం. ఉదాహరణకు పరిక్ష రాయాలంటే, పరిక్ష పాస్ కావాలన్నా మనం పుస్తకాలను చదువుతాం. పరీక్షలో ఏ ప్రశ్నలొస్తాయో తెలియదు కాబట్టి పుస్తకాలను కూలంకషంగా చదువుతాం. అలాగే జీవితంలో మీరు ‘సక్సెస్’ సాధించాలంటే మిమ్మల్ని మీరు తెలుసుకోండి.
మీలో ఉన్న మంచి గుణాలేమిటి… చెడ్డ గుణాలేమిటి… నష్టం కలిగించే అలవాట్లు ఏమైనా ఉన్నాయా… ముందు మీ లో ఉన్న లోపాలను మీరు గుర్తించుకొని వాటిని సవరించుకోండి. ముఖ్యంగా ప్రతి మనిషి తన లోని మంచి గుణాల కంటే ఎదుటి వారి గుణాలను తొందరగా గ్రహిస్తారు. ఉదాహరణకు ఎవరైనా మంచి గొంతుతో, రాగంతో శ్రావ్యంగా పాటలు పాడుతున్నారను కోండి. వెంటనే మనం స్పందిస్తాం. వారి వయసు, ఇతర వివరాలను పోల్చుకుంటూ వారిని పొగుడుతాం.
చిన్న పిల్లలైతే… ‘చిన్న పిల్లైనా ఎంత బాగా పాడింది’ అని. అలాగే ఏ సంగీత సాధన లేకుండానే ఓ ఊర్లో ఉన్నవాడు మంచిగా, శ్రావ్యంగా పాడితే … ‘సంగీత జ్ఞానం లేకుండానే ఎంత బాగా పాడాడు’ అని మెచ్చుకుంటాం.. ఎవరైనా బొమ్మలేస్తున్నా. ‘అబ్బా ఎంత బాగా వేశావు… ఎక్కడ నేర్చుకున్నావు’ అని మెచ్చుకుంటూ వివరాలు తెలుసుకోవాలని ప్రయత్నిస్తాం. అయితే తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, వీళ్ళలో ఎవరూ ముందుగా ఏ శిక్షణ తీసుకోకుండానే అలా మనం మెచ్చుకునే సామర్థ్యం పొందడానికి కారణ ఏమిటి. కారణం ఒకటే. ‘పుర్రెకో గుణం.. జిహ్వకో రుచి’ అనే సామెత వినే ఉంటారు కదా… మనలో ఒకరికి తీపింటే ఇష్టం ఉంటే మరొకరికి పులుపంటే ఇష్టం ఉంటుంది. మరొకరికి కారం. అలాగే ఒక్కొక్కరికి ఓక్కోదానిపై ఇష్టం ఉంటుంది. అలాగే ఒకరికి పాటలంటే ఇష్టమనుకోండి… వాళ్ళు చిన్నప్పటి నుంచి పాటలను చాలా శ్రద్ధగా విని, వాటిని పాడుతూఉంటారు. దాంతో వారు రాగాలాపన చేయటంలో పట్టు సాధిస్తారు. అయితే వయసు పెరిగిన కొద్ది ఆయా పనులను మరింత సాధన చేసిన మెళుకువలు నేర్చుకుంటే మరింత ప్రావీణ్యత సాధిస్తారు. పుట్టగానే ఎవరూ పండితులు కాలేరు. రచయితలు కాలేరు. గాయకులు కాలేరు. ఆర్టిస్టులు కాలేరు. ఇష్టంతో సాధన చేస్తే కష్టమైనా ఒంటబట్టించుకోవడానికి ఎంతో సమయం పట్టదు. ఆ విషయం తెలుసుకున్న విద్యార్ధికి ఎదురే ఉండదు. ప్రతి విద్యార్థి తనను తెలుసు కోవడం అంటే తనకు ఏ విషయం అంటే ఇష్టమో.. ఆ విషయంలో సాధన చేస్తే అభివృద్ధికి అడ్డే ఉండదు.
Sunday - December 22, 2024