Monday - December 23, 2024

విశ్వాసపు జంతువులకు …. విషం ఎక్కడిది..?

భూమిపై మనుషులే ప్రత్యేకమని అనుకుంటాం. ఇతర జీవులకు మనకు మధ్య సంబంధాలను బేరీజు వేసుకుంటాం. ఒక్కోసారి నువ్వు మనిషివా! జంతువువా! అర్థం కాదా ? అంటుంటాం. మనిషినే ముఖ్య కేంద్రంగా చేసి ఆలోచిస్తాం. కానీ అలా కాదు. ఇతర జీవులతో కూడా మనిషికి సంబంధం ఉందన్న విషయాన్ని మరిచి,  స్వార్థంగా మారిపోతున్నాడు మనిషి.

  మనిషి,  ఎక్కువగా మచ్చిక చేసుకునే జంతువుల్లో కుక్కలు ప్రధానమైనవని చెప్పక తప్పదు. ఇందులో ఎలాంటి  సందేహం లేదు. మనతో చాలా సులువుగా జర్నీ చేస్తాయి.  వాటిని ఇంట్లో కాపలాగా పెట్టుకుంటాం. మనుషుల కంటే ముందుగా కుక్కలు ప్రమాదాన్ని  గుర్తిస్గాయి. ఎందుకంటే వాటికి గ్రహణ  శక్తి  ఎక్కువగా  ఉంటుంది. కుక్కలకు అంత ప్రాధాన్యం ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో మనం కుక్క బుద్ధి రా… నీది. కుక్క బ్రతుకు రా నీది. అని సంబోధిస్తుంటాం. విశ్వాసానికి బ్రాండ్ ఐన కుక్కలు ఇప్పుడు చిన్నపిల్లలు, వృద్ధుల పై దాడులు చేస్తున్నాయి. చిన్నారులపై కుక్కలు దాడులు చేస్తున్న సంఘటనలు వింటుంటే ఆందోళన కలిగిస్తున్నాయి. వీధి కుక్కల దాడిలో చిన్నారులు, వృద్ధులు బలైపోతున్నారు. ఇలాంటి ఘటనలు పేపర్లలో టీవీల్లో ఇటీవల చాలా చూస్తున్నాం, వింటున్నాం. పత్రికల్లో టీవీల్లో వచ్చిన కథనాలను ఆధారంగా వీధి కుక్కల దాడుల్లో పిల్లలు చనిపోవడంపై ఇటీవల హైకోర్టు కూడా సీరియస్ అయింది. కట్టడి ప్రయత్నాలపై ప్రభుత్వ వైఫల్యం  మీద కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 

  ఇటీవల వీధి కుక్కల దాడులు ఎక్కువైనా, అధికారులు పట్టించుకోవట్లేదని విమర్శలున్నాయి. తాజాగా పెట్ బషీరాబాద్ లో కుక్కల దాడుల నుంచి మమ్మల్ని కాపాడండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంకుల్ అంటూ.. చిన్నారులు ప్లే కార్డులు ప్రదర్శించారు. కొంపల్లి లో మున్సిపల్ కమిషనర్ పై చిన్నారులు , కాలనీవాసులు కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు కూడా చేశారు. వీధి కుక్కల దాడులకు బలైపోయిన వారిలో పొట్టకూటి కోసం,  బ్రతుకుతెరువు కోసం వచ్చి గుడిసెల్లో ఉంటున్న వారే ఎక్కువ. అందుకే ప్రభుత్వం సరిగా పట్టించుకోవడంలేదని, ధనవంతుల పిల్లలు అయితే వెంటనే స్పందిస్తారని విమర్శలున్నాయి. వీధి కుక్కల దాడులపై ఎప్పటినుంచో ఫిర్యాదులు వస్తున్నాయి. వెంటనే కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తే కచ్చితంగా తగ్గేవని చెప్పవచ్చు.. కానీ అలా లేకపోవడం బాధాకరమని బాధితులు అంటున్నారు.

అసలు కుక్కలు మనుషులపై ఎందుకు దాడి చేస్తున్నాయి? కుక్కలు పిచ్చిగా ప్రవర్తిస్తున్నాయి? వాటికి పిచ్చెక్కటానికి కారణమేమిటి? విశ్వాసానికి మారు పేరుగా ఉన్న కుక్కలు విషపూరితంగా వ్యవహరించడానికి కారణమేంటి? హైదరాబాద్ పబ్లిక్ ఆలోచించాలి. దీనికి ముఖ్య కారణం ఏంటో మన అందరికీ తెలుసు. వాటికి కావలసిన తిండి దొరక పోవడమే. ఒకప్పుడు వీధి చివరలో ఉన్న చెత్త కుండీలో నైనా వాటికి ఆహారం దొరికేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చెత్తను కూడా తరలించి  డంపింగ్ యార్డుల్లో పడేస్తున్నారు. కుక్కలకు తిండి దొరకక, రోగాల బారిన పడుతున్నాయి. ఆకలితో మనుషులపై దాడులు చేస్తున్నాయి. వాటికి వ్యాక్సినేషన్ కూడా సరిగా లేదు. కుక్కలకు వ్యాక్సిలేషన్ విషయంలో జిహెచ్ఎంసి వెటర్నటీ అధికారులు కోర్టుకు తెలిపిన వివరాలు సరిగ్గా లేవంటూ కోర్టు కూడా అక్షింతలు వేసింది. మరోవైపు ప్రభుత్వ అధికారులు నామమాత్రంగా సమీక్షలు జరిపి చేతులు దులుపుకుంటున్నారు. కుక్కలకు ఆహారం దొరికేలా చేసి, వాటికి వ్యాధులు రాకుండా చేస్తే సమస్య నుంచి బయటపడే ఛాన్స్ ఎక్కువగా ఉందని మేధావులు అంటున్నారు. ఇతర రాష్ట్రాలు వీధి కుక్కల సమస్యను ఎలా ఎదుర్కొంటున్నాయో మన ప్రభుత్వం కూడా అలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని నగర ప్రజలు కోరుకుంటున్నారు. మన అధికారులు కుక్కల దాడులను సీరియస్ గా తీసుకుంటే ఫలితం ఉంటుందని ప్రజాభిప్రాయం.

అదలా ఉంచితే కుక్కలు దాడుల వెనుక కూడా మనుషుల స్వార్థం, తప్పిదాలే కనిపిస్తున్నాయి. విశ్వాసంగా ఉన్న కుక్కలు విషపూరితంగా మారడానికి కారణం మనమే అని గ్రహించాలి. ఉదాహరణ: పార్కుల్లో, లేదా జనసంచారం లేని రోడ్లు, ఇతర ప్రదేశాల్లో కొందరు మద్యం ప్రియులు,తాము త్రాగిన ప్లాస్టిక్ గ్లాసుల్లో మిగిలిన మద్యం, తిని విడిచిపెట్టిన చెకెన్, మటన్ ముక్కలు అక్కడనే వదిలేస్తున్నారు. వాటిని తినడంతో మద్యం మత్తు లో అటుగా పోయే ప్రజలపై దాడి చేస్తున్నాయి.. ఆ దాడుల్లో  అర్భకులకు, పిల్లలకు గాయాలవుతున్నాయి. లేదా వాటి కాటుకు బలవుతున్నారు. ఇది స్వయంగా చూసి చాలా బాధ అనిపించింది. ఇక ఈ విషయంలోనే కాదు.. పంట పొలాలను నాశనం చేస్తున్న ఏనుగులు, కోతులు,  పక్షులు వాటి స్థావరాలైన అడవులు,  చెట్లను నరకడం, అడవుల విస్తీర్ణం తగ్గించడం వల్లే అవి జన సంచారం లోకి వస్తున్నాయి., పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. అలాగే వాతావరణ కాలుష్యం. ఇలా..మానవ జీవనానికి ముప్పుగా మారుతున్నవన్నీ… మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నాయని గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది

…………….పట్ట. హరిప్రసాద్, జర్నలిస్ట్…

Related Posts

Cartoons Sence

Galleries

Latest Updates