ఢిల్లీలో భారీ వర్షాలు కారణంగా కరోల్ బాగ్ ప్రాంతంలోని రాజేంద్రనగర్లో ఓ కోచింగ్ సెంటర్ లోనికి భారీగా వరద నీరు చేరడం తో.. సివిల్స్ చదువుతున్న ముగ్గురు అభ్యర్థులు చనిపోవడం దేశం మొత్తం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ సంఘటనతో అందరి దృష్టి ఒక్కసారిగా కోచింగ్ సెంటర్లపై మళ్లింది. నాణ్యతలేని కోచింగ్ సెంటర్లను సరిగా కట్టడి చేయనందునే ఇలాంటి ఘటన చోటు చేసుకుంది అన్నట్లుగా చూడడం జరుగుతోంది. ఘటన జరిగిన వెంటనే ఢిల్లీ అధికారులు అప్రమత్తమై నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కోచింగ్ సెంటర్లపై అప్పటికప్పుడే చర్యలు తీసుకున్నారు. ఢిల్లీలోని రాజేంద్రనగర్ లో ఎక్కువ కోచింగ్ సెంటర్లు ఏర్పడి వాటికి అడ్డగా మారింది. అయితే కొన్ని కోచింగ్ సెంటర్లలో కనీస సౌకర్యాలు లేవని, శిక్షణార్ధులు ఇబ్బందులు పడుతున్నామని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సివిల్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థి లేఖ రాయడం చర్చనీయంగా కూడా మారింది.
రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్య కేంద్రంగా ఉన్న హైదరాబాద్ మహానగరంలో కూడా పర్మిషన్ లేని ఎన్నో కోచింగ్ సెంటర్లు గుట్టలు గుట్టలుగా పుట్టుకొస్తున్నాయన్నది బహిరంగ రహస్యం. ఇప్పుడు ఇవి జిల్లా కేంద్రాల్లో కూడా విస్తరించాయి. కార్పొరేట్ విద్యాసంస్థల మాదిరిగా కార్పొరేట్ కోచింగ్ సెంటర్లు వెలుస్తున్నాయి. అకాడమిక్ ఇయర్, జాయినింగ్ తో పాటు… గ్రూపు వన్, గ్రూపు 2 , కానిస్టేబుల్, నైపుణ్య టాలెంట్ టెస్ట్ లకు సంబంధించి కోచింగ్ సెంటర్లు ఎక్కువగానే ఉన్నాయి. కోచింగ్ సెంటర్ ద్వారా కొన్ని వేల కోట్లు వ్యాపారం జరుగుతున్నట్లు కేంద్రం అంచనాలు కూడా ఉన్నాయి. కోచింగ్ సెంటర్ల కట్టడి కోసం కేంద్రం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసినా, అవి అమలవుతున్న దాఖలాలు లేవు. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే కోచింగ్ సెంటర్, కోచింగ్ అనగానే అశోక్ నగర్, దిల్ సుఖ్ నగర్, సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ లకు సంబంధించి అమీర్పేట్, ఎస్. ఆర్. నగర్ ప్రాంతాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. హైదరాబాదులో కూడా కొన్ని కోచింగ్ సెంటర్లో వందల కోట్ల వ్యాపారం జరుగుతోంది. రాష్ట్రంలో అత్యధిక కోచింగ్ సెంటర్లకు ఎటువంటి ప్రమాణాలు ఉండవు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో వ్యాపార సంస్థగా నమోదు చేసుకుంటారు. కోచింగ్ సెంటర్ నడుపుతున్న భవనాలకు ఫైర్ శాఖకు సంబంధించి రక్షణ నిబంధనలు పాటించరు. అధికారులు తనిఖీలకు వస్తే వారి జేబులు నింపడం, జరీమానాలతో తప్పించుకుంటున్నారు. కోచింగ్ సెంటర్లో ఎంతమంది ఉన్నారు? ఎంత ఫీజులు ఇస్తున్నారు? అనేది ఏమాత్రం లెక్కల్లో కనిపించవు. కెపాసిటీకి మించి ఎక్కువ మందిని కూర్చోబెట్టి మరీ కోచింగ్ సెంటర్లు నడుపుతున్నారు. ఢిల్లీ లోని పేరుపొందిన కోచింగ్ సెంటర్లు కూడా హైదరాబాదులో నడుస్తున్నాయి. ఇక్కడ కూడా కోచింగ్ సెంటర్ల కంటే సెంట్రల్ జైల్లే బెటర్ అనిపిస్తుంది.
అయితే రాష్ట్రంలో ప్రభుత్వానికి సంబంధించి ఎస్సి, ఎస్టి, బీసీ, స్టడీ సర్కిల్స్ ఉన్నాయి. వాటిలో గ్రూప్స్ కానిస్టేబుల్, ఎస్సై, పరీక్షలకు శిక్షణ ఇస్తారు. ఇక్కడ చేరే అభ్యర్థులకు ముందుగా ప్రవేశ పరీక్ష పెట్టి మరీ, ప్రతిభ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. అయితే సీటు రాని వాళ్ళు, స్టడీ సర్కిల్స్ లో చదవదానికి ఇష్టం లేని వాళ్ళు మాత్రం ప్రైవేట్ కోచింగ్ సెంటర్లను ఆశ్రయిస్తారు. అక్కడ ఎక్కువ ఫీజులు వసూలు చేస్తారు. ప్రభుత్వానికి సంబంధించిన స్టడీ సర్కిల్ లలో పరిమిత సీట్లు కేటాయించడం వల్ల ప్రైవేట్ కోచింగ్ సెంటర్లను ఆశ్రయించిన వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దీంతో బిల్డింగులలో సరైన భద్రత ప్రమాణాలు పాటించకుండా రూల్స్ కు వ్యతిరేకంగా ఇష్టారాజ్యంగా కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. ఫీజులు తీసుకున్నాక వ్యాపారం లాభాలు తప్ప కోచింగ్ సెంటర్ లో ఉన్న మౌలిక వసతులపై ఎలాంటి శ్రద్ధ తీసుకోవడం లేదు, పాటించడం లేదు.
అధిక ఫీజులు వసూలు చేసి సరైన భద్రతా ప్రమాణాలు పాటించకుండా నడుస్తున్న కోచింగ్ సెంటర్లను.. కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది. ఇటీవల హర్యానా ప్రభుత్వం అక్కడి కోచింగ్ సెంటర్ల నమోదు నియంత్రణ బిల్లు ఆమోదించి… ప్రైవేట్ కోచింగ్ సెంటర్లను కట్టడి చేసింది. ఆ మాదిరిగానే అన్ని రాష్ట్రలోనూ చట్టం తీసుకొచ్చి, అధిక ఫీజులు నియంత్రించి, నిరుద్యోగులకు మేలు జరిగేలా పాటుపడాలని మేధావులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కోచింగ్ సెంటర్ లే కాదు ప్రైవేట్ లో నడుస్తున్న కార్పొరేట్ స్కూల్స్ విద్యాసంస్థల్లో కూడా నియంత్రణ చేయాల్సి ఉంది. ఎప్పటికప్పుడు కోచింగ్ సెంటర్లను తనిఖీ చేసి… విద్యార్థులు, నిరుద్యోగుల భద్రతకు చర్యలు చేపట్టాలి. ఢిల్లీలోని రాజేంద్రనగర్ కోచింగ్ సెంటర్లో జరిగిన ఘటన మళ్లీ జరగకుండా చూడాల్సిన బాధ్యత… కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఎంతైనా ఉంది.
—పట్ట. హరనాథ్








