Monday - December 23, 2024

కల్తీ కట్టడిలో కనపించని శ్రధ్ధ….

మన దేశంలో కల్తీ అనేది ప్రస్థుతం పెద్ద సమస్యగా మారిపోయింది. మానవులకే కాదు యావత్తు జీవ ప్రపంచానికే ప్రమాదకరంగా మారింది. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు… కానీ కల్తీని నియంత్రణ  చేసే ప్రయత్నాలు మాత్రం ఫలించడం లేదు. కల్తీ చేసే మాఫియా పెరిగిపోతోంది. మౌలిక వసతులతో పాటు గాలి, నీరు, వాతావరణం, మానవజీవనమే కల్తీగా మారిపోతుంది. ఒకటేమిటి… ఎందెందు వెతికి చూసిన… అన్నట్లు సర్వాంతర్యామిగా మారింది కల్తీ…

అవినీతి, అక్రమాలకు చట్టాలు ఉన్నాయి. అమలు చేసేందుకు కోట్లాది రూపాయలు జీతభత్యాల రూపంలో చెల్లిస్తున్నాం. మరి కల్తీ కి ఏం చట్టం ఉంది? పటిష్టమైన చట్టం ఎక్కడ ఉంది..? ఎందుకంటే కల్తీ కూడా అవినీతితో సమానమే. చట్టాల్లోని లోపాలు మాఫియాకి మార్గంగా తయారయ్యాయి. కల్తీ చేసే వాళ్లకు భారతీయ శిక్ష స్మృతి (ఐపిసి)లో తగిన శిక్షలు లేవు అనే వాదన ఉంది. కల్తీ నిందితులను  కోర్టులో హాజరు పరచకుండానే బెయిల్  పొందే సెక్షన్లు ఉన్నాయి. అందువల్ల నిందితులకు భయం లేకుండా వ్యవహరిస్తున్నారు. ఒకవేళ తప్పు రుజువైతే 6 నెలల జైలు శిక్ష, జరిమానా చెల్లించి బయటకు వస్తున్నారు. మళ్లీ కల్తీ చేస్తున్నారు..

చట్టాల్లో మార్పులు, పదునుపెట్టే ప్రయత్నాలు జరగటం లేదనే చెప్పాలి. కల్తీతో మరణాలకు  బాధ్యులైన వారికి యావజ్జీవశిక్ష వేయాలని ఎన్నో సిఫార్సులు వచ్చాయి. కానీ కాలం గడిచిపోతున్నా పట్టించుకోవడం లేదు. కల్తీ మానవ జీవనానికి సవాలుగా మారింది. నాణ్యత అనేది కరువైంది. దేశంలో కల్తీ ఆహారం తో కోట్లాదిమంది అనారోగ్యానికి గురవుతున్నట్లు ఎన్నో సర్వేల్లో వెళ్లడైంది.

కెమికల్స్ తో కూడిన పదార్థాలను దీర్ఘకాలంగా తీసుకుంటే క్యాన్సర్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా ఉపయోగిస్తున్న పాలలో చిక్కదనం కోసం  రసాయనాలు కలిపుతున్నట్లు నేషనల్ ఫుడ్ సేఫ్టీ నిర్ధారించింది. అలాగే క్రిమిసంహారిక మందులు పిచికారి చేసిన మేతను పశువులకు వేయడంతో దుష్ప్రభావాలు వస్తున్నాయి. పాడి పశువులు వ్యాధుల బారిన పడుతున్నాయి. వాటి పాలు తీయకూడదు కానీ పట్టించుకోవడం లేదు. ఆ పాలతో ఎన్నో వ్యాధులకు గురవుతున్నాం. దేశంలో ఎక్కువగా విక్రయించే పాలల్లో 60 శాతం కల్తీ అని తేలిపోయింది. దీనిపై సుప్రీం కోర్ట్ జోక్యం చేసుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయoటూ ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. పాలు మాత్రమే కాదు.. అన్నింటిలో కల్తీ  మామూలైపోయింది.

పక్క దేశాలు కల్తీపై పటిష్టమైన చట్టాలు అమలు చేసి కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ మన దేశంలో పాత చట్టాలనే అమలు  చేస్తూ కల్తీ కొనసాగేలా చేసుకుంటున్నాం.  కల్తీపై కఠిన చట్టాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాలకులు కల్తీపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని కల్తీ నిర్మూలనకు కృషి చేయాలి.

……………. పట్ట.హరనాథ్ , జర్నలిస్టు,

Related Posts

Cartoons Sence

Galleries

Latest Updates