ప్రజాస్వామ్యంలో చట్టసభలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అందులో ప్రజా సమస్యలను, ప్రజ గొంతుకు తెలియజేయాలి. కానీ అసెంబ్లీ సమావేశాలు దిగజారిపోయాయి. నేతల దూషణలు తప్ప.. సమస్యలు పరిష్కారాలు లేవు. సీఎం దృష్టిని ఆకర్షించేలా పోటీపడుతున్నారు, విమర్శల దాడికి దిగుతున్నారు. గత ప్రభుత్వం అసెంబ్లీలో ప్రదర్శించే తీరును పక్కనపెడితే ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే తీరును కనబరుస్తోంది. గత ప్రభుత్వ తప్పులను మాత్రమే శ్వేత పత్రాలు ద్వారా చెప్తున్నారు తప్ప ఎలా పరిష్కరిస్తారో చెప్పడం లేదు. గత ప్రభుత్వ తీరు నచ్చకే ఇప్పుడు మీకు పబ్లిక్ ఆ స్థానం కల్పించారు. కానీ సభ సాంప్రదాయాన్ని సంరక్షించ కుండా మరింత సమస్యగా మారుస్తున్నారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ప్రతిపక్షం నిలదీస్తోంది. బడ్జెట్ పై చర్చలు జరగకుండా సభ ఎక్కడికో పోతుంది. గతంలో ప్రాధాన్యత శాఖలో పనిచేసిన సీనియర్ నేతలు నిలదీస్తుంటే సమాధానం చెప్పకుండా సీఎం పక్కదారి పట్టిస్తున్నారు. ప్రతిదానికి సీఎం జోక్యం చేసుకుంటున్నారు. శాఖకు శాఖ సమాధానం చెప్పడం సాంప్రదాయం కానీ… సీఎం జోక్యం చేసుకోవడంలో ఆంతర్యమేంటి? హోదాలు మరిచి సీఎం, మంత్రులు వ్యవహరిస్తున్నారు. సబ్జెక్టుతో సంబంధం లేకుండా సభను సర్వనాశనం చేస్తున్నారు.
రెండుసార్లు మంత్రిగా పనిచేసిన మహిళా సబిత ఇంద్రారెడ్డి పై సభలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. సబితాతో పాటు కొందరు మహిళలను ఉద్దేశించి “అక్కలను నమ్మితే నిండా ముంచే అక్కలు ఉన్నారు” అంటూ ప్రస్తావించారు. ఇక దానం నాగేంద్ర బి.ఆర్.ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లారు.. అయితే హైదరాబాదు అభివృద్ధిపై చర్చ సమయంలో “నీ అమ్మ మిమ్మల్ని బయట తిరగనియ్యమంటూ” వ్యాఖ్యలు చేశారు. ఇదంతా స్పీకర్ ముందే జరుగుతోంది. సభాసాక్షిగా బెదిరింపులు జరుగుతున్నాయి. ప్రతిసారి రేవంత్ రెడ్డి అధికారం అడ్డం పెట్టుకొని అబద్ధాలతో సభను పక్కతోవ పట్టిస్తున్నారు. ఒక అంశంపై చర్చ చేస్తే… సంబంధంలేని అంశాన్ని జోడించి జనాన్ని కన్ఫ్యూజన్ చేస్తున్నారు. సభ నాయకుడే ఇలా ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం అవుతోంది. ఒప్పందం కుదుర్చుకునే అంశానికి సంబంధించిన ఒక లేఖలో (మోటర్లకు మీటర్లు) పెట్టే విషయంలో తనకు అనుకూలమైన అంశాన్ని మాత్రమే చెప్పి సభను పక్కదారి పట్టిస్తున్నారు. ఎందుకంటే ఆ లేఖలు ఏముందో స్పష్టంగా ప్రతిపక్షమే బయటపట్టేసింది.
అయితే ఈసారి కూడా సభా సాంప్రదాయాలను ఏమాత్రం పాటించడం లేదు. గత సర్కార్ చేసిన తప్పుడు విధానాలే ఇప్పటి ప్రభుత్వం కూడా మరింత దిగజారి తనంగా చేస్తోందని రాజకీయ నిపుణులు అంటున్నారు. సభ సాంప్రదాయాల్లో మార్పును ప్రారంభించడమే సమస్యగా మారిపోయిందని వాపోతున్నారు. సభలో అనుచిత వ్యాఖ్యలు విమర్శలు తోనే కాలం సరిపోతోంది తప్ప సమస్య పరిష్కారానికి ఎదురుచూస్తున్న వారికి నిరాశ మిగులుతోంది.
సభలో ప్రజా సమస్యలపై ప్రస్తావించకుండా రాజకీయ ప్రసంగాలతో మారుమోగిపోతున్నాయి. ఇన్ని రోజులు జరిగే సమావేశాల్లో ఎన్ని సమస్యలు ఉన్నాయి? ఎన్ని ప్రజా సమస్యలు పరిష్కారమయ్యాయి? ఎలా పరిష్కరించాలి? అన్నదానిపై శ్రద్ధ లేకుండా పోయింది. సమస్య సమస్యగానే ఉండిపోయే పరిస్థితి. సమస్య ఎవరివల్ల వచ్చిందో వారే తీర్చాలి అన్నట్టుగా పరోక్షంగా సభను నడిపిస్తున్నారు. ఈ పద్ధతి సరైనది కాదు.
ఏది ఏమైనాప్పటికీ సభా సాంప్రదాయాల్లో మార్పు తేవాల్సిన అవసరం ఉంది. ప్రజా సమస్యలు ఎత్తిచూపి పరిష్కరించేలా చేస్తే మాత్రం… సభా సాంప్రదాయాలు బ్రతికినట్లే. సమస్యలపై సమావేశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పరిష్కార మార్గాల ద్వారా… ప్రజలకు మేలు జరిగితే మాత్రం సభ్యులు ఉన్నతి, ప్రభుత్వానికి మరింత ప్రాధాన్యత వచ్చే అవకాశం ఎంతైనా ఉంది.
….పట్ట. హరి ప్రసాద్