రాష్ట్రంలో విష జ్వరాలు విస్తృతమవుతున్నా యి. ఆసుపత్రులు రోగులతో కిట కిట లాడుతున్నాయి. డెంగ్యూ, వైరల్, మలేరియా, జ్వరాలతో పబ్లిక్ బాధపడుతున్నారు. ఏజెన్సీ ఏరియాలలో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. కొత్తగూడెంలో 18 నెలల చిన్నారి మలేరియాతో చనిపోయింది. కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లాలో సంక్షేమ బాలికల వసతి గృహంలో టెన్త్ క్లాస్ అమ్మాయి ప్రాణాలు విడిచింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం లో నెలల బాలుడు డెంగ్యూ తో చనిపోయాడు. ఇలా ఎన్నో ఘటనలు, విషాదాలు…
జ్వరాలతో ప్రాణాలు పోతున్న వారిని పక్కన పెడితే.. దవాఖానాల చుట్టూ తిరుగుతున్న వారు ఎందరో… హైదరాబాద్ సిటీ సహా అన్ని జిల్లాల్లో వైరల్ జ్వరాలు డెంగి, మలేరియా, చికెన్ గునియా, టైఫాయిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో మరణాల సంఖ్య రోజు రోజు పెరుగుతున్నాయి. జనవరి నుంచి ఆగస్టు వరకు సుమారు 3000 డెంగీ కేసులు నమోదయి అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో తెలుస్తోంది.
అయితే డెంగీ, మలేరియా మరణాలు వైద్య ఆరోగ్యశాఖ లెక్కల్లో సరిగా చూపడం లేదని వాదనలున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రులకు వచ్చే కేసులు లెక్కల్లోకి రావడం లేదు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లోని కేసులు కలిపితే ఇంకా రెట్టింపు అవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు 36 మంది విద్యార్థులు మరణించినట్లు తెలుస్తోంది. వర్షాలకు వరద నీరు అలాగే ఉండిపోయి, దోమల బెడద పెరిగి జ్వరాలు వస్తున్నాయి.
సీజనల్ వ్యాధులతో సర్కార్ దావా ఖానాలు నిండిపోతున్నాయి. ఇంకొంతమంది ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. స్తోమత లేని వారు మాత్రం ఇంటి దగ్గరనే చికిత్స పొందుతూ మరణిస్తున్నారు. రాష్ట్రంలో మలేరియా పీడిత గ్రామాలను ప్రభుత్వం గుర్తించింది. అందులో 1000 గ్రామాలు ఖమ్మంలోనే ఉన్నాయి. కానీ ముందస్తు చర్యలు మాత్రం లేవు. నమోదవుతున్న కేసులు బట్టి ప్రభుత్వం ప్రజారోగ్యంపై దృష్టి పెట్టడంలో విఫలం అయిందని స్పష్టం అవుతోంది.
గ్రామాలలో నిధులు లేక పారిశుద్ధ్య పనులు ఎక్కడికక్కడే ఆగిపోయినాయి. దోమల పొగ, స్ప్రేయింగ్ ఎప్పటికప్పుడు చేసేవారు కానీ దాన్ని విస్మరించారు. కొన్ని PHCలో మందులు దొరకడం లేదని పబ్లిక్ మండిపడుతున్నారు. సీజనల్ రోగాల నివారణకు ఆరోగ్యశ్రీ ఆరోగ్య శాఖ ముందస్తు కార్యాచరణ చేపట్టకపోవడం, మందులు అందుబాటులో ఉంచుకోకపోవడం తో వ్యాధులకు ప్రధాన కారణం అవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, ఆరోగ్యశాఖ అప్రమత్తమై వేగవంత చర్యలు చేపట్టి సీజనల్ వ్యాధుల భారి నుంచి రాష్ట్ర జనాన్ని కాపాడాలి.
=== పట్ట. హరిప్రసాద్