Monday - December 23, 2024

‘వందే భారత్‌’ రైళ్ల ప్రమాదాలపై రైల్వే పోలీసుల వింత పోకడ

మేకిన్‌ ఇండియా అంటూ మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘వందే భారత్‌’ రైళ్లు వరుస ప్రమాదాలకు గురవటంతో రైల్వే పోలీసులు వింత నిర్ణయాలు తీసుకొంటున్నారు. ఆ నిర్ణయాలే ఇప్పుడు పలు విమర్శలకు దారితీస్తున్నాయి. పశువులను ఢీకొట్టి ‘వందే భారత్‌’ రైళ్లు వరుసగా మరమ్మతులకు గురవుతున్నాయి. దీంతో వాటి నాణ్యత ప్రమాణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే, మహారాష్ట్రలోని ముంబై ఆర్పీఎఫ్‌ పోలీసుల వైఖరి వివాదాస్పదంగా మారింది. పశువులను రైల్వే ట్రాక్‌ వైపు రానీయవద్దని, లేదంటే జైలుకు పంపిస్తామని రైల్వే ట్రాక్‌లకు సరిహద్దుల్లోని గ్రామాల సర్పంచులకు ఆర్పీఎఫ్‌ పోలీసులు నోటీసులిచ్చారు. రైల్వే ట్రాక్‌లపై పశువులు సంచరింస్తూ, రైళ్ల దుర్ఘటనకు కారణమవుతున్నాయని, ప్రయాణికుల ప్రాణాలకు ప్రమాదంగా మారుతున్నాయని పేర్కొన్నారు.

వసతులు సరే.. భద్రత మాటేమిటి?
2019లో మొదటిసారి ‘వందే భారత్‌’ రైలు పట్టాలెక్కినా, మూడేండ్ల తర్వాత ముంబై-గాంధీనగర్‌ (గుజరాత్‌) మధ్య నడిచే రైలును సెప్టెంబర్‌ 30న గుజరాత్‌లో ప్రధాని మోదీ ఆర్భాటంగా ప్రారంభించారు. వేగంతో పాటు ఆటోమేటెడ్‌ డోర్స్‌, ఇంటర్నెట్‌ సౌకర్యం, బయో వ్యాక్యూమ్‌ టైప్‌ టాయిలెట్లు, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యం, టీవీ, సీసీటీవీ, ప్రతి కోచ్‌కు ప్యాంట్రీ తదితర సౌకర్యాలతో రైలును తయారు చేసినట్టు చెప్పారు.

అయితే, ‘తాళము వేసితిని, గొళ్ళెము మరిచితిని’ అన్న చందంగా ఎన్ని వసతులుంటే ఏమిటి? చిన్న దుర్ఘటనకే రైలు ముందుభాగం ధ్వంసమవడంతో, ప్రయాణికుల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం బర్రెలు ఢీకొంటేనే రైలు డ్యామేజీ అవుతుందా? రైలును అంత సున్నితంగా తయారు చేస్తారా? అని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. 2024లోపు 75 ‘వందే భారత్‌’ రైళ్లను నడపాలన్న లక్ష్యాన్ని పెట్టుకొన్న ఇండియన్‌ రైల్వేకే కాకుండా, మేకిన్‌ ఇండియా అంటూ డాంబికాలు పలికిన మోదీ ప్రభుత్వానికి ఇది ఓ మచ్చగానే మిగిలిపోయిందన్నది నిర్వివాదాంశం.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో ….

Related Posts

Cartoons Sence

Galleries

Latest Updates