Monday - December 23, 2024

ఒక్క మగాడు

“ఎవరో… ఎవరో…. ఒక్క మగాడెవరో? ఒక్క మగాడు … ఒక్క మగాడు ….. ఎవరో చెప్పండి?

మీసం మెలేసి, తొడగొట్టిన వాడు, సై అంటే సై అన్నవాడెవడో చెప్పండి?”

” యాద్గీరీ ” అన్న నా పిలుపుతో పాట పాడుకుంటూ తలవంచుకొని పోతున్న యాద్దిరి, అటూ ఇటూ చూసాడు. నేను కన్పించక పోయే సరికి ఒక నిమిషం పాటు నిలబడి, తిరిగి మళ్ళీ పిలుస్తారని ఎదురుచూస్తున్నట్లున్నాడు. ఇక ఎక్కువ సేపు ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక, కాస్త ముందుకు జరిగి, చేయెత్తి నేనే పిలుస్తున్నాను. అటు కాదు, ఇటు చూడు” అంటూ రమ్మని సైగ చేశాను. నా వైపు చూసిన యాద్గిరి.. ” అన్నా నమస్తే! చాల్దినాలాయే మనం గలిసి.. ఏడికి పోయినవ్? అందాజా, మనం గల్పి నెలయిందనుకుంట. బొత్తిగ ఈద్-క్ల- చాంద్ అయినవ్” అన్నాడు. “నేనెక్కడి పోయాను యద్దిరీ, ఆఫీసు వాళ్ళు సెలవే ఇవ్వట్లేదు”

“ఔ..మల్ల ఇలేకర్లకు సెలవెక్కడుంటయ్. అయినా గిప్పుడు సెలవేంది?  రాష్ట్రంల రాజకీయం గరంగరం

ఉంటే”  అన్నాడు. “సరే కాని యాద్గిరీ? ఏదో పాట పాడుకుంటూ పోతున్నావ్” అన్నాను.

“ఏం పాటన్నా? నీకు తెల్వదా? నేను పాటలు, పేరెడిలు గడ్త కద,, పద్యాలు పాడుకుంట కద”

అన్నాడు యాద్గిరి.

“అదే ఆ పాటల గురించే…. ‘ఒక్క మగాడు’ అని పాడుతున్నట్లు వినబడ్డది” అన్నాను నేను. “గదే ఏదో సిన్మలదే పాటన్నా? ఒక్క మగాడు ఎవరు? ఈ రాజకీయాలల్ల… అని పాడుతున్న” అన్నాడు.

నాకు అర్థం కాక “రాజకీయాల్లో ఒక్క మగాటంటే అర్ధం కాలేదు సరిగ్గా చెప్పు” అన్నాను.

“గదే అన్న సక్కటి ఒక్క మొగాడుంటే గీల్ల ఆటలు సాగయ్ అన్న! ” అన్నాడు.

” ఇంకా ఎన్నికలకు ఏడాదిన్నరా ఉన్నది. ఎన్నికలకు గిప్పుడే లొల్లి చేస్తున్నరు? గందుకే ఒక్కోక్కళ్ళకు ఒక్కో మొగాడుంటే గీళ్ళ పని అయితది. అనుకుంటన్న”  అన్నాడు మల్లీ యాద్గిరే..

“అదే అర్ధం కాలేదన్ననా?  సరిగ్గా చెప్పి తగలడు. ఎప్పుడైన వార్తల్లో వ్రాసుకోడానికి పనికొస్తుందేమో” అన్నాను విసుక్కుంటూ…

“గదే అన్నా! తెలుగుదేశంలో ఒక్క మగాడు చంద్రబాబు నాయుడు. కాని ఇప్పుడు మల్ల అన్న ఎన్టీఆర్ కొడుకు బాలకృష్ణ ను పార్టీలకు దీస్కరావాలని అందరు అంటన్లట, బాలకృష్ణ పార్టీల కస్తే పార్టీ మల్ల గెలుస్తదేమో కాని, చంద్రబాబు నాయుడు పని గుండు సున్నయితది. అందుకని ఆయనకు ఇష్టంలేదంట. అందుకే చంద్రబాబును కొట్టే ‘ఒక్క మగాడు’ బాలకృష్ణ” అన్నాడు యాద్గిరి. నాకు కళ్ళు బైర్లు కమ్మి ఇంకా ఏం చెప్తాడో? అని యాద్గిరి వైపు చూశా.

నావైపు చూడకుండానే యాద్గిరి చెప్పుకుంటూ పోతున్నాడు.

‘తెలంగాణా రాష్ట్ర సమితి’ ప్రెసిడెంట్ కేసీఆర్ గీ మధ్యల సల్లబడ్డడు. నరేంద్రను పార్టీల కెల్లి ఎల్లగొట్టినంక సాల్దినాలు యిలేకర్లతోటే మాట్లాడలేదు. తనకు ఎదురుండదని నరేంద్రను ఎల్ల గొట్టిండు కేసిఆర్. ఒక్క మగాడయ్యిండనుకున్నడు. కాని, తెలంగాణ అచ్చినా,  రాకున్నా తన పార్టీ తర్వాత ఒక్క మగాడు.. ఉండాలని కొడుకు రామారావును పార్టీ పనిల బెట్టిండట. రామారావు అమెరికాల కంప్యూటర్ పనిచేసుకుంటుండెనట. గాయన నౌకరిడిసి రాకముందు, కేసిఆర్ మోనల్లుడు హరీష్ రావు.. నేనే ఒక్క మగాడు.. అనుకొని పార్టీల చక్రం తిప్పిండు. పాపం గిప్పుడు కొద్దిగ సల్లబడ్డడు.” అంటూ నా వైపు చూశాడు యాద్గిరి.

నాకేం చెప్పాలో తోచలేదు. సరే ఇంకా ఏం చెప్తాడో ఇష్టామని “నిజమే నీవు చెప్పింది” అన్నాను. దాంతో తన విశ్లేషణను మరింత పొడిగిస్తూ “బీజేపీల వాజ్ పేయి తరువాత నాదే నడుస్తది, నెంబర్ వన్.. మగాడిని నేనే అనుకున్నాడు.. లాల్ కృష్ణ అద్వానీ, కాని, మొన్న గుజరాత్ ఎలక్షన్లల్ల నరేంద్రమోదీ మూడోసారి ముచ్చటగా గెలిసి నేనే ఒక్కమగాడిని అనుకుంటున్నాడు” అన్నాడు యాద్గిరి.,

‘కేంద్ర రాజకీయలెందుకు గాని, మనరాష్ట్రం సంగతి చెప్పు” అన్నాను ఉత్సాహంగా… యాద్గిరి “అన్నా! నువ్వేం అనుకుంటున్నవో? నాకు తెలుసు. మన ముఖ్యమంత్రి డా॥వై. ఎస్. రాజశేఖర్ రెడ్డి, ఇగ పీజేఆర్ పోయిండు గద,.. ఎదిరిచ్చేటోడు ఎవళ్ళేరు..నేనే ఒక్కమగాడు.. అనుకుంటండు.. అని ఆలోచిస్తున్నవా? ” అన్నాడు యాద్గిరి..

 మళ్ళీ యాద్గిరే… “‘ముసలోడు’ గదే.. ‘ఓల్డ్ మేన్’ సత్యనారాయణరావు కూడా సిఎంను కూడ లెక్క చేయకుంట మాట్లాడేటోన్నీ.. నేనే ఒక్క మగాడు.. అనుకుంటండు. కాంగ్రెస్ల ఇంకోడు ముధుయాష్కీ గదే నిజాంబాద్ ఎం.పి. తెలంగాణాకు సపోర్టుగా సిఎంకు ఖిలాఫ్ మాట్లాడి కూడ ఎఐసిసి సెక్రటరీ అయిన నేనే ఒక్క మగాడు.. అని అనుకుంటండు. ఆయన కాక ఇంకోడెవరో తెలుసా? మన గొనె ప్రకాశ్ రావు,.. గదె మన తెలంగాణ పొరగాళ్ళు కొట్టిండ్లు సూడు, ..గాయినేమనుకుంటండంటే…. మధుయాస్కీ, , కాకా (వెంకటస్వామి) లాంటోల్లని ఎదిరిచ్చినోన్ని నేనే ఒక్కన్ని, ఒక్క మగాడిని అని సోచాయిస్తుంటే, గామధ్య…., తెలంగాణా లోళ్లేంది?. నేన్లేనా? అని… మధుయాష్కీకి వ్యతిరేకంగా మాట్లాడి నేనే ఒక్క మగాన్ని అనుకున్నాడు. ఉన్నట్లుండి చిరంజీవి

పార్టీ పెడ్తె… నెనెళ్లి పోత అని గీ ఎం.పి. హరిరామ జోగయ్య గూడా ఒక్కమగాన్ని అని పి.సి.సి ప్రెసిడెంట్ని కూడ లెక్క చెయ్యలేదు” అన్నాడు యాద్గిరి. “సరేలే ఇంత మందిని ఒక్క మగాడంటే ఎలా?  మన రాష్ట్రంలో ఎవరంటే ప్రజలు అభిమానిస్తున్నారు? ఆయన పేరు చెప్పు” అన్నను.

” నువ్ గట్ల కొప్పడకే, నీకు తెల్వదా. మన రాష్ట్రంలనే కాదు గిప్పుడు.. ఢిల్లీదాకా ఒకటే పేరు మోగుతున్నదే. గాయిన ఎం పనంటే అది నిమిషంల అయితది. ఆయన పేరు చేస్తే గుండా గాళ్ళకు ఉచ్చపడది. ఆయన పేరు చెప్తే పోలీసులు సలాంకోడ్తరు. ఆయన పేరు చెప్తే మంత్రులూ సరే నంటరు. గంతేగాదు గాయన పేరు చెప్తే గీ పెపరోళ్ళు, ఎడిటర్లకు గూడా నిద్ర బడ్తలేదు” అన్నాడు యాద్గిరి. “ఎహే సాగదీయకుండా ఆ ఒక్క మగాడెవరో? చెప్పు” అన్నాను. “గదే. అన్నా! మన రాష్ట్రంల గిప్పుడు ఒక్క మగాడంటే జగన్…అన్నా…ఎమనుకుంటున్నవో జగనంటేనే హడల్” అన్నాడు.

‘అమ్మో వీడి తెలివి అమోఘం’  అని లోలోపల అనుకుంటూ మా మాటలెవరైనా వింటున్నారేమో అని అటు ఇటూ చూస్తూ “వస్తా యాద్గిరీ పనుంది” అంటూ కదిలాను.

“గదేందన్నా” గప్పుడే పోతున్నవ్.

“చాయ్ తాగుదాం రా” అన్నాడు యాద్గిరి.

“చాయ్ వద్దులే వెళ్లాలి” అన్నాను, ముందుకు చకచకా నడుచుకుంటూ ” అన్నా! నాకు తెలుసున్న, జగన్ పేరు సెప్తేనే నువ్ గూడ భయపడుతున్నవ్? అన్నా! జగన్ అంటే భయమెందుకన్నా? ఆయన సానమంచోడటన్నా, అడిగినోళ్ళందరికి సాయం చేత్తడటన్నా, నిజమటన్నా…” అన్నాడు యాద్గిరి. ఆయనా నేను ఆగలేదు. ఆ మాటలు గాలిలో కలిస్తండగానే నేను ముందుకు సాగాను. .

Related Posts

Cartoons Sence

Galleries

Latest Updates