“తెలంగాణా పిలుపు.
మెలమెల్లగా రేపెను వలపు,
అన్ని పార్టీల్లో పెట్టెను చుచ్చు.
కాదంటే జనం పెడతారు ఉచ్చు”.
పాడుకుంటూ పోతున్న యాద్గిరికి. నా పిలుపు వినబడటంతో వెనక్కు తిరిగి చూసాడు. నేను కనబడకపోయే సరికి అలాగే ముందుకు సాగాడు. ఇక దాగుడు మూతలెందుకని, చెట్టుచాటున ఉన్న నేను, రోడ్డు పైకి వచ్చి తిరిగి పిలిచా ‘యాద్గిరీ’ అని . వెనక్కి తిరిగి చూడగానే చేయి ఊపాను. ఇక నన్ను చూసిన యాద్గిరి నా వైపు చూసి, నవ్వుతూ
“ఏందన్న ! నాతో మజాక్ చేస్తున్నవ్, అన్నాడు.
“ఏం లేదు యాద్గిరి నా గొంతు గుర్తు పడ్డానో లేదో అని పరీక్ష చేస్తున్నా” అన్నాను.
“గది సరే గానీ…. చాల్దినాలాయె. కన్పిస్తలేవ్, యాడికి పోయినవన్నా? ఈద్ కా చాంద్ అయినప్” అన్నాడు.
“నే నెక్కడకి పోయాను యాద్గిరీ… హైదరాబాద్ విడిచి పెట్టి పోయేటట్లు ఉందా?” అన్నాడు.
“బాగున్నవా అన్న” అని యాద్గిరి అడగడంతో ఏం బాగు యాద్గిరి. ఏదో రోజులు నడుస్తున్నాయి”
“నువ్వే గట్లంటే మా సంగతేమయితదన్నా? అన్నాడు యాదిరి,
“నీకేంది యాద్గిరి ఇష్టముంటే పనికి పోతావ్. లేకుంటే మంచిగ ముసుగుతన్ని పడుకుంటావ్. “అన్నాను.
“గదేందన్నా… గిప్పుడు ఆంధ్రప్రదేశ్ ల పేపరోల్లది హవా నడుస్తున్నదట…కదన్నా”, అన్నాను.
“ఏం హవానో.. ఏమో? నీకెవరు చెప్పారో కానీ, నిన్ను చూసి నవ్వాలో ఏడవాలో తెలియటంలేదు. హిందీలో ఒక సామెత ఉంది తెలుసా “హాధీ కే దాంత్ ఖానే కే ఏక్ రహతే హై. ఔర్ దిఖానేకే ఏక్ రహతే హై” అన్నాను.
“గదేందన్నా గట్ల మాట్లాడతవ్, ఇలేకరులు.. ఎప్పటికి ముఖ్యమంత్రి చుట్టూనే తిరుగుతుంటారు. మీకేం పరేషాన్లున్నాయి” అన్నాడు యాద్గిరి.
“నీకేం తెలుసు యాద్గిరి, మా సమస్యలు, చెపితే ముక్కుమీద వేలేసుకుంటావ్” అన్నాను.
“నావైపు నమ్మశక్యం కాకుండా చూడటంతో …నేనే తిరిగి “కొన్ని పేపర్లలో అపాయింట్ మెంట్లు కూడా ఉండవంటే నమ్ముతావా? అంతే కాదు పీ.ఎఫ్. ఉండదు. అంతెందుకు కొన్ని పేపర్లల్లో సరిగ్గా జీతాలు ఇవ్వరని చెపితే నువ్వు నమ్ముతావా?” అన్నాను.
యాద్గిరి నా మొహం వైపు చూస్తూ “గదేందన్నా.. అందరి మీద పేపర్లల్ల రాసేటోళ్ళకే జీతాలు యియ్యరంటే… ఇసిత్రంగ ఉన్నదన్నా” అన్నాడు యాద్గిరి. తిరిగి అతనే “అన్నా గిదంత పేపర్లల్ల రాయచ్చు గదన్నా” అన్నాడు అమాయకంగా
“ఏంది యాద్గిరీ… మరీ అమాయకంగా అడుగుతావ్, ఇలాంటివి ఎవరు రాస్తారు. రాసినా ఎవరు ప్రింటు చేస్తారు” అన్నాను… అతని వైపు చూస్తూ,
“అన్నా నువ్ గట్ల అనకే.. కొత్త కొత్త పేపర్లు అచ్చినయి. బోలొడన్ని టీ.వి. ఛానళ్లు అచ్చినయి. ఒక్కోళ్ళకు 30వేలు, 40 వేలు జీతాలు “ఇస్తున్నరటకదన్నా” అన్నాడు యాద్గిరి అమాయకంగా,
“నువ్వు చెప్పిందాంట్లో నిజం లేకపోలేదు యాద్దిరి, కానీ అందరికి కాదు, కొన్ని కులాల వారికి, కొన్ని వర్గాలవారికి మాత్రమే అవకాశాలుంటాయంటే నువ్ నమ్మవ్, యాద్గిరి” అన్నాను.
“గదేందన్న, ఇలేకర్లల్ల గూడ గిట్లుందా అన్నాడు.
“నాతో నిజాలు చెప్పిస్తున్నావ్ యాద్గిరీ. అసలు ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలియదు. రాజకీయ నాయకులలాగ… అయితే ఇప్పుడు కొంత మార్పు వచ్చిందిలే, రాసే వాడికి ఉద్యోగం దొరుకుతుంది. అందులో అనుమానం లేదు. సాక్షి వచ్చింతరువాత పోటీ పెరిగింది. జీతాలు పెరిగాయి” అన్నాను.
యాద్గిరీ మనలో మనమాట కాని, “సాక్షి పేపరు సక్సెస్ కావాలని వై.ఎస్. జగన్ కంటే ఈనాడోల్లే ఎక్కువ కోరుకుంటున్నారు. తెలుసా యాద్గిరి? అన్నాను.
“గదేందన్నా గట్లంటవ్. ఈనాడోళ్ళు ఎందుకు అనుకుంటారు? నాకే సమజ్ కాలే” అన్నాడు యాద్దిరి.
ఈనాడోళ్ళంటే ఈనాడు మేనేజిమెంటు కాదు యాద్గిరీ…, ఈనాడులో పనిచేసే సిబ్బంది.., ఇప్పటివరకు ఈనాడే ఎక్కువ జీతాలు ఇచ్చేది. అంటే దాని సర్కులేషన్ ప్రకారం ఎక్కువ జీతాలున్నాయనుకో, కాని ఇప్పుడు అంతకంటే ఎక్కువ జీతాలు ఇస్తున్నారు. నిజం నిష్టూరంగా ఉంటుంది. యాద్గిరీ” అన్నాను.
“ఇదంతా కాదు కాని యద్గిరీ…, నేనొకటి అడుగుతాను సూటిగా జవాబు చెప్పు యాద్దిరీ…, మొన్న కరీంనగర్ ఉప ఎన్నికల్లో ఎప్పుడు ఎయ్యనోన్ని ఈ సారి టి.ఆర్.ఎస్. కి ఓటేస్తా అన్నావు కదా, ఎందుకో నిజంగా చెప్పు” అన్నాను. “అన్నా ..కె.సి.ఆర్. ని చూసి ఓటేస్తే అన్లేదన్నో తెలంగాణ కోసం ఓటేస్తనని చెప్పినన్న, తెలగాణా అచ్చినా, రాకున్నా, టి.ఆర్.ఎస్. పెట్టిందగ్గర్నుంచి అన్నిపార్టీలల్ల ఆఫీసులల్ల, తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు. ఎప్పుడన్న తెలంగాణ గురించి మాట గూడ మాట్లాడనోల్లు.. గిప్పుడు ఏదంటే గదే చేస్తే అంటున్నారు. కాల్వలు, చెరువులు, దన్న,, 50 ఏండ్లండ్ల ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు తప్ప, ఏ మన్న పెట్టినా అన్నా, గిప్పుడు’ యూనివర్సిటీలే కాదు, మెడికల్ కాలేజీలు, ఐ.ఐ.టీ.లు ఏమంటే గదే. అన్నా, గంతెందుకున్నా, నేనే కాదు కరీంనగర్ కె.సి.ఆర్.కి 2 లక్షల కంటే ఎక్కువ మెజారిటి అట్టిగనే రాలేదన్నా, తెలుగుదేశం, కాంగ్రెసోళ్ళ సపోర్ట్ చేసిన్లన్న” అన్నాడు యాద్గిరి.
“అదే యాద్గిరి నేను చెప్తున్నది, “సాక్షి పేపరు పెట్టిందగ్గరినుంచి ఒక్కో పేపరులో మూడు సార్లు జీతాలు పెంచారు. ఎప్పుడు ఎవరు రాజీనామా చేసి వెళ్ళి పోతారోనని మేనేజిమెంట్లు ఆలోచించే పరిస్థితి వచ్చింది. ఇంకా ఎన్నో ఛానళ్ళు వస్తున్నాయట. అవన్నీ ప్రారంభమైతే గానీ తెలుగు జర్నలిస్టులకు మంచి రోజులొచ్చిట్లే, దిస్ ఈజ్ గోల్డెన్ పీరియడ్ ఫర్ తెల్లు జర్నలిస్ట్ యిసయాలు చెప్పినప్”, అన్నాడు. “అన్నా! ఛాయ్ తాగుదాం రా, ఇయ్యాల సాన యిసయాలు చెప్పినప్” అన్నాడు. “ఛాయ్ వద్దు, ఏం వద్దు కాని, ఇంకోసారి విలేకర్లకిందని అనకు అంతే చాలు” అంటు అక్కడినించి కదిలాను నేను. “అన్నా, ఏం అనుకోకున్నా నాకు ఇన్ని విషయాలుదెల్వదున్నా” అంటున్నా, యాదగిరి మాటలను పట్టించుకోకుండా కదిలాను బరువెక్కిన గుండెతో…