దేశ వ్యాప్తంగా జరిగిన 7 అసెంబ్లీ ఉపఎన్నికలు అయిపోయాయి. ఇంతలోనే హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికల హడావుడి మొదలైంది. ఈ ఎన్నికల ప్రచార హోరులో దేశంలో జరిగిన ఎన్నో సంఘటనలు ప్రాధాన్యతను కోల్పోయాయి. ముఖ్యంగా గుజరాత్ లో జరిగిన మోర్బీ తీగల వంతెన ప్రమాదం ఒకటి. సంఘటన జరిగిన రోజు కాక, మరో రోజనుకుంటా..ఆ తరువాత టీవీలు, పత్రికలు మోర్బీ సంఘటన గూర్చి మర్చిపోయాయి. కాదు…. దాని ప్రాముఖ్యత మరుగున పడిపోయింది.
నిన్న మళ్ళీ ప్రధాని మోదీ మళ్ళీ గుజరాత్ ఎన్నికల ప్రచారానికి వెళ్ళారు. గుజరాత్ అభివృధ్ధి గురించి చెప్పారు. గుజరాత్ మోడల్ గురించి జబ్బలు చరుచుకున్నారు. గుజరాత్ ను నేను తయారు చేశాను(గుజరాత్ మాయ్ బన్వాయూ ఛే) అని ప్రకటించుకున్నారు. గత 20 ఏండ్లుగా గుజరాత్‌లో జరిగిన అభివృధ్ధిని గిట్టనివారు(ప్రతి పక్షాలు) అపఖ్యాతి పాలు చేస్తున్నారు. ప్రతి గుజరాతీకి ఈ గుజరాత్‌ను నేనే అభివృధ్ధి పరచానన్న భావన రావాలని, గుజరాతీలను సెంటుమెంటుతో ఆకర్శించాలని కొత్త రాగాన్ని అందుకున్నారు.కాని మోర్బీ తీగల వంతెన కూలిన ఘటన గుజరాత్ మోడల్ అన్న నినాదం కేవలం ప్రచార హోరు మాత్రమేనని రుజువైంది. అభివృధ్ధి కావాలంటే డబుల్ ఇంజిన్ సర్కారు అవసరమని బీజేపీ నేతల ప్రచారం పస లేనిదని దేశ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకు మోర్బీ సంఘటనను పరిశీలిస్తే….. గుజరాత్ ప్రభుత్వ పనితీరు ఇంత బాధ్యతా రహితంగా ఉంటుందా ? అని ముక్కున వేలేసుకునేలా చేస్తున్నది. దుర్ఘటన తరువాత కూడా ఆసుపత్రిలో మౌళిక వసతులు లేక పోవడం, బాధితులను చేర్పించిన తరువాత ఆదరా బాదరాగా ఏర్పాట్లు చేయడం అక్కడి వ్యవస్థ సిగ్గుపడేలా చేసింది. అధికారులూ దుర్ఘటనలో బాధితులకు అవసరమైన వైద్య సహాయం, తదితర సౌకర్యాలు అందజేయకుండా, తప్పు తమది కాదంటే..తమది కాదంటూ..చేతులు దులుపుకునే ప్రయత్నం చేసారు…..ఇదేనా.. గుజరాత్ మోడల్… మోర్బీ దుర్ఘటనలో… వ్యాహ్యాలి కని వెళ్ళిన 135 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో పిల్లలు, మహిళలే ఎక్కువ ఉన్నారు. అయితే దుర్ఘటనకు దేవుడే కారణమని అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉంది. ప్రకృతి విపత్తు సంభవించి ఉంటే ….పోని అని సరిపెట్టు కోవచ్చు… కానీ అలా బాధ్యాయుతమైన అధికారి అనడం సిగ్గుపడాల్సిన విషయం. అసలు తీగల వంతెనకు మరమ్మతులు చేసిన తరువాత సేఫ్టీ సర్టిఫికేటే జారీ కాలేదు. దుర్ఘటన జరిగిన తరువాత చిన్న చిన్న ఉద్యోగులపై కేసు బుక్ చేశారు తప్ప, ఇప్పటికీ మరమ్మత్తులు చేసిన కాంట్రాక్టరును అరెస్టు చేయలేదు. అసలు అతని అడ్రసే లేదు. 134 ఏండ్ల పురాతన వంతెన అది. దాని మరమ్మత్తులు చేయడానికి కాంట్రాక్టు పొందిన వ్యక్తి అర్హతలేమిటి. అసలాయనకు కాంట్రాక్టు కట్టబెట్టేందుకున్న కారణాలేమిటో ఇప్పటికీ తెలియరాలేదు. ఆయనకు ఓ గడియారం కంపెనీ ఉందట. అదలా ఉంచితే.. దుర్ఘటన జరిగటానికి కొద్ది రోజుల ముందే కాంట్రాక్టు పొందిన వ్యక్తి ఎంతో ఆర్భాటంగా తీగల వంతెనను పునః ప్రారంభిందుకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇంత జరిగినా గుజరాత్ ప్రభుత్వంలో పని చేస్తున్న ఉన్నతాధికారులు కిమ్మనలేదు. నక్కిన పేనులా ఉన్నారు. అంతే కాదు మరో అభివృధ్ధి చెందిన దేశంలో ఇలాంటి సంఘటన జరిగితే… పరిణామాలు వేరేలా ఉండేవి. ముఖ్యమంత్రి తన పదవికే రాజీనామా చేసి ఉండాలి. కాని ఆయన జాడ ఎక్కడా కనిపించలేదు. రెండు రోజుల తరువాత తీరిగ్గా వచ్చిన ప్రధాని మోదీ పర్యటనలో కనిపించారు ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్. ప్రధాని వస్తున్నారన్న సమాచారంతో ఆదరాబాదరాగా అక్కడి ఆసుపత్రిలో వసులకు మెరుగులు దిద్దారు అధికారులు. అప్పటి కప్పుడు కొత్త దుప్పట్లు, కొత్త మంచాలు దర్శనమిచాయి. ప్రధాన మంత్రి మోదీ వచ్చారు…వెళ్ళారు. ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న వారితో మాట్లాడారు…. కానీ… కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధితులతో మాట్లాడలేదు. …అంతా సవ్యంగానే ఉందనుకున్నారేమో… గుజరాత్ మోడల్..ఆదర్శంగా తీసుకున్నారు కదా. మోదీ…. దుర్ఘటనలో కుటుంబసభ్యులను కోల్పోయిన వారి ఆక్రందనలు వినిపించుకునే తీరకా..టైము ఆయనకెక్కడివి. ఎన్నికల హడావుడి.. టైమెక్కడిది? మన ఏలిన వారికి. కానీ ఓ బాధితురాలు టీవీ వాళ్ళతో మాట్లాడుతూ…ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం కోరుకుంటున్నారని మీరు అడుగుతున్నారు.. నా ఏడేళ్ళ కొడుకు చనిపోయాడు. తొమ్మిదేళ్ళ కూతురు చనిపోయింది. నా భర్త చనిపోయాడు. నేను ఒంటరిదాన్నయ్యాను. ఈ ప్రభుత్వం నాకు ఏ రకంగా సహాయం చేయగలదు. ప్రధాని వచ్చాడు పోయాడు కాని ఎవరినీ మాట్లాడనీయలేదు. ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న వారితో మట్లాడితే, వారేం ఫిర్యాదు చేస్తారు? అని ప్రశ్నించింది.
ఈ ప్రమాదం మిగిల్చిన ప్రశ్నలకు ఎవరు జవాబు చెప్తారు. అసలు ఇవి ప్రధాని దృష్టికి ఎవరు తీసుకు పోతారు. అసలు ఆ వంతెనపైకి అంతమందిని అనుమతించిన అధికారి ఎవరు? అసలు ఆ రోజు ఆ ఉన్నతాధికారి డ్యూటీ లో ఉన్నాడా?… అసలు తీగల వంతెనపైకి వెళ్ళడానికి పర్యాటకులకు టిక్కట్లు అమ్ముతున్న సంగతే అధికారులకు తెలియదా? అది నిజమా? అసలు అలా జరుగుతుందా? ఇలాంటి ప్రశ్నలు అడిగితే బీజేపీ ప్రభుత్వం, జాతీయ వాది కాదని ముద్రవేసినా వేస్తుంది. సంఘటన జరిగిన కొద్ది సేపటి తరువాత బీజేపీ సోషల్ మీడియా సైనికులు, నేతలు..ఇది అర్బన్ నక్సలైట్ల పనే అని ట్వీట్ చేశారు. గుజరాత్ ఎన్నికల్లో తమకు కంట్లో నలుసులాగ తయారైన ఆవ్‌ు ఆద్‌మీ పార్టీ వారిని దోషులుగా నిల్చోబెట్టాలని ఓ ప్రయత్నమూ చేశారు. దుర్ఘటనలో ప్రాణాలుకోల్పోయిన వారి కుటుంబ సభ్యులు బోరుమని ఏడుస్తుంటే శవాలమీద పేలాలు ఏరుకున్నట్లు.రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని అంటే..అందుకూ నిస్సిగ్గుగా , అందులో తప్పేముంది? అని అన్నారు.
గత 24 ఏండ్లుగా గుజరాత్‌లో బీజేపీ ప్రభుత్వం సుపరిపాలన అందిస్తున్నదని ఢంకా బజాయించి చెబుతామని అన్నారు. అందుకే దేశ వ్యాప్తంగా గుజరాత్ మాడల్ పాలన కావాలని కొనియాడుతున్నారన్నారు. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా ల ద్వయం.గుజరాత్ మోడల్ అంటూ గొంతు చించుకుంటారు. ప్రతి ఎన్నికల్లోనూ గుజరాత్ మోడల్ అంటూ రాగం అందుకుంటారు. నవ భారత్ నిర్మాణమంటారు. మరి గుజరాత్ మోడల్ దేశానికే ఆదర్శమైతే మోర్బీ తీగెల వంతెన ప్రమాదం మిగిల్చిన ప్రశ్నలకు జవాబు చెప్పగలరా? మోదీజీ..అమిత్ షా..జీ…