Monday - December 23, 2024

14 నెలల కిందటే చైనా కుట్ర

(రుద్రనేత్ర)
హైదరాబాద్‌, డిసెంబర్‌ 17: అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌ సెక్టార్‌ వాస్తవాధీన రేఖ వద్ద భారత బలగాలతో చైనా సైనికులు ఇటీవల ఘర్షణలకు దిగడం తెలిసిందే. అయితే, కిందటేడాది అక్టోబర్‌కి ముందే ఈ కుట్రకు డ్రాగన్‌ బీజం వేసినట్టు తాజాగా తెలిసింది. గత ఏడాది అక్టోబర్‌లో 17 వేల అడుగుల ఎత్తులో ఉన్న యాంగ్జ్సే పర్వతంపై పట్టు సాధించేందుకు చైనా బలగాలు ప్రయత్నించగా, భారత సైనికులు వారిని అప్పట్లో అడ్డగించారు. దీంతో అదే పర్వతంపై పట్టుకోసం డ్రాగన్‌ సైనికులు తాజాగా మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. కాగా, 2020 గల్వాన్‌ ఘటన తర్వాత భారత్‌, చైనా సైనికుల మధ్య భౌతిక దాడులు జరగటం మాత్రం ఇదే తొలిసారి. గల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణలో తెలంగాణకు చెందిన కర్నల్‌ సంతోష్‌బాబుతో సహా 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. దాదాపు 40 మంది చైనా సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయినట్టు వెల్లడైంది.

కీలకంగా యాంగ్జ్సే పర్వతం
భారత్‌-చైనా సరిహద్దు చాలావరకు సముద్రమట్టానికి వేల మీటర్ల ఎత్తులో పర్వతాలు, లోయలతో దుర్భేధ్యంగా ఉంటుంది. తాజాగా ఘర్షణలు జరిగిన యాంగ్జ్సే పర్వతం మీద నుంచి చూస్తే భారత్‌కు, చైనాకు అత్యంత కీలక సరిహద్దు అయిన తవాంగ్‌ లోయ స్పష్టంగా కనిపిస్తుంది. యాంగ్జ్సే ప్రదేశంపై ఎవరు ఆధిపత్యం వహిస్తే వారే.. తవాంగ్‌ లోయ మొత్తంపై ఆధిపత్యం వహించే అవకాశం ఉంటుంది. అందుకే చైనా భారత పరిధిలోని యాంగ్జ్సే ప్రాంతంపై కన్నేసింది. మరోవైపు, తూర్పు భారత్‌పై నిఘా పెట్టేందుకు చైనా కొన్నేండ్లుగా ప్రయత్నాలు చేస్తున్నది. ఇందులో భాగంగా అరుణాచల్‌ సరిహద్దులో గ్రామాలు నిర్మించడం, రోడ్లు వేయడం వంటి చర్యలు చేపట్టింది. తవాంగ్‌ సెక్టార్‌కు ఆనుకొని చైనా నిర్మించిన గ్రామాలు, రోడ్లు శాటిలైట్‌ చిత్రాల్లో కనిపిస్తున్నాయి.
డ్రాగన్‌ నోట్లోకి భారత భూములు
గల్వాన్‌ ఘర్షణల తర్వాత భారత్‌కు చెందిన నాలుగు కీలక ప్రాంతాలు చైనా ఆధీనంలోకి వెళ్లిపోయినట్టు రిటైర్డ్‌ ఆర్మీ కర్నల్స్‌ చెబుతున్నారు. 2020 ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకూ గల్వాన్‌, పాంగాంగ్‌ త్సో, గోగ్రా, హాట్‌స్ప్రింగ్స్‌ ప్రాంతాల నుంచి భారత్‌, చైనా బలగాలు వెనక్కి వెళ్లినట్టు రిటైర్డ్‌ కర్నల్‌, ప్రముఖ జర్నలిస్ట్‌ అజయ్‌ శుక్లా పేర్కొన్నారు. గతంలో ఈ నాలుగు ప్రాంతాలూ బఫర్‌ జోన్లుగా ఉండేవని, ఈ ప్రాంతాల్లో భారత ఆర్మీ గస్తీ నిర్వహించేదని ఆయన తెలిపారు. అయితే, ఇప్పుడు ఆ ప్రాంతాల్లో గస్తీ నిర్వహించడానికి భారత ఆర్మీకి అధికారం లేదని, ఆ ప్రాంతాలపై హక్కును మనం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ సర్కారు కారణంగానే ఈ పరిస్థితి దాపురించినట్టు ధ్వజమెత్తారు. కాగా, తూర్పు లఢక్‌లోని పెట్రోలింగ్‌ పాయింట్‌ 15తో పాటు పెట్రోలింగ్‌ పాయింట్‌ 16 (పీపీ-16) నుంచి కూడా ఇరు దేశాల బలగాలు వెనక్కి తగ్గాయని లఢక్‌ అటానమస్‌ హిల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌కు చెందిన కౌన్సిలర్‌ కొంచక్‌ స్టాంజిన్‌ ఇటీవల పేర్కొనడం తెలిసిందే. పీపీ-16 పూర్తిగా భారత్‌కు చెందినదేనని ఆయన అన్నారు. అయితే, ఇప్పుడు ఆ ప్రాంతం బఫర్‌ జోన్‌గా మారిపోయిందని, ఆ నేలపై ఇక భారత ఆర్మీ గస్తీ నిర్వహించలేదని తెలిపారు.

Related Posts

Cartoons Sence

Galleries

Latest Updates