Monday - December 23, 2024

తప్పెవరిది ?

‘తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు. విశ్వదాభి రామ వినుర వేమ…….

ఏంది యాద్గిరీ?.. ఎప్పుడూ సినిమా పాటలు పాడుతుండేవాడివి. వేమన పద్యాలు పాడుతున్నావు?’ అనడంతో పద్యాలు పాడుకుంటూ వెలుతున్న యాద్గిరి వెనక్కి తిరిగి చూసాడు .

‘నమస్తే అన్నా! చాల్దినాలాయె కన్పించక’ .. అన్నాడు . మళ్ళీ అతడే… ఎందన్నో .., ‘ఈ ద్ కా చాంద్.. అయినవ్ గదే పేపర్లున్నవా? మారినవా? పేపర్లు, కొత్త పేపర్లకైన,  టీ.వీల కేమయిన పోయినావా?’ అన్నాడు.

‘ఇంకా ఎక్కడికి పోలేదు. అదే పేపర్లో ఉన్నాను’ అన్నాను.

‘అదే గదేందన్నా నీవు సాన సీనియర్ కదా ఐ.టి. బూమ్ లాగ ఇలేఖర్లకు కూడా మన రాష్ట్రంలో పాన డిమాండ్ అచ్చిందట కదా!’ అన్నాడు .

‘సరేలే… నువ్వన్నదీ నిజమే. కానీ ఇప్పుడున్న కష్టాలు.. ఇప్పుడూ ఉన్నాయి. ఇప్పుడే కాదు. ఎప్పుడూ ఉంటాయి. సీత బాధలు సీతవి. పీత బాధలు పీతవి అన్నట్లు’ అన్నాను.

“ఏందన్నా.. అంత నిరాశగున్నవ్. అందరూ ఖుష్ అయితుంటే నువ్వేమో గట్ల మాట్లాడతవ్’ అన్నాడు

“సరేలే నడుస్తూ మాట్లాడుకుందాం పద’ అంటూ టాపిక్ మారుద్దామని ‘చాయ్ తాగుదాం పా’…. అన్నాను. ‘సరే అన్నా.. ఛాయ్ తాగుదాం… కాని ముందు ఈ సంగతి చెప్పన్న, కొత్తగా ఎన్.టి.వి.. టి.వి.5. సాక్షి, ఈ వారం, ఈ భూమి – ఎన్నో కొత్త పత్రికలు టివిలల్లా జీతం డబుల్ ఇస్తున్నారట. నిజమేనా? నువ్వెందుకు పోతలెవ్” అన్నాడు .

టాపిక్ మారుద్దామని ‘ప్రతిదానికి ఏదో కారణం ఉంటుంది. టైం రావాలి కదా… అయినా అవి నిలదొక్కుకోవాలి. అందుకు, ఒకరితో పోటీ పడాలి… ప్రజలను ఆకర్శించాలి” అన్నాను. అంతలో ఛాయ్ బండివద్దకు రావడంతో .

“అరేయ్ చిన్నా… దో ఛాయ్ తేరా? ..జబర్దస్త్ చేయాలే” అని అరుస్తూ అన్నాడు.

 ‘పోటీ అంటే గుర్తొచ్చింది. మీ మధ్యే కన్న.. ఈ మధ్యేకాదన్న రాజకీయాల్లో పోటీ పెరిగినట్లున్నది. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏం తిట్టుకుంటున్నరన్నా” అన్నాడు.

నేనేం మాట్లాడకుండా తలాడించాను.

 తనే చెప్పుకుంటా వెల్తున్నాడు. “అన్నా… ఈ మధ్య ముఖ్య మంత్రిని ఏమో అన్నదని కాంగ్రెస్ నాయకురాలు గంగా భవాని – తన గ్యాంగ్ను తీసుకుని రాజకుమారి ఇంటకాడికిపోయి లొల్లి చేసిందట. ఏందో కోస్త.. కొస్త అని కూడ అన్నదట. అన్నా! టి. విల పుల్లు చూపిండ్రు కదా…”.

 నా వైపు చూస్తున్న నేనేమి మాట్లాడకుండానే తిరిగి – ‘అన్నా ! గి సిన్మా హీరోయిన్ రోజా టి.ఆర్.ఎస్ ప్రెసిడెంట్ కె.సి.ఆర్ ని రాత్రంత తాగుతాడు. పొద్దుపోయ్యేదాక పంటండు. రాత్రి  బార్.. పగలు దర్బార్ అన్నదట” అన్నాడు నా వైపు చూస్తూ. నేనేమి చెప్పాల్లో అర్ధం కాక ‘అవును. ఇవన్నీ వివాదాలయ్యాయి కదా!’ అన్నాను. తప్పించుకోవాలని….

“అదే అన్న..మీ పేపరోళ్ళు…. అది తప్పు ఇది తప్పు అంటారు కాని మీ తప్పులు మీకు తెలియవా?’ అన్నాడు నిలదీస్తూ యాద్గిరి. చాలా కోపంగా ఉన్నట్లున్నాడు. సరేలే ఆయన అభిప్రాయం ఏమిటో తెలుసుకుందామని “పేపరోళ్ళు ఏం తప్పు చేశారు. మంచిగా రాస్తే విలేఖర్లు మంచివాళ్ళు.. వ్యతిరేకంగా రాస్తే చెడ్డోళ్ళు… ఇదంతా మామూలే కదా… నువ్వు మమ్మల్ని తప్పు పడ్తున్నవంటే, నేనేం చెప్పాలి” అన్నాను.

దాంతో  అది కాదన్నా ‘లీడర్లంటే తప్పులు మాట్లాడతారు, తప్పులు చేస్తారు. అందుకే వాళ్ళను ప్రజలు ఓడిస్తారు. కాని ప్రజాస్వామ్యాన్ని కాపాడి ప్రజల అవసరాలను గుర్తించి “మెరుగైన సమాజం కోసం” భవిష్యత్తుకు మార్గం చూపే టివి, పత్రికల వాళ్ళు మీరే తప్పు చేస్తే ఎలాగన్న!’ అన్నాడు.

‘ఇరుక్కు పోయాను భగవంతుడా’ అనుకుంటూ “అసలేం తప్పు జరిగింది? కొంపలు అంటుకు పోయినట్లు ఇవ్వాళ మా మీద పడ్డావెందుకు?” అన్నాను.

అంతలోనే ఛాయ్ ఇవ్వడంతో ఛాయ్ తాగుతూ వింటున్నాను  ఏం చెబుతాడో.. అని. “అన్నా! నిజం చెప్పు అన్నా! నువ్వు కరెక్టు మాట్లాడతవ్ అనుకుంటే గిదేందన్న చెప్త లేవు. తమ్ముడు తనవాడైన ధర్మం చెప్పాలి అంటావు కదా నువ్వు” అన్నాడు.

తిరిగి  “అన్నా నువ్వు చెప్పన్న గంగా భవాని గొడవ, రోజా లొల్లి అంత పొద్దందాక టివిల్ల సూపిచ్చిన్రు, సరే మన లీడర్లు ఇసోంటళ్ళని పబ్లిక్కు దెలవాలని సూపిచ్చిన్రు అనుకుందాం. తరువాత రోజా – తిట్టిందాని మీద అర్థగంట కొచ్చన్ అవర్ చూపింద్రు కదా. అదీ కాక చిరంజీవి బిడ్డ లవ్ స్టోరి – గదే. శ్రీజ పెండ్లి చేసుకున్నది. ఫుల్లుగ చూపించిన్రు. తరువాత చిరంజీవి రియాక్షన్ ఏం ఉంటని చూపించున్రు. చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ తుపాకి సరెండర్ చేసిందీ,  కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్సు గురించి నిమిష నిమిషానికి చూపించారు. వార్తను వార్తగా చూపించకుండా ఒక్కో టివిలో ఒక్కొక్క రకంగా చూపించారు. ఆ మధ్య పిల్లోడి కిడ్నాప్ గురించి గొప్పగా చూపించారు. గివ్వన్ని ఒక. ఎత్తైతే రోజు క్రైం ఫైల్ అంటూ ఎవరెలా నేరాలు చేస్తున్నారో, ఎలా చెయ్యొచ్చో అని, ఆలోచన రాని వారికి సచిత్ర కథనంలో కల్పిత పాత్రలతో ప్రతి పూట, ప్రతి దినము చూపిస్తున్నారు’. అన్నాడు.  గుక్కతిప్పుకోకుండా,

“టివిల్లో చూపిస్తే ఆ నేరాలు మీరు చేయమని అర్ధమా?” అన్నాను తప్పించుకోవాలని,

 కోపంగా చూస్తూ “అన్నా, నువ్వు గట్లంటవేందే! మొన్న మా గల్లీల పోరగాళ్ళు గోళీలు ఆడుకుంట…ఆడుకుంట… కోట్లాడుకున్నారు. ఒక పోరడు మొత్తం గోళీలు ఓడిపోయిండంట…. ఏడ్సుకుంట కూసున్నాడు. గంతల ఇంకో పోరడు ఎక్కిరించిండంట అనికి కోపమచ్చి పక్కనే ఉన్న ఒక పెద్ద బండ లేపిండు. సంపుత… నా కొడకా… తల మీద ఏస్తే దెబ్బకు నీళ్ళడుగకుండా సస్తవ్” అంటే, గోళీలు గెలిసిన పోరడు భయంతో ఉరికిండు. నేను గంతల్నే ఆడికి చేరిన, బండ లేపిన పోరన్ని ఆపి సముదాయించి… పంపిచ్చిన, నేను పోకుంటే ఆ పోరడు అన్ని సంపుతుండే ” అన్నాడు.

ఏం జవాబు చెప్పాలో అర్ధంకాక మిన్నకున్న.

 నన్ను చూసి  మళ్ళీ “అన్న గప్పుడు వేమన ఎన్నో పద్యాలో రాసిండు.. గదా.

నాసిన్నప్పుడు సదివిన. గందుకే నేమో. –

. తప్పు లెన్నువారు తండోపతండంబు

 లుర్వి జనులకెల్ల నుండు తప్పు

తప్పు లెన్నువారు తమ తప్పులెరుగరు,

విశ్వదాభి రామ వినుర వేమ. అని రాసిండు” అన్నాడు.

 “సరే యాదిరి నువ్వన్నది నిజమే, కాని ప్రజలు చూస్తున్నారు, కాబట్టి టివీలు చూపిస్తున్నాయి. ఓట్లు వేస్తున్నారు కాబట్టే రౌడీలు, భూకబ్జాదార్లు.. ఎలక్షన్లల నిలబడ్తున్నారు. తీరా నాయకులైన తరువాత ఇలా అంటే ఎలా?” అన్నాను నేను.

“అన్నా మళ్ళీ నువ్వు ఓట్ల గురించి మాట్లాడుతున్నావ్ మొత్తం ఓటర్లల్ల పోలయ్యె ఓట్లు 50 నుంచి 60 శాతం ఉంటలేవు. పోటీ చేసేటోళ్ళు ఇద్దరు ముగ్గురే ఉన్నా.. ఆళ్ళకు ఓటేసేటోళ్ళు కంటే, ఈ ఎలక్షన్ మీద నమ్మకం లేక ఓటెయ్యనోట్లే ఎక్కువ ఉంటరన్నా” అన్నాడు.

మళ్ళీ అతడే – “మెజార్టీతో గెలిచామంటారే తప్ప మెజార్టీ ఓటర్లు నిలబడ్డ ఎవరికి ఓటెయ్యలేదని ఎందుకనరన్న ?  గిట్ల మాట్లాడితే నక్సలైటంటరన్న” అన్నాడు. చర్చను ముగిద్దామని ” సరే మళ్ళీ కలుస్తా … ఆఫీసు టై మైంది” అంటూ కదిలాను.

Related Posts

Cartoons Sence

Galleries

Latest Updates