ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించిన సందర్భంగా ఆత్మీయ సమ్మేళనంలో సీఎం రేవంత్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ప్రైవేటు టీచర్లను నిరాశ పరుస్తున్నాయి. ఇంటర్, డిగ్రీ ఫెయిల్ అయిన వారితో ప్రైవేట్ స్కూల్స్ నడుపుతున్నారని చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేపాయి.
ఇంటర్, డిగ్రీ ఫెయిల్ అయి ప్రైవేట్ స్కూల్స్ నడుపుతున్నారంటే దేనికి సంకేతం? అది ప్రభుత్వ వైఫల్యం కిందకు రాదా? ఈ విషయంలో అధికారుల పనిని కూడా నిర్వీర్యం చేసినట్లు కాదా? అసలు ప్రైవేట్ స్కూల్స్ కు గుర్తింపు ఎట్లా వస్తది.
గవర్నమెంట్ టీచర్లకు, ప్రైవేట్ టీచర్లకు చాలా తేడాలు ఉంటాయి. గవర్నమెంట్ టీచర్లు ప్రభుత్వ విద్య విధాన నిబంధనల మేరకు పనిచేస్తే సరిపోతుంది. కానీ ప్రైవేటు టీచర్లకు అలా కాదు. వాళ్లు కొంత మెరుగైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తది. స్కూల్స్ లో మంచి ర్యాంకులు తేవడం, స్టూడెంట్, పేరెంట్స్ లో మంచి పేరు తెచ్చుకోవడం, సొసైటీలో స్కూల్ ఇమేజ్ ను కాపాడుకోవడం వంటి వాటిని ఎదుర్కోవాల్సి వస్తది. ఇదంతా ఉన్నా… ఏడాదికి ఆ ఉద్యోగం ఉంటుందో, ఊడుతుందో తెలియని పరిస్థితి. ఒకవేళ వాళ్ళు మంచి జీతం కోసం కావాలంటే, మరో ప్రైవేట్ స్కూల్ కి మారతారు. అక్కడ ఉన్నత పోస్టు తీసుకున్నా కూడా.. విధానంలో మార్పు మాత్రం ఉండదు. ఆ స్కూల్లో కూడా మంచి ర్యాంకులు, మంచి పేరు, స్కూలు సొసైటీ పేరు కాపాడాల్సిన పరిస్థితి. ప్రభుత్వ టీచర్లకు అలా కాదు. ఒకసారి ఉద్యోగం సంపాదిస్తే చాలు జీవితమంతా సాఫీగా గడిపేయవచ్చు. ప్రైవేట్ టీచర్లుమాత్రం ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాల్సిందే.
అసలు సీఎం రేవంత్ ప్రైవేట్ టీచర్లపై మాట్లాడిన మాటలు ప్రభుత్వ టీచర్లకు ఉత్సాహం కల్పిస్తుందేమో గానీ ఉన్నత పరిస్థితి మాత్రం రాదని పలువురు ప్రైవేట్ టీచర్లు, విద్యా నిపుణులు అంటున్నారు. గత సర్కార్ లో అర్హత లేకుండా స్కూల్ పర్మిషన్ ఇచ్చినట్లుగా, అధికారులు, గవర్నమెంట్ టీచర్లు ఇంకా బాగా పనిచేయాలని, అందుకే మీకు పదోన్నతులు కల్పించామని, పరోక్షంగా చెప్పేందుకే ప్రైవేట్ టీచర్లపై ఆరోపణలు చేస్తున్నట్లు ఉందని మేధావులు విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
గతంలో గానీ, ప్రస్తుతం గానీ, సీఎం రేవంత్ చెప్పిన విధంగా ఏ ప్రైవేట్ స్కూల్ అయినా ఏ క్వాలిఫికేషన్ లేకుండా నడిచిందా..?, అలాంటి స్కూల్స్ ఎన్ని గుర్తించారు? ఆ స్కూల్స్ కి పర్మిషన్ ఇచ్చే విద్య శాఖ అధికారులపై ఎంతవరకు కఠిన చర్యలు తీసుకున్నారు? అన్న వరుసలో ప్రశ్నల వర్షం కురుస్తున్నాయి. ఇది అంతా ప్రభుత్వ టీచర్లకు పదోన్నతులు కల్పించేందుకు గానూ సీఎం ఏదో ఫలితం ఆశించే భాగంగానే మాట్లాడారని ప్రైవేట్ టీచర్ల నుంచి విమర్శలు వస్తున్నాయి.
ప్రభుత్వ టీచర్లకు పదోన్నతులు ఇచ్చి, ప్రైవేట్ టీచర్లపై నిరాశపరిచే వ్యాఖ్యలు చేసినంత మాత్రాన ప్రైవేటు టీచర్లకు ఇమేజ్ ఏ మాత్రం తగ్గదని అంటున్నాయి ప్రైవేట్ టీచర్ల సంఘాలు. ప్రైవేట్ టీచర్లను కించ పరుస్తున్నారు అంటే.. గవర్నమెంట్ టీచర్లు మరింత బాగా పనిచేయాలని పరోక్షంగా చెప్పడమే. ఎందుకంటే ప్రభుత్వ స్కూలులో సరైన సౌకర్యాలు ఉండవని, అక్కడ టీచర్లు బాధ్యతగా ఉండరని విద్యార్థుల తల్లిదండ్రుల్లో బలమైన భావం ఉంది. మంచి కార్పొరేట్ స్కూల్స్ లో ఉపాధ్యాయులు, మౌలిక వసతులను చూసిన తరువాతే కదా విద్యాశాఖ అధికారులు గుర్తింపు ఇస్తారు… మరి గవర్నమెంట్ టీచర్లు గవర్నమెంట్ స్కూలులో ఆ సౌకర్యాలు మీద ఎందుకు దృష్టి పెట్టరు అనే భావన… విద్యార్థులు తల్లిదండ్రుల్లో మెదులుతోంది. అసలు ఇంటర్ డిగ్రీ ఫెయిల్ అయిన వారితో ప్రైవేట్ స్కూల్ నడుపుతున్నారనే అంశం సీఎం దృష్టి వరకు వెళ్లిందంటే… అది విద్యా శాఖ అధికారులతో పాటు ప్రభుత్వ వైఫల్యం కూడా ఉంటుందనే భయంతోనే అన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్ కు పర్మిషన్ ఇచ్చింది విద్యాశాఖ అధికారులే కాబట్టి ప్రభుత్వము కూడా భాగస్వామ్యం అయినట్లే కదా… మరి గవర్నమెంట్ టీచర్లకు రేవంత్ రెడ్డి ఏం మెసేజ్ ఇస్తున్నట్లు…?
కొన్ని ప్రభుత్వ స్కూల్స్ కు మౌలిక సదుపాయాలు ఉండవు, టీచర్లు ఉండరు, అధికారులు పట్టించుకోరు, విద్యార్థులు, తల్లిదండ్రులకు సంతృప్తి ఉండదు. కొన్ని నియోజకవర్గాల్లోని గ్రామాల్లో అయితే అసలు ప్రభుత్వ స్కూల్స్ కనుమరుగు. వాటిపై దృష్టి పెట్టకుండా ప్రైవేట్ టీచర్లను కించపరచడం ఎంతవరకు సమంజసం అంటున్నారు ప్రైవేటు ఉపాధ్యాయులు. ప్రభుత్వ స్కూల్స్, టీచర్లలో లోపాలు ఉన్నాయి కాబట్టే ప్రైవేట్ స్కూల్స్ లో ఎక్కువ మంది చేరుతున్నారు. మరి ఆ లోపాలు ఎందుకు సరిదిద్దడం లేదు? ప్రభుత్వ స్కూల్లో సంఖ్య ఎందుకు తగ్గుతుందో ఆలోచిస్తున్నారా..? విద్యార్థుల నైపుణ్య విషయంలో ప్రైవేట్ స్కూల్ పిల్లలు ఎందుకు ముందుంటున్నారు… ప్రైవేట్ టీచర్ లక్ష్యం విద్యార్థికి మంచి ఫలితం సాధించేలా చేయడమే. మరి ప్రభుత్వ టీచర్ లక్ష్యాన్ని ఎవరైనా పర్యవేక్షిస్తున్నారా…? స్కూల్స్ లో తనిఖీలు చేస్తున్నారా..? ప్రైవేట్ స్కూల్స్ పై, విద్యార్థుల సంఖ్య, వారి సదుపాయాలపై పెట్టిన శ్రద్ధ…. ప్రభుత్వ స్కూల్లు, విద్యార్థులు, టీచర్లపై పెట్టకుండా ఏం చేస్తున్నారు… బిఈడి, డీఎస్సీ, చేసినా ఉద్యోగాలు ఉండవు, ప్రభుత్వం భర్తీ చేస్తున్నట్లు ప్రకటించినా అవి కేవలం ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి. మరి ప్రైవేటు ఉద్యోగం చేసుకోకపోతే ఎలా ముందుకు సాగాలి..? దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెబుతారు..?
ఓట్ల సమయంలోనే ప్రైవేట్ టీచర్లు, సంఘాలు గుర్తుకొస్తాయి. తర్వాత మర్చిపోతారు. కానీ ప్రభుత్వ టీచర్లు అలా కాదు కదా… ప్రభుత్వంతో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన పరిస్థితి. ప్రభుత్వం నడుపుతున్న రేవంత్ రెడ్డికి ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువగా ఉండటం, అందులో విద్యార్థులు ఎక్కువగా చేరడం పై ఆక్కసు పెట్టుకోవడం సరైనది కాదు.. ప్రైవేట్ టీచర్లను కించపరిచి, ప్రభుత్వ టీచర్లను సంతృప్తి పరచాలనే భావనను పక్కనపెట్టి… ప్రైవేట్ స్కూల్స్ కు పోటీగా ఉండేలా ప్రభుత్వ స్కూల్స్ ను తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే విద్యాశాఖ సీఎం దగ్గరే ఉంది కాబట్టి. ప్రైవేట్ స్కూల్స్ లో తమ పిల్లల్ని వేస్తే భవిష్యత్తు బాగుంటుందనే తల్లిదండ్రుల భావనను…. పదోన్నతులు తీసుకున్న టీచర్లు, విద్యాధికారులు మార్చే ప్రయత్నం చేసి, ప్రభుత్వ స్కూల్లో చేర్పించేలా చేయాలని చెప్పలేక పోతున్నారు. అందుకే ప్రైవేట్ టీచర్లను నిందించడం విమర్శించడం అవమానించేలా చేస్తున్నారు. ప్రభుత్వ టీచర్లకు పదోన్నతులు ఇచ్చినందుకు మాకు మంచి ఫలితం ఇవ్వాలనే సీఎం రేవంత్ రెడ్డి అడగలేక పోతున్నారు. ప్రైవేట్ టీచర్లు ఇంటర్, డిగ్రీ, ఫెయిల్ అయి స్కూల్స్ నడుపుతున్నారన్న దానపై ఇంత శ్రద్ధ పెడుతున్నారు అంటే…. ప్రభుత్వ టీచర్లకు పదోన్నతులు ఇచ్చిన కూడా ఫెయిల్ అయిన ప్రైవేట్ వారితో సమానంగా పనిచేయలేకపోతున్నారని పరోక్షంగా విమర్శించినట్లే. ప్రభుత్వ టీచర్లకు భయపడి ఇదంతా చేస్తున్నారు. ప్రైవేట్ టీచర్లపై ఇలాంటి వ్యాఖ్యలు చేసినా సొసైటీలో విద్యార్థుల భవిష్యత్తుకు ప్రైవేటు టీచర్లే బాటసగా నిలుస్తున్నారని పరోక్ష భావనను రేవంత్ రెడ్డి తెలియ చే సినట్లే…
….. పట్ట. హరనాథ్



