నేస్తం!
పెళ్లి సంబరం అంతా అయిపోయింది,‘
తోరణాలు కూడా తలదించుకున్నాయి,‘
కొంచెం సంతోషాన్ని,
ఇంకొంచెం బాధ’ ను
మిగుల్చుతున్నాయి,
ఎక్కడి నుంచి ఎలా వచ్చాడో తెలియనే లేదు,
నిన్ను సొంతం చేసుకున్నాడు,
నాకు దూరం చేశాడు,
ఓ ఆగంతకుడు,
ఆ అపరిచిత పరిచయస్తుడు,
ఇప్పటికీ పెదవుల మీద,
ఎప్పటికీ చెరగని చిరునవ్వును,
ధరించడానికి నా గుండెల్లో
ఎంత యుద్ధం చేస్తున్నానో,
నువ్వు ఊహించావా?
కంటిలోని తడి ఆవిరై పోకుండా,
ఉబికి వచ్చిన కన్నీళ్లను రెప్ప దాటి పోకుండా,
కన్నీళ్లే ఆనందభాష్పాలుగా మార్చి, ఎంత నేర్పుగా,
ఓర్పుతో ఒడిసి పట్టుకున్నానో,
ఒకసారైనా ఊహించావా?,
సముద్రమంత అతని చేతుల్లో,
ఆకాశమంత అతని దీర్ఘ బాహువుల్లో ‘
రెక్కలపై రంగురంగుల ఇంద్రచాపాల్ని
సంధించుకున్న సీతాకోకచిలుకలా,
నువ్వెలా ఎగరగలవుతున్నావు?
నన్ను ప్రేమగా పిలిచి,
ఉన్నట్టుండి చెవిలో రహస్యం ఊది,
చటుక్కున బుగ్గన ముద్దు పెట్టి,
చేతిలో చిరునామా చీటీ పెట్టి,
తృప్తిగా నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోయావా?
సముద్రాన్ని కవ్వించే కరచాలనం అయినా,
ఆకాశాలను చిన్న బుచ్చే ఆలింగనాలయినా,
గుండె సవ్వడి లిప్తకాలం నొక్కి పట్టే,
అచుంబిత చుంబనాలయినా,
కావలసిది కేవలం శరీరాలు కాదు కదా!
అడ్రస్సు శరీరాన్ని పట్టి ఇవ్వగలవేమో కానీ,
మనసుని మాత్రం పట్టించలేవు కదా,
నేస్తం….
నాకు ఊహ తెలిసిన క్షణం నుండి,
మన స్నేహం ప్రాణ స్నేహమై,
నా ఆత్మ నీ శిరస్సు చుట్టూ
,ఆత్మ వలయమై,
పరిభ్రమిస్తూనే ఉందని మరిచావా?
రచన:ఎం.ఎం.ఎస్.కుమార్.