Monday - December 23, 2024

ఉత్తరాఖండ్ లో 7,500 గ్రామాల్లో ఇంకా బ్రిటిష్ కాలం నాటి పాలనా పద్దతే…

హైదరాబాద్, అక్టోబర్ 16; అభివృధ్ధికి ఆలవాలం డబుల్ ఇంజిన్ సర్కారంటూ ఢంకా బజాయించుకునే బీజేపీ నాయకులకు, ఉత్తరాఖండ్ లో అరాచకం రాజ్య మేలుతున్నా.. కనిపించటం లేదు. ఆస్ధిపాస్తులే కాదు..మనిషి ప్రాణాలకూ భద్రత లేదు.. శాంతి భద్రతలు కాపాడటానికి కొండ ప్రాంతాల్లోని గ్రామాల్లో పోలీసు వ్యవస్థే లేదు. 75 ఏండ్ల స్వతంత్ర అమృతోత్సవాలు జరుపుకోవడానికి మోదీ సర్కారు కోట్లు ఖర్చు పెట్టింది, కాని ఉత్తరాఖండ్ లో వేల గ్రామాల్లో 130 ఏండ్ల నాటి బ్రిటిష్ ప్రభుత్వ పాలనా పద్దతే అమలు జరుగుతున్నదంటే అతిశయోక్తికాదు. వలస పాలకులైన ఆంగ్లేయల కాలంలో గ్రామాల్లో శాంతి-భద్రతల భాధ్యత ఆ యా గ్రామాల రెవిన్యూ అధికారులైన పట్వారీలకు ఉండేది. పట్వారీలంటే భూ శిస్తు , తదితర భూ సంబంధిత రెవిన్యూ వ్యవహారాలు చూసేవారు. 1861 లో బ్రిటిష్ పాలకుల కాలంలో.. కొండ ప్రాంతాల్లో పోలీసు స్టేషన్ల ఏర్పాటుకు అనువైన పరిస్థితులు లేక పోవడంవల్ల ఆ బాధ్యతలను అక్కడున్న రెవిన్యూ విభాగపు అధికారులకు అంటే పట్వారీలకు అప్పగించారు. అయితే 75 ఏండ్ల స్వతంత్రం తరువాత కూడా ఇంకా ఇప్పటికీ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కొండ ప్రాంతాల్లో 7,500 గ్రామాల్లో బ్రిటిష్ పాలకుల పాలనా వ్యవస్ధ వాసనలు పోలేదు. అంతే కాదు ఉత్తరాఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి రెండు దశాబ్దాలు దాటినా అక్కడి ప్రభుత్వాలకు మాత్రం ఆ కొండ ప్రాంతాల్లో పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేయాలని అనిపించలేదు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కొండ ప్రాంతాల్లో పర్యాటక రంగం వేగంగా అభివృధ్ధి చెందుతున్నది. హోటళ్ళు, రిసార్టులు, అడ్వెంచర్ క్లబ్ పర్వతారోహణ( ట్రెక్కింగ్) లాంటి కార్యకలాపాలు పుంజుకున్నాయి. కాని పోలీసుల వ్యవస్ధ లేనందువల్లఅక్కడ పర్యాటకులకు ఎలాంటి భద్రత లేకుండా ఉంది. అక్కడ జరిగే నేరాలు, ఘర్షణలు శాంతి భద్రతలగురించిన ఫిర్యాదులపై ముందుగా రెవిన్యూ విభాగానికి చెందిన అధికారులైన పట్వారీకే ఫిర్యాదుచేయాలి. వారే ఫిర్యాదులపై విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తారు.
అయితే ఇటీవల ఉత్తరాఖండ్ లోని రిషీకేశ్ సమీపంలోని రిసార్ట్ లో 19 ఏండ్ల అమ్మాయి అంకితా భండారి హత్యకు గురైన సంఘటన అందరికి తెలిసిందే. అంకితా భండారీ కనిపించకపోవడంతో ముందుగా, అక్కడి రెవిన్యూ పోలీసు అధికారి ( పట్వారీ) ఫిర్యాదు అందినా, దాన్ని ఓ మిస్సింగ్ కేసుగా యాంత్రికంగా నమోదు చేసుకున్నారే, తప్ప సమగ్ర విచారణే జరుపలేదని తేలింది. . అయితే మూడు నెలలకిందే రిసెప్షనిస్టు గా చేరిన రిసెప్షనిస్టు అంకితా భండారీని, ఆ రిసార్టు యజమాని అయిన బీజేపీ నాయకుడు వినోద్ ఆర్య, కొడుకు పుల్కిత్… హత్యచేశాడని బలమైన ఆరోపణలున్నాయి. వ్యభిచారం చేయాలంటూఆమెపై ఒత్తిడి తెచ్చాడని, ఆమె ఒప్పుకోకపోవడంతో పుల్కిత్ చెరువులోకి నెట్టివేసి హత్య చేశాడన్న వార్తలు పుంఖాను పుంఖాలుగా వచ్చాయి. తన కొడుకును కాపాడుకోవడానికి రిసార్టు యజమాని,, బీజేపీ నాయకుడు వినోద్ ఆర్య, ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే రిసార్టును బుల్డోజర్లతో కూల్చివేశాడు. దాంతో అంకిత్ భండారీ హత్యకున్న సాక్షాలు దొరకకుండా చేయడానికే రిసార్టు భవనాన్నే నేలమట్టం చేశాడని బీజేపీ నాయకుడిపై ఆరోపణలున్నాయి.
ఈ సంఘటనతో డబుల్ ఇంజిన్ సర్కారు ఇబ్బందుల్లో పడింది. ఉత్తరాఖండ్ భౌగోళికంగా ఉన్న కొండ ప్రాంతాల్లోని 60 శాతం ప్రాంతాల్లో… అంటే 7500 గ్రామాల్లో ఇప్పటీకీ పాత కాలపు పద్దతిలో రెవిన్యూ అధికారులతోనే ( పట్వారీ ) శాంతి భద్రతల వ్యవస్ధ కొనసాగుతున్నదన్న సంగతి అక్షరాల నిజం. బీజేపీ నేతల అరాచకాల నేపధ్యంలో ప్రజలనుంచి పెద్ద ఎత్తున నిరసనలు రావడంతోనూ, కొండ ప్రాంతాల్లోని రిసార్టులకు వచ్చే పర్యాటకులకు భద్రత కరువవడంతోనూ, డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి పోలీసు వ్యవస్ధను ఏర్పాటు చేయక తప్పని పరిస్థితి ఏర్పడ్డది. ఆ ప్రాంతాల్లో 6 పోలీసు స్టేషన్లు, 20 పోలీసు అవుట్ పోస్టులను ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది. కొద్దిరోజుల్లో హిల్ స్టేషన్ల ప్రాంత మైన యమకేశ్వర్ ( పౌరి), ఛమ్( తెహేరీ), ఘాట్( ఛమోలీ), ఖాన్స్యూ( నైనితాల్), దేఘాట్ మరియు దౌల్ ( అల్మోరా)ల లో పోలీసుల ఠాణాలు ఏర్పాటు కానున్నాయి. మరో 20 ప్రాంతాల్లో పోలీసు అవుట్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రజావ్యతిరేకతనుంచి తప్పించుకోవడానికి బీజేపీ డబుల్ ఇంజన్ సర్కారుప్రయత్నిస్తోంది. ప్రజల ధన,మాన,ప్రాణాల రక్షణ కల్పించడానికి కనీసం పోలీసు ఠాణాలు ఏర్పాటు చేయలేదు. రెండు దశాబ్దాల నుండి మీనమేషాలు లెక్కపెడుతున్న రాష్ట్రప్రభుత్వాల చిత్తశుధ్ధి ఏపాటిదో ఎవరైనా అర్ధం చేసుకోవచ్చు. ఉత్తరాఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తరువాత ఇప్పటివరకు 12 మంది ముఖ్యమంత్రులుగా బాధ్యతలు నిర్వహించారు. అందులో నలుగురు ముఖ్యమంత్రులు కాంగ్రెస్ వారు కాగా, మిగతా 8 గురు బీజేపీ నేతలే. ప్రస్థుతమున్న ప్రభుత్వమూ బీజేపీదే. హడావుడిగా హిల్ స్టేషన్ల ప్రాంతాల్లో రెవిన్యూ పట్వారీలను శాంతి భద్రతల బాధ్యతలనుంచి తప్పించి పోలీసులు ఠాణాలు చేర్పాటు చేయడానికి నడుంకట్టిందంటే దానికి కారణం, ఆక్కడి ప్రజల పైన ఉన్న ప్రేమ కాదు. సుపరిపాలన అందిద్దామన్న ఉద్దేశ్యం అంతకన్నా కాదు. ఆయా హిల్ స్టేషన్లున్న 7500 గ్రామాల్లో రోజు రోజుకు శాంతి – భద్రతలు క్షీణిస్తూ, నేరాల సంఖ్య పెరుగుతుండటంతో… పర్యాటకుల సంఖ్య తగ్గుతోంది. దాంతో రాష్ర్టానికి రావలసిన పర్యాటక రంగ ఆదాయమూ తగ్గింది. డబుల్ ఇంజన్ సర్కారు అంటూ ప్రజలను మాయచేసే బీజేపీ పెద్దలు ఇప్పటికైనా, ప్రస్థుతం తమ పార్టీ పాలిత రాష్ర్టాలపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Related Posts

Cartoons Sence

Galleries

Latest Updates