అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో ప్రతిష్ఠించిన రాంలాలా దివ్య ఆలయ నిర్మాణం యుద్ధప్రాతిపదికన సాగుతోంది. గర్భగుడిలో 13 అడుగుల ఎత్తు వరకు మహాపీఠం నిర్మాణం పూర్తయింది. భగవంతుని విగ్రహం ఈ మహాపీఠంపైనే ప్రతిష్ఠిస్తారు. ఇప్పుడు శ్రీరాముని దర్శించుకునేందుకు భక్తులు వెళుతుండగా, బారికేడ్‌లు అడ్డంగా పెట్టక పోవడంతో భక్తులు సంతోషిస్తున్నారు. అలాగే భక్తులకు ఆలయ నిర్మాణ పురోగతిని దగ్గరనించి చూసే అవకాశం కలుగుతోంది. దాంతో వారు భక్తి తో తరిస్తున్నారు.
2024 జనవరిలో జరుగబోయే రాంలాలా మహోత్సవానికి ముందుగానే రామాలయం గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో పగలు, రాత్రి పనులు కొనసాగుతున్నాయి. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లోని రామమందిర్ వర్క్ షాప్‌లో రాళ్లను చెక్కిన తర్వాత, వాటిని ఇక్కడికి తరలించే పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. గర్భగుడిలో మక్రానా పాలరాయిని ఉపయోగిస్తున్నారు.
ముందుగా గర్భగుడి చుట్టూ 350 x 400 అడుగుల x 50 అడుగుల వెడల్పు, లోతైన గొయ్యి తవ్వి 1.5 లక్షల క్యూబిక్ ఫీట్ల చెత్తను వెలికితీసినట్లు శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ధర్మకర్త డాక్టర్ అనిల్ మిశ్రా తెలిపారు. దక్షిణ భారతదేశంలోని గ్రానైట్ బండలను తెచ్చి 21 అడుగుల ఎత్తైన పునాదిని నిర్మించారు. ఇప్పుడు దాని పైన 20 అడుగుల ఎత్తులో సూపర్ స్ట్రక్చర్ (ప్రధాన ఆలయం) నిర్మించాలి. ఈ ప్రధాన ఆలయంలో అనేక భాగాలు ఉన్నాయి. వీటిలో గర్భగుడి, రహస్య మంటపం, నృత్య మంటపం మరియు రంగమండపం మరియు ప్రవేశ ద్వారంతో కూడిన ప్రవేశ మందిరం ఉన్నాయి. ఈ క్రమంలో గర్భగుడిలో మహాపీఠం నిర్మాణం 13 అడుగులు పూర్తయింది. నిర్మాణ పురోగతిని ఎప్పటికప్పుడు నృపేంద్ర మిశ్రా సమీక్షిస్తున్నారు.
శ్రీరామజన్మభూమి మందిర భవన నిర్మాణ కమిటీ రెండు రోజుల సమావేశం ప్రతినెలా జరుగుతుంది. ఈ నెల 17 న రెండురోజులు జరుగుతుండగా, ఈ సమావేశానికి కమిటీ చైర్మన్, ప్రధాని నరేంద్ర మోదీ మాజీ సలహాదారు నృపేంద్ర మిశ్రా శుక్రవారం ఢిల్లీ నుంచి అయోధ్యకు రానున్నారు. ఆలయ నిర్మాణ పురోగతితో పాటు పార్కు, యాత్రికుల సౌకర్యాల కోసం కాంప్లెక్స్ నిర్మాణానికి ముహూర్తాన్ని కూడా సమావేశంలో ఖరారు చేయనున్నట్లు తెలిపారు. ఓ వైపు గోడ నిర్మాణానికి పశ్చిమ దిశలో మట్టి పనులు జరుగుతుండగా, మరోవైపు ప్యాసింజర్ ఫెసిలిటేషన్ సెంటర్ కోసం ల్యాండ్ లెవలింగ్ జరుగుతోంది.