‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్, ఓడిపోలేదోయ్… ఎన్నికలలోకి దూకీ … దూకి ఎదురీదక ఆ… ఉపఎన్నికలలో … దూకి ఎదురీదక, ఓటమే గెలుపనుకోవొయ్, ఓటమే గెలుపు అనుకోవోయ్, ….’ పాడుతూ పోతున్న యాద్గిరి నా కంట బడటంతో, ‘యాద్గిరీ… యాద్గిరీ..’ అని పిలిచాను. దాంతో యాద్గిరి వెనక్కి తిరిగి చూసాడు. నేను చేయి ఊపడంతో నా వైపు అడుగులు వేసాడు.
నేనూ ఆ వైపు నడక సాగించాను.
‘ఏం అన్నా చాల్దినాలాయె, కన్పించలే. యాడికి పోయినవ్’ అన్నాడు యాద్గిరి,
‘నీకు తెల్వందేమున్నది యాద్గిరీ, ఉప ఎన్నికల హడావుడి మొన్నే కదా ముగిసింది. ఓ రెండు రోజులు
రెస్టు తీసుకుని ఇవ్వాలే బయటికి వచ్చాను’ అన్నాను.
‘అన్నా చాయ్ దాగుదామా చాల్దినాలాయే’ అన్నాడు యాద్గిరి, దాంతో నేను కూడ ‘సరే తాగుదాం పా’ అన్నాను. నేనూ ఉప ఎన్నికల ఫలితాలపై యాద్గిరితో మాట్లాదవచ్చని. చాయ్ బండి వైపు నడుచుకుంటూ మాటలు సాగించాడు యాద్గిరి. ‘అన్నా, ఏం అనుకోనంటే ఒక మాట అడ్డుత సెప్తవా’ అన్నాడు, యాద్గిరి, ‘అడుగు కానీ, ఎందో పాట పాడుతున్నావ్, ఏమన్న కొత్త పేరెడీ రాసావా?’ అని అడిగాను. ‘ఏ, లేదన్నా, గిప్పుడే పాడుతున్న, యింక పూర్తిగ కాలేదన్న’ అన్నాడు యాద్గిరి,
మళ్లీ నేనే ఇంట్రస్టు చూపిస్తూ ‘ఏం పేరెడీ ఒక సారి పాడు’ అన్నాను. ‘ముసి ముసి నవ్వులు నవ్వులు నవ్వుకుంటూ ‘మల్ల నువ్ ఏం అనద్దు’ అన్నాడు యాద్గిరి, ‘నేనేం అంటాను యాద్గిరీ, నాకూ నీ అభిప్రాయాలు పనికివస్తాయి కదా, వార్తలు రాసేటప్పుడు జనం ఏం అనుకుంటున్నారో తెలుసుకోవాలి కదా’ అన్నాను.
దాంతో యాద్గిరి మొఖం వెలిగి పోయింది. ‘అయితే సెప్తా అన్నా’ అన్నాడు. చాయ్ బండి దగ్గరకు రావడంతో ‘ఛోటూ దో చాయ్ లారే’ అన్నాడు. తరువాత చాయ్ తాగుతూ, తిరిగి యాద్గిరే, ‘గదే అన్న ఉప ఎన్నికల్ల మొత్తం సీట్లు గెల్వలేదని కేసీఆర్ పార్టీ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా ఇచ్చిండు కదా, దాని మీద రాసిన అన్నా’ అన్నాడు. ‘గదే అన్నా, దేవదాసు సిన్మల పుల్లుగ తాగినంక ఒక పాట లేదా అన్న’ అని నా వైపు చూసాడు యాద్గిరి.
‘యాద్గిరీ నువ్వు మరీనూ, దేవదాసు సిన్మాలో ఎప్పుడూ తాగే ఉంటాడు కదా, దేవదాసులో అన్నీ సూపర్ హిట్ పాటలే కదా’ అన్నాను. ‘గదే కద అన్నా! గా దేవదాసు తాగుడు పిసతో ఏం చెత్తండో ఆనికే ఎర్కలేదు, ఎవడైన ఆడిదానికోసం జిందగీ ఖరాబ్ చేసుకుంటరా అన్నా? దాన్ని ట్రై చేయాలి కాని’ అన్నాడు యాద్గిరి’, ‘యాద్గిరీ, అక్కడ ఆడదాన్కోసమని కాదు, ఆ సిన్మాలో తన నిజమైన ప్రేమ కోసం దేవదాసు ఎలా మరిపోయాడన్నదే ముఖ్యవిషయం’ అన్నాను.
మల్లీ నే నే అన్నాను ‘ మన చర్చ ఎటో వెల్లింది, నేనేమో ఏం పేరెడీ రాసావని అడిగితే ఏమేమో అతున్నావ్’ అన్నాను. ‘గదే అన్నా, ఉప ఎన్నికల్ల రిజల్టు మంచిగ రాలేదని పరేషాన్ల ఉన్న కేసీఆర్ న రాసిన అన్నా… కుడిఎడమైతే పొరపాటులేదోయ్, ఓడిపోలేదోయ్’ అని పాడుతున్నాడు యాద్గిరి, నీ అభిప్రాయం అర్థం అయ్యి, ఇక పాటను ఆపాలని సరే ‘నీ అభిప్రాయం చెప్పు’ యాద్గిరీ అన్నాను.
అన్నా, ఏం సెప్పాలన్నా కేసీఆర్ సాన తెలివైనోడు అన్నా, కాని గదేందో సామెత ఉంది సూడన్న వంద కాకులను తిన్న రాబందు ఒక్క గాలి వానకు సచ్చినట్లు, ఒక్క ఎన్నికల్ల తక్కువ సీట్లచ్చినయ్ అని గట్ల నర్వస్ తడా అన్న, గట్లనుకుంటే మనకు స్వాతంత్రం ఎట్లస్తుండే’ అన్నాడు. ‘అంటే రాజీనామా చేయడం తప్పంటావా?’ అన్నాను. ‘తప్పు అని కాదన్నా, తన్ను తాను తప్పించుకోవడానికి రాజీనామా డ్రామా ఆడిండనుకున్నా, దాని కన్న కేసీఆర్ రాజీనామా చేసిండని తెలవడంతో కార్యకర్తల్ల మోరెల్ దెబ్బతినలేదా? కాదు, కనీసం రిజల్టు ఖరాబచ్చిందని మీడియా ముందచ్చి, నైతిక భాధ్యత తీసుకుని రాజీనామా.. చేయీలనుకుంటున్న, పార్టీ కార్యవర్గంల ఏం చేయాలో నిర్ణయిస్తాం అని చెప్తే అయిపోతుండె కదన్న’ అన్నాడు యాద్గిరీ. ‘అంటే కేసీఆర్ కి తెలివి లేక రాజీనామా ఇచ్చాడా?’ అన్నాను. ‘గది కాదన్నా నేను అదే సెప్పిన, కేసీఆర్, సాన తెలివిమంతుడు. గందుకే ఒక్కోసారి అతి తెలివి పనికిరాదు’ అన్నాడు.
నేనేమీ అనక పోవడంతో తిరిగి యాద్గిరే అన్నాడు ‘అన్నా తెలంగాణ కావాలంటే ఆందోళనలు డాలె అన్నా? నువ్వే ఉండాలె, కొత్తల నేను గూడ కేసీఆర్ మాటలకు, ఇగ తెలంగాణ అచ్చేసింది. అనుకున్న, కాని. ఏడన్నా, గిప్పటికీ ఉర్లల్ల తెరాస కమిటీల్లేవు. గాయన సుట్టూ పదవులు గావాలన్నోల్లు తిరుగుతున్నలు. అసలు కేసీఆర్ తెలంగాణ భవన్ల కార్యకర్తలను కలుస్తున్నాడా, గంతెందుకన్నా ఒక్క ఖమ్మం జిల్లా ఉదాహరణ చెప్తా, అన్న గాడ జిల్లా పెసిడెంట్ ఎవరో తెలుసా? ఆంధ్ర నుంచి వలస వచ్చినతనన్నా. గాయన గురించి ప్రజలేమనుకుంటున్నరో తెలుసుకున్నడా అన్న? అంతెందుకు ఆ జిల్లాల తెరాస కార్యకర్తల అభిప్రాయం తెలుసుకున్నడా? ఎప్పుడూ కోటరీ మాటలు నమ్మకుంటే గట్లనే ఉంటది. గీ కోటరీ గాళ్ళతోనే సెంద్రబాబు పోయిండు. గిప్పుడు వైఎస్సార్ కూడ గదే చేస్తండు. కేసీఆర్ ఇస్పీచ్ లిచ్చుడు ఆపి, యుద్ధానికి పోయేముందు సైనికునికి ఎన్ని విద్యలు నేర్పుతారో గట్ల తెలంగాణా భావజాలన్ని ప్రచారం చేయాలి. అందరిని కలుపుకుపోవాలి. తెలంగాణా సాధనలలో చేపట్టాల్సిన విధి విధానాలపై ఇతర పార్టీలతో చర్చించాలి. కనీసం చర్చించినట్లు ప్రజల్లోకి ఒక సందేశం పంపియ్యాలి కదా. ఒంటెద్దు పోకడలకు పోతే ఒక తెరాసకు అధ్యక్షుడిగ మిగిలిపోతడు, కాని తెలంగాణ ఉద్యమానికి నాయకుడిగ మిగలడు. – ఇప్పటికైనా తెలుసుకోవాలన్నా, అన్నాడు’ యాద్గిరి. ‘అంటే కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి ఏం చేయలేదా’ అన్నాను.. ‘గదే అన్నా, చేసిండు, గాయన వల్లనే, ఇయ్యాల అన్ని పార్టీలల్ల కొద్దో గొప్పో తెలంగాణోల్లకు ఇజ్జత్ ఇస్తన్లు.
ఉప ఎన్నికల్ల అన్ని పార్టీలు తెలంగాణకు సై అన్నై, కాని గిసోంటి టైం ల తప్పులు దిద్దుకొని పార్టీని ఆందోళనను ఇంక జోరుగ చేయాల. కాని, ఆడోళ్లలెక్క ఇంట్ల కూసుంటరా ? అన్నా’ అన్నాడు యాద్గిరి. సరే మళ్ళీ కలుద్దాం. వీలుంటే కేసీఆర్తో కలిసి ఓ సారి చర్చించి రా రాదూ’ అన్నాను. ‘గదేం అన్నా మజాక్ చస్తున్నవా, గాయన మన మాటలిండా అన్న. గాయనకు కోటరీ మాటలు బాగుంటయి. లేదంటే కోటరిల ఉన్నోళ్లు మనల్ని గాయనదాక పోనియ్యరన్న. నీకు అన్నీ తెలిసి కూడ మజాక్ సేత్తవ్’ అన్నాడు యాద్గిరి. ‘అయినా ట్రై చేయి తప్పులేదు కదా, అని నవ్వుకుంటూ వెళ్లి పోయాను నేను.