Monday - December 23, 2024

నేటి నిజం ..జర్నలిజం నిజం,నిజం..ఇదే నిజం

కత్తికన్నా కలం గొప్పదని నమ్మిన ఓ విలేకరీ……..

ప్రజాస్వామ్యంలో పత్రికలే ధ్వజస్తంభాలని……..
అవినీతి అక్రమాలను నిక్కచ్చిగ………….
నీవు వ్రాసి, కంటగింపు వైతివా ?……….

‘నేను సైతం సమిధనొక్కటి’ అని ………..

శ్రీరంగం శ్రీనివాసుని మాటలకు…………
శిరసువంచి అంతా కోల్పోతివా?…………


పాలక నేతల ప్రచారానికి నీవు సైతం ‘పావు’ వైతివా? ………………

ప్రెస్సు కాన్ఫరెన్స్ లంటూ పత్రికల్లో,

పేరుకోసం ఫైవ్ స్టార్ హోటల్లో,

మందు విందు అందిస్తే,

అందలమెక్కినంత సంతసించి,

కడుపు నిండా మెక్కి నువ్వు,

చొంగ కార్చుకుంట కూర్చుంటవాయే,

గల్లీ లీడర్ అయినా, ఢిల్లీ నేతలైనా,

నా కలం ముందు బలాదూర్ అంటవా యే

,నువ్వు అవతలికి పోయినంక,

నిన్ను చూసి నవ్వుతరాయే,

పేపర్లో రాస్తే ఏమౌతదని ఎద్దేవా చేస్తరాయే,

అదేమని గట్టిగంటే, ఫోను కొట్టి నీ పవరే మారుస్తరాయే,

ట్రాన్స్ఫరేమో చేస్తరాయే,

లేదంటే, కాదంటే నౌకరే పీకేస్తరాయే,

జర్నలిజం పేరు చెప్పి సమాజాన్ని దోచుకునే..

క్యాపిటలిస్టుకు బందీవై ..

భారమైన బతుకు నీడుస్తవాయె,

పబ్లిసిటీ కోసమని ..

పెద్దపెద్ద నేతలేమో….

నక్క వినయాలు అభినయిస్తే,…

నా ప్రభావమే నని కాలరేమోఎగరేసి నువ్వు,

అధికార పార్టీ నాయకులకు..

వంగి వంగి సలాం చేసి పైరవీలు చేస్తవాయె,

అడ్డదారిన పైసలేమో కూడబెట్టి

జర్నలిజం విలువ కాస్త గంగపాలు చేస్తవాయే,

అవినీతి అక్రమాలను అన్నింటిని కట్టగట్టి..

పత్రికల్లో రాస్తనని ప్రతిన నేమో నీవు బూని,

పాత్రికేయ వృత్తి చేతబట్టి,

పత్రికల్లో జరుగుతున్న పచ్చి నిజాలన్ని నీవు,

ప్రజలకేమో చెప్పవాయే,

గ్రూపు పాలిట్రిక్కులకు పత్రికలూ అతీతం కాదాయె,

యాజమాన్యం అడుగులకు మడుగులొత్తి

అందలాలు ఎక్కుత వాయే,

పాత్రికేయ వృత్తి ఫజీతు తీస్తావాయే,

జర్నలిస్టు మిత్రులందరూ ఒక్కటేనని సంఘమేమో పెడతవాయె,

బచావత్ చట్టమేమో అమలు చేయమంటు నీవు,

ఆందోళన చేస్తమని హంగామా చేస్తవాయే,

జర్నలిస్ట్ లకు నాయకుడై

మేనేజ్మెంటు తో కుమ్మక్కై,

అక్రమంగా ఆర్జించి

బొచ్చు కుక్క మాదిరేమో,

బుద్ధిగ కూర్చుంటవాయె,

ప్రపంచమంత జరుగుతున్న

ఘోరాలను, నేరాలను,

దౌర్జన్యాలను, అధికారుల అవినీతిని,

ఏలుతున్న నాయకుల స్కాములను,

ఊహించని రీతిలోన ఎండగట్టి,

బయటపెట్టి ప్రభుత్వాల తల రాతను మార్చుతవాయే,

పెద్ద పెద్ద వాళ్ళ చీకటి సంబంధాలను

ప్రజల ముందు ఉంచి సంచలనం సృష్టించి,

పత్రిక సర్క్యులేషన్ పెంచి నీవు,

హీరో లాగా పోజు లేమో పెడతవాయె,

ఇంత జేసి కూడ నీవు,

విలేకరుల కోసమని ఏర్పాటు చేసిన అమలుకాని చట్టాలు,

పత్రికా వ్యవస్థ ముసుగులోన సాగుతున్న నిజాలను,

ప్రజలకు తెలియజెప్పాలంటే ఏ పత్రికలోనూ ప్రింటు కాదాయె,

పేరులోనే మార్పు కాని

పత్రికలన్నీ ఒక్కటేనని తెలుసుకొని, ఊసురోమనంటవాయె,

ఏ పత్రిక చూసినా ఏమున్నది గర్వకారణం,

ప్రతి పత్రిక ఏదో ఒక పార్టీకి బాకానే

అన్నది బహిరంగ రహస్యం మాయె,

పత్రికాధిపతుల అందరూ నాటి ప్రకాశం పంతులు కాదాయె,

ఎడిటర్ లందరూ నార్లవారు కాదాయె,

విలేకరులందరికీ వెన్నెముక కరువాయె,

దేశభక్తి కాదు కదా జర్నలిస్టుకు భుక్తి కూడా కరువాయె,

సమాజంలో బతుకు కూడా బరువాయే

ఆశయాలని కూడగట్టి అవతలి ఒడ్డున పెట్టి,

అక్రమాలకు పాలు పడుతూ,

అడ్డదారులు తొక్కుతూ ఆఖరుకు అతి నీచంగా బ్రతుకు నీడ్చు తుంటివాయె,

ఏమైనయి? ఏమైనయి? నీ ఫోజులన్ని ఏమైనయి?

ఆశయాలు ఏమైనయి?

కమిలిపోతివి కరిగిపోతివి, కానరాక కుములిపోతివి,

మరుజన్మకు మళ్లీ పుడితే …

పాత్రికేయుడి వైతావా?

లేకుంటే, కాదంటే

పాత్రికేయ వృత్తి చేపట్టమని

నీవు ఎవరికన్న సలహా ఇస్తావా?

వద్దు వద్దు ‘ అంటావా?

ప్రజాస్వామ్యంలో పత్రికలు బూటకం,

ప్రజాపాలనంత అక్రమాలు, అన్యాయాలు,

అవినీతికి నిలయమని గొంతెత్తి అరుస్తావా?

జర్నలిజం కూడ మేడిపండు లాంటిదని…

ఢంకా బజాయిస్తవా?

…రచన..ఎం.ఎన్. ఎస్.కుమార్.

Related Posts

Cartoons Sence

Galleries

Latest Updates