మునుగోడు ఉపఎన్నికల వేడి తగ్గనే లేదు, ప్రధాని నరేంద్ర మోదీ రామగుండం సుడిగాలి పర్యటన రాష్ట్రంలో మరింత రచ్చ మిగిల్చి పోయింది. రాష్ట్రంలో టీఆర్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బేర సారాలు చేస్తూ, రెడ్ హేండెడ్ గా దొరికిన బీజీపీ ఏజెంట్ల నిర్వాకం ప్రజలు మరువనే లేదు. కోర్టులో ఆ కేసు ఓ కొలిక్కీ రాలేదు. కానీ రామగుండంలోప్రధాని మోదీ చేసిన ప్రసంగం మరిన్ని ప్రశ్నలు మిగిల్చింది. సాధారణ ఎన్నికలకు ఏడాది ముందే రాష్ట్రంలో ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. ప్రధాని తన ప్రసంగంలో కమల్ ఖిలేగా ( కమలం వికసిస్తుంది) అని నర్మ గర్భంగా చెప్పడం, హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టు లో కార్యకర్తలను ఉద్దేశించిన ఆయన ప్రసంగం తెలంగాణ రాజకీయాల పట్ల బీజేపీ అధిష్టానం చూపిస్తోన్న శ్రధ్దను చెప్పకనే చెబుతోంది. లోకసభలో రెండు సీట్లున్న బీజేపీ… ఇంతింతై..వటుడింతే..అన్నట్లు..అనతికాలంలోని దేశ వ్యాప్తంగా విస్తరించి ఢిల్లీ గద్దె నెక్కింది.రాజకీయాల్లోవారు..వీరౌతారు.. అన్న సామెతను నిజం చేశారు. కాని ఏ పార్టీ విత్ డిఫరెంట్ అయిడియాలజీ అంటూ..విస్తరించిన బీజేపీ.. నాయకుల నాటి మాటలను మూట కట్టి అటకెక్కించారా ? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. రాజకీయాల్లో నైతిక విలువలు అవసరమని నొక్కి చెప్పి, కాంగ్రెస్ అభాసుపాలు చేసి, గద్దె నెక్కిన ఢిల్లీ బీజేపీ నేతలు…నాటి నేతల మాటలు మరిచినట్లున్నారు. గవర్నర్ వ్యవస్థకు వ్యతిరేకంగా పలు సార్లు వెళ్ళివిరిసిన ఆందోళనలకు పెద్దన్న పాత్ర పోశించిన ఒక నాటి బీజేపీ…నేడు అదే గవర్నర్లను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తూ, ప్రత్యర్ధుల ప్రభుత్వాలను ఇబ్బందులు పెడుతోంది. ఆ నాటి బీజేపీ, ఈ నాటి బీజేపీ ఒకటేనా అనే అనుమానం కలిగిస్తోంది. అంతెందుకు రాజకీయ ప్రత్యర్ధులను వేటాడేందుకు సీబీఐ, ఈడీ లాంటి స్వయంప్రతిపత్తి గల సంస్ధలనూ వాడుకుంటూ, వాటి ప్రతిష్టనూ మరింత మంట కలుపుతోంది. ప్రతిపక్షం లో ఉన్నప్పుడు నొక్కి వక్కానించిన వాటినే తానూ అమలు చేస్తున్నది. ప్రతి ఎన్నికల ముందూ…అది రాష్ట్రంలో అసెంబ్లీకి జరిగే ఒక ఉప ఎన్నికైనా..సరే.. సరిగ్గా వారం ముందు.. సీబీఐ , ఈ. డీ అధికారులు రంగంలోకి దిగుతారు. ప్రత్యర్ధి పార్టీలకు సంబంధాలున్న వారి ఇండ్లలో సోదాలు చేస్తారు. మొన్నటికి మొన్న రాష్ట్రంలో జరిగిన మునుగోడు ఉప ఉన్నిక ముందు, ఇప్పుడు జరుగుతున్న గుజరాత్ ఎన్నికల సమయంలోనూ పలువురు ప్రత్యర్ధి నాయకులు లేదా వారి సంబంధీకుల ఇళ్ళలో సోదాలు జరిగాయి..ఇంకనూ జరుగుతున్నాయి కూడా. సీబీఐ దాడులు చేయడం, ఈడీ అధికారులు సోదాలు చేయడం తప్పని కాదు.. కానీ ఎన్నికల ముందే ఇలాంటివి జరుగుతుండటంతో ప్రజల్లోకి ఏ సందేశం పోతోంది?.. లేదా ..ఎవరేమనుకుంటే నాకేంటి? అని, కావాలనే చేయిస్తున్నారా?
గత ఎనిమిదేండ్లలో.. మన్ కీ బాత్ చెప్పటమే తప్ప..మనసు విప్పి ప్రజల మనసులో మాట తెలుసుకోలేదు మోదీజీ. ప్రజలతో కాక పోయినా కనీసం, ప్రజల పక్షాల పనిచేసే పాత్రికేయులతోనూ మీరు ముచ్చటించిన దాఖలాలు లేవు, వారి ప్రశ్నలకూ జవాబులు చెప్పిన సంఘటనలు లేవు. ప్రజాస్వామ్యం పరిపుష్టంగా ఉండాలంటే నాలుగో స్ధంభమైన పాత్రికేయ వ్యవస్థ ఒకటి ఉందని రాజ్యంగం చెబుతోంది.
మోదీ జీ…కాస్త పత్రికల వారితోనూ మాట్లాడండి..మీకు ప్రజల మనో భవాలతో పాటు, వాస్తవాలూ తెలుస్తాయి మోదీజీ….మరి మొన్నటి పర్యటనలో భాగంగా బేగంపేట ఎయిర్ పోర్టులో కార్యకర్తలతో సమావేశ మయ్యారు. తెలంగాణాలో పార్టీని బలోపేతం చేయాలనుకుంటున్నారు మీరు. తప్పులేదు..మీరు తెలంగాణ మే కమల్ ఖిలేగా అని కార్యకర్తలకు భరోసా కల్పించారు. మునుగోడు ఉపఎన్నికల్లో ఓడిపోవడంతో నిరాశ పడ్డ కార్యకర్తలను ఉత్సాహ పరిచారనుకుందాం. కాదు అది వారిని ఉత్సాహ పరిచినట్లు కనిపించ లేదు. ఎట్టి పరిస్థితుల్లో నైనా బిజేపీని అధికారంలోకి తీసుకువస్తాం!..అని బల్లగుద్ది మరీ చెప్పినట్లుంది. గత ఎనిమిదేండ్లలో ఎనిమిది రాష్ర్టాలలో బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. కాదు ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూల్చారంటే బాగుంటుంది. ఈ రాజకీయ చదరంగంలో పావులు కదల్చడంలో అమీత్ షా ది అందె వేసిన చెయ్యి కదా. ఆయనతో తమరు జత కలిసినప్పటినుంచి బీజేపీ ప్రభ వెలిగిపోతున్నదని, దేశమంతా కోడై కూస్తున్నది. అదీ నిజమే నేమో?.. వాపుకు.. బలుపుకు తేడా తెలుసుకోలేక పోతే పొరపాటు చేసినట్లవుతుంది. రాజుల కాలంలో రాజ్య విస్తరణకు నడుం కట్టిన రాజులేమయినారో తెలుసు కదా! సామ్రాజ్య విస్తరణలో చివరికి ప్రజా క్షేమమే మరిచిన రాజులున్నారు. చరిత్ర గురించి బీజేపీ వారికంటే ఇంకెవరికి తెలుస్తుంది? కానీ, బీజేపీ అమీబాలా..దేశ మంతా విస్తరిస్తున్నది. మంచిదే. సంతోషించ దగ్గదే..కానీ … ఢిల్లీ గద్దెనెక్కి గత ఎనిదేండ్లుగా, తమ ప్రభుత్వం అమలు చేసిన అన్ని కార్యక్రమాలను, పథకాలను ప్రజలు మెచ్చి, నచ్చి ఓట్లేస్తున్నారనుకుంటే అది భ్రమే. ప్రజలను, అదే..ఓటర్లను భ్రమలో పెట్టి ఓట్లేయించుకుంటున్నారంటే…వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ, నన్నెవరూ చూడటం లేదని అనుకుంటుందట. …. అంది వచ్చిన ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని వాడుకుని, సామాజిక మాధ్యమాల ద్వారా సామాన్య ప్రజలను వారికి తెలయకుండానే మత విద్వేషాలు రెచ్చగొట్టి, వారిమెదడులను తొలుస్తూ…అక్కడ తిష్ట వేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మీ ప్రభ వెలుగుతోంది మోదీజీ…. మీరు విశ్వగురువుగా పేరొందుతున్నారు. కాని మరో వైపు, చాప కింద నీరులా మీరు చేస్తున్న ఆగడాలను ప్రపంచం గమనిస్తున్నది. ఇటీవలే మైక్రోసాఫ్ట్, బీబీసీలు చేసిన సర్వేలో ప్రపంచంలోనే సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న దేశాల పట్టికలో భారత్ అగ్రభాగాన నిలిచింది. అందులో బీజేపీ అనుబంధ సంస్ధలే క్రియాశీలకంగా పనిచేస్తున్నాయని తేలింది. ఇకు ఒక వైపు ప్రజలకు ఉచిత తాయిలాలు వద్దంటూనే…బడా బాబులకు వేల కోట్ల రూపాయల రుణాలు రద్దుచేస్తూ, జాతి ప్రయోజనాలు మీరు ఎవరికోసం తాకట్టు పెడుతున్నారో…ప్రజలూ గ్రహిస్తున్నారు. దేశ స్వాతంత్యానంతరం తిరుగులేని పార్టీగా అవతరించిన కాంగ్రెస్ పార్టీని, కూకటి వేళ్ళతో పెకిలించ గలిగిన మీకూ, ఆ సమయం రాదని ఎందుకనుకుంటున్నారు? మీరు అమలు చేసిన పెద్ద నోట్ల రద్దు వల్ల ఎన్ని వేల కోట్ల నల్ల ధనం బయటపడ్డదో?.దాని వల్ల దేశానికి ఎంత ప్రయోజనం కలిగిందో? …మా కంటే ఎక్కువ మీకే తెలుసు. పెట్టు బడుల ఉపసంహరణ పేరుతో…జాతి సంబదను..దోచి పెడుతున్నతీరును, వ్యవస్ధలో ఉన్న లోపాలను సరిదిద్దాల్సింది పోయి, పార్టీ ప్రయోజనాలకోసం ఎలక్టోరల్ బాండ్ల అమ్మకానికి రాచ బాట వేసి క్విడ్-ప్రో కు బాహాటంగానే ఊతమివ్వడం…లాంటి వాటిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇక మళ్ళీ తెలంగాణ కు వస్తే …తెలంగాణ మే కమల్ ఖిలేగా అన్నారు. అంటే ఇక్కడ ప్రభుత్వమేర్పాటు చేస్తామన్నారు. ఎలా?మీ పార్టీకి ఇక్కడ ముగ్గురు ఎమ్మెల్యేలు, నలుగురు ఎం.పి.లున్నారు. ఉన్నపలంగా మీ పార్టీకి ఎలా వస్తుంది. ఏమో గుర్రం ఎగురా వచ్చు అన్నట్లు రాత్రికి రాత్రి మహారాష్ట్రలో శివసేనను చీల్చి గద్దె నెక్కుతారనుకున్నా ..పట్టుమని పది మందీ లేరాయె. అలా…కాదంటే..రాబోయే ఎన్నికల్లో ఇక్కడి ప్రజల మనోభావాలు గెలుచుకుని, వారికి బీజేపీ దగ్గరవ్వాలి. కానీ మీరా ప్రయత్నమే చేస్తున్నట్లు లేదు. కేంద్రంలో అవసరాని కంటే అధిక మెజారితో, అధికారం చలాయిస్తున్నా.. మీ ప్రభుత్వం తెలంగాణకు పట్టు మని పది ప్రాజెక్టులు మంజూరు చేసిందా? అంతెందుకు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సమయంలో కేంద్ర ప్రభుత్వంతో జరిగి ఒప్పంద ప్రకారం కనీసం తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వాల్సిన చేయూతనందించిందా? కొత్తగా ఏర్పడిన రాష్ర్టానికి హక్కుగా రావాల్సిన నిధులైనా విడుదల చేశారా? కనీసం విభజన చట్టంలో పొందుపరిచినట్లుగా నైనా చర్యలు తీసుకుంటున్నదా? కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఏమైంది? బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏమైంది? గిరిజదన విశ్వవిద్యాలయం ఏది? కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సంగతేమిటి ? ఉమ్మడి ఆస్తుల విభజన సంగతేమిటి? ఆంధ్ర ప్రదేశ్ నుంచి తెలంగాణకు రావాల్సిన నిధుల సంగేతిమిటి? ఇలా.. ప్రశ్నించుకుంటూ పోతే..ఎన్నో ఉన్నాయి. తెలంగాణ ప్రజలు మనసు విప్పి మాట్లాడాలి అనుకుంటున్నారు. మీ మనసులోని మాటలు కాదు, వారి మాటలు వినండి మోదీజీ… వీలైతే వారి ప్రశ్నలకు జవాబు చెప్పండి.
—ఎం.నాగశేష కుమార్,
Monday - December 23, 2024