Monday - December 23, 2024

పరేషాన్… పరేషాన్….

“దేవుడు చేసిన మనుషుల్లారా…. మనుషులు చేసిన నేతల్లారా, వినండి నాయకుల గోల…

కనండి నేతల లీల…. మన్మోహన సింగా, మన్మోహన సింగా, సోనియమ్మ… సోనియమ్మ.. సోనియమ్మా…. ఓటు దొంగ, ఆ… ఆ… ఓటు దొంగ, మా పాత కాపే, మా కాంగ్రెసే,

తొలి నుండి కాంగ్రెసే, మా కాంగ్రెసే, కోరిన కోర్కెలు తీరాలంటే, మళ్ళీ టికట్ కావాలంటే,

సోనియానే ధ్యానించాలి, వై.ఎస్.నే పొగడాలి, సోనియమ్మ, సోనియమ్మ, సోనియమ్మా…… వినండి నాయకుల గోల, కనండి నాయకుల లీల….” అని పాడుకుంటూ వెళ్తున్న యాద్గిరి కనబడటంతో “యాద్దిరీ.. యాద్గిరీ” అని పిలిచా…

నా పిలుపు విని వెనక్కు తిరిగి చూసాడు యాద్గిరి.. అంతలో నేనే చేయిపై కెత్తి ఊపుతూ,

 “యాద్దిరీ… యాద్దిరీ… ఇటు …. . ఇక్కడున్నా” అన్నాను కొద్దిగా అరుస్తున్నట్లు. చుట్టుప్రక్కల ట్రాఫిక్ అంతా రణగొన ధ్వనిగా ఉంది. అయినా నా పిలుపుతో యాద్గిరి నా వైపు అడుగులు వేసాడు. “ఇలేకరన్నా, నమస్తే, బాగున్నావే…” అన్నాడు పలకరింపుగా యాద్గిరి.

“బాగానే ఉన్నాను. కాని నువ్వేమిటి చిక్కినట్టున్నావు. బెంగ పెట్టుకున్నావా?” అన్నాను.

“రంది నాకేముంటదన్నా, రంది పడితే గిడితే… సోనియాగాంధీ పడాల, మన్మోహన్ సింగ్ రంది పడాల, రాజశేఖర రెడ్డి రంది పడాల, ఇంకా చెప్పాలంటే చంద్రబాబు రంది పడాల. లేదంటే కేసీఆర్ రంది పండాలె” అన్నాడు.

“ఎందుకు?  వారెందుకు రంది పడాల? వారికొచ్చిన ఇబ్బంది ఏమీ లేదే ?” అన్నాను.

మళ్ళీ నేనే “ముఖ్యమంత్రి వై.ఎస్.ఆర్. లక్షణంగా పరిపాలన చేసి ప్రజల మనిషిగా గుర్తింపబడుతున్నాడు. సోనియా గాంధీ పార్టీ అధ్యక్షురాలుగా ఇటీవలే 10 ఏండ్లు పూర్తిచేసుకుంది. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ విశ్వాస తీర్మాణంలో విజయం సాధించి మైనారిటీ ప్రభుత్వాన్ని మెజారిటీ ప్రభుత్వంగా నిరూపించుకున్నాడు. చంద్రబాబు కూడా కేంద్రంలో తిరిగి చక్రం తిప్పుతున్నాడు. ‘మీకోసం’ పేరు పెట్టుకుని.. ప్రజలతో మమేకమై కార్యకర్తల్లో కొత్త విశ్వాసం పెంచుతున్నాడు” అన్నాను. “అన్నా, నాతో ఎందుకు చెప్పిస్తున్నవ్ అన్నా, సూసే దానికి మంచిగ కన్పిస్తున్నరన్న. కాని గాళ్లు సాన పరేశాన్ల ఉన్నరన్న” అన్నాడు. “సరే కాని చాల్దినాలాయో కన్పించక. చాయి దాగుదాం నడు, అన్నా! అన్నాడు” యాద్గిరి.

“సరే పద” అంటూ చాయి బండి వైపు నడుస్తూ మాటలు మొదలు పెట్టాను.

“ఇంకా ఏం సంగతులు యాద్గిరీ?” అన్నాను నేనే, ఏదో ఒకటి మాట్లాడాలని, “ఏమున్నాయన్నా, నువ్వే చెప్పాలి. రాజకీయాలు ఇలేకరులకే ఎక్కువ తెలుస్తాయి” అన్నాడు.

ఇంతలో చాయి బండి దగ్గరికి రావడంతో, ఆగి యాద్గిరి “దో చాయి లారే… ఛోటే” అనడంతో బండి వాడు రెండు చాయిలు ఇచ్చాడు. చాయి తాగుతూ తిరిగి మాటలు మొదలు పెట్టాను.

“యాద్గిరి, మన నాయకులు చాలా బాధ పడుతున్నారని అన్నావు. ఏం బాధలు చెప్పు” అన్నాను. అతని అభిప్రాయం తెలుసుకుందామని.

“ఏం లేదన్నా, మన సీ. ఎం. వైఎస్సారేమో అచ్చే ఎలచ్చన్ల ఎట్ల గెలువాలని సాన పరేశాన్ గున్నడు. గా సిన్న హీరో చిరంజీవి పార్టీ పెడతండంట కద. గాయన గాలి ఎట్లుంటదో? టికెట్రానోళ్లందరు ఎం.ఎల్.ఎ.లు గా పార్టీల దూకతరేమో? అని పరేశాన్ ఉన్నడు. బైటికి సెప్తలేడు కాని సాన పరేశాన్ ఉన్నడన్నా” అన్నాడు.

“ఎప్పుడూ నవ్వుకుంటూ కనిపించే వైఎస్సార్ పరేశాన్ ఉన్నడంటావేంది యాద్గిరీ?” అన్నాడు.

 ” అన్నా, నిజం. నువ్ సెప్తే నమ్మవ్. కాని సూడు ఎవల్తోనన్న అడిగి తెల్సుకో అన్నా. అచ్చే ఎలచ్చన్లల్ల ఎట్లు గెలవాల? అని సాన లెక్కలు సూతుండు. దానికి కొత్త ఆఫీసు బెట్టిండన్నా, నీకు దెల్వదా? పతి నియోజకవర్గం ఓటర్లిస్టు పట్టుకుని ఏ అసెంబ్లీకి ఎవర్ని నిలబెట్టాలి? ఏ కులానికి ఎన్ని ఓట్లు ఉన్నాయి? ఏ పార్టీల ఏ ఏ నాయకులు ఉన్నారు? అవతల పార్టీ ఎవరికి టికటిస్తది? చిరంజీవి పార్టీలకు ఎవరు పోతరు? కాంగ్రెస్ నాయకులెవరన్న పోతరా? సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వకపోతే చిరంజీవి పార్టీల పోతడా? గానిదగ్గర ఉన్న డబ్బులెన్ని? అని లిస్టు.

తయారు చేస్తుండన్నా” అన్నాడు.

ఇంత వివరంగా చెప్పడంతో ఆశ్చర్యపోవటం నావంతైంది. క్యాంపు ఆఫీసులో ఎక్కడా ఈ కార్యక్రమాలకు జరుగుతున్నట్లు లేదే?” అన్నాను.

“అన్నా, నువ్ సిన్న పోరగానిలెక్క మాట్లాడకన్నా ఎవలన్న సి.ఎం. క్యాంప్ ఆఫీసులో గియన్ని చెస్తరా. ఏరే కాడ ఒక ఆఫీసు పెట్టిన్రన్న, అక్కడ సాన లెక్కప్రకారం అసెంబ్లీ వారిగా, కులాల వారీగా, లీడర్ల వారీగా లిస్టు తయారు చేస్తున్నారు. గంతే గాదు సెంద్రబాబు అన్నిపార్టీలతో కలిసి మహాకూటమి పెడ్తా అంటుండు కద, దాని మీద కూడ పరేశాన్ ఉన్నడు” అన్నాడు.

“మరి చంద్రబాబు ఎందుకు పరేశాన్ ఉన్నాడు? అని అడిగాను. ఏం చెప్తాడో ?” అని.

“అన్నా, సెంద్రబాబు పరేశాన్ లేదా? సిన్న పిల్లోన్ని అడిగినా సెప్తాడు” అంటూ తిరిగి యాద్గిరే అన్నాడు.

“అన్నా దేవేందర్ గౌడ్ ఎల్లిపోయిండు. రాయలసీమల శోభ, ఆమె పెనిమిటి నాగిరెడ్డి, ఖలీల్ భాష, కరీంనగర్ నుంచి పెద్దిరెడ్డి పోయిండు. తూర్పుగోదావరి నుంచి జ్యోతుల నెహ్రూ, కోటగిరి విద్యాధర రావు ఆయనే సస్పెండ్ చేసే, గుంటూరులో టి.వి. రావు కూడా పాయె. గంతెందుకు అన్నా | తెలంగాణలో దేవేందర్ గౌడ్ వైపు ఎంత మంది పోతారో అని భయానికే తెలంగాణకు సై అందామనే “ఆలోసన చేస్తోందన్నా” అన్నాడు యాద్గిరి..

“గియన్నికాక మొన్న విశ్వాస తీర్మానంల ఇద్దరు ఎం.పీ.లు పాయే. తెలుగుదేశం ఎం. పీ.లే కాంగ్రెస్కు ఓటేసిన్లంటే సింధ్రబాబుకు ఇజ్జత్ పోయినంత పనైందన్నా” అన్నాడు యాద్గిరి.

ఏం మాట్లాడాలో తెలియక, “కేసీఆర్ ఎందుకు పరేశాన్ ఉన్నాడంటావ్?” అన్నాను మెల్లిగా, ఏమీ తెలియనట్లు,

“అన్నా, మల్ల గట్లనే అడుగుతవ్. దేవవేందర్ గౌడ్ను మొన్నటి దాకా జై తెలంగాణ అనుమని కేసీఆరే అన్నడు. కాని గిట్ల కొత్త పార్టీ పెట్టి గాయనకే పోటీ అయితడని అనుకోలే గద, గిక్కడ ఏమయిన అంటే తెలంగాణ లీడర్లందరు జై దేవేందర్ గౌడ్ అంటరని గాయన పరేశాన్ ఉన్నడన్న, మొన్నటిదాక కేసీఆర్ ఎం సెప్పిన ప్రజలు ఇన్నరన్న. గిప్పుడు పోటీ అచ్చిండు కద, జై తెలంగాణ అనేటోడు కూడ ఎటు ఓటేత్తడో తెలియదాయో, ఏం చేత్తడు పాపం గాయన టైం బాగ లేదన్న…. సెంద్రబాబు లెక్క కేసీఆర్ ది గూడ ఇశ్వాస తీర్మానంల మొఖం నల్లగ అయ్యిందన్న ఉప ఎన్నికల్ల ఓడిపోయినోల్లు పొంగ, పార్టీల కెల్లి సస్పెందు చేసినంక కూడ గీ ఆలె నరేంద్ర యు.పి.ఎ. సర్కారు కు ఓటేసి పరేశాన్ చేసిండు. ఏం చేస్తడు. మల్ల గాయన సభ్యత్వం రద్దు చేయమని స్పీకర్ చుట్టు తిరుగుతుండన్నా, గిది నిజం. ఇంకా ఢిల్లీ గల్లీలనే తిరుగుతుండు” అన్నాడు యాద్గిరి.

 “అది సరే, యాద్గిరి… మరి కొత్తగ పార్టీ పెట్టిన దేవేందర్ గౌడ్ కాని, పార్టీ పెట్టబోయే చిరంజీవి కూడా పరేశాన్ ఉన్నారంటావా?” అన్నాను.

“అన్నా, దేవేందర్ గౌడేమో పున పుస తెలుగుదేశానికి రాజీనామా ఇచ్చిండు. తెలంగాణ జై అను, తెలంగాణ జై అను, అని అన్నోళ్ళే గిప్పుడు ఆయన పార్టీలకు అస్తలేరు. గీయన బలం గింతేనా అని ప్రజలు, పేపరోళ్లు అంటరని గాయన పరేశాన్ ఉన్నడు” అన్నాడు యాద్గిరి.

తిరిగి యాద్గిరే “అన్నా చిరంజీవి గూడ పరేశాన్ ఉన్నడన్న… పార్టీ అయితే పెడత అన్నడు. కాని ధైర్యమత్తలేదన్న, ఏం మాట్లాడితే ఏమయితదో, తెలుత్తలేదన్నా, గాయన పార్టీ గెలుస్తదో లేదో తరువాత సంగతి కానీ ఇప్పుడైతే, మీ ఇలేకర్లతోని, అభిమానులతోనే పరేశాన్ ఉన్నడు. ఇలేకర్లు ఎప్పుడు ఏం రాస్తరో తెలియదు. అభిమానులు ఎప్పుడు ఎవర్ని కొడతారో తెలియదు. గాయనకు నిద్ర పడతలేదట అన్నా” అన్నాడు యాద్గిరి.

“సరే యాద్గిరి అందరూ పరేశాన్ ఉన్నరు, అంటున్నావు. అలాంటప్పుడు పరేశాన్ లేనివాడెవడు?” అన్నాను.

అన్నా పరేశాన్ లేనోల్లు కూడ లోకంల సాన మంది ఉన్నరన్న, నేనున్న, మవ్వున్నవ్” అన్నాడు యాద్గిరి. “నీ సంగతి సరే, నా సంగతి నువ్వెలా చెపుతావ్? నేను పరేశాన్ లేనా?” అన్నాను. ఏం చెపుతాడో? అని.

“అన్నా, నువ్ మునపటంత పరేశాన్ గొడ్తలేవన్న, నువ్ కొత్తల హైదరాబాద్ అచ్చినపుడు వార్తలకోసం పరేశాన్ పరేశాన్ తిరుగుతుంటివి. ఎప్పుడు నౌకరి పోతదో అని భయపడ్తుంటివి” అన్నాడు.

నేను కల్పించుకుంటూ ఇప్పుడూ “ఆ భయం ఉంది. వార్తలు రాయకపోతే ఉద్యోగం ఊడటం ఖాయం. అందులో ఏ మార్పూ లేదు” అన్నాను.

“అన్నా గిప్పుడు నువ్వు ఉద్యోగం ఊడేదాక సూసేదేం లేదన్న.. మస్తు పేపర్లున్నాయి. మస్తు టి.వి.లు. అస్తున్నయి. గీ ఉద్యోగం గాకుంటే ఇంకోటి. తెలుగుల మంచిగ రాసెటోడే దొరుకుతలేడన్నా. అంతా ఇంగ్లీషు మీడియంల సదివిన పోరగాళ్ళే అస్తున్నరటన్న. తెలుగుల ఇలేకరి పనికి ఎవరత్తనన్నా” అన్నాడు యాదిరి.

 ఇక ఏం మాట్లాడాలో తెలియక “నీకేం తెలుసు యాద్గిరి. పీత బాధలు పీతవి, సీత బాధలు సీతవి” అంటూ. “సరే యాద్గిరి, మళ్ళీ కలుద్దాం టైం అయింది. ఆఫీసుకు వెళ్ళాలి” అని నడక సాగించాను.

“అన్నా నమస్తే, మళ్ల కలుద్దామే” అన్నాడు యాద్గిరి.

……………………….ఎం.నాగశేషకుమార్ (సీనియర్ జర్నలిస్టు)

Related Posts

Cartoons Sence

Galleries

Latest Updates