రాష్ట్ర ముఖ్యమంత్రి పేషీ లో పనిచేస్తున్న ప్రజా సంబంధాల అధికారి (పిఆర్ఓ) గటిక విజయ్ కుమార్ తన పదవికి రాజీనామా చేసినట్లు వచ్చిన వార్త ఈ వారం చర్చనీయాంశాలలో ముఖ్యమైందిగా మారింది. ఎం.ఎల్.సి. ఎన్నికల తేదీ దగ్గర పడటంతో ప్రచార పర్వం జోరందుకున్న వార్తలు ఇటు పత్రికలు, టీవీల్లో మారు మారుమ్రోగుతుంటే, అనూహ్యంగా గటిక విజయకుమార్ రాజీనామా వార్త రాజకీయ శిబిరాల్లో చర్చకు కారణ మైంది. అయితే ఓ పిఆర్ఓ రాజీనామాకు ఇంత ప్రాధాన్యత ఎందుకు? అని ప్రశ్నించుకుంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ విషయం ఎంతో చర్చనీయాంశమే. అందులో సందేహమే లేదు. గటిక విజయకుమార్ స్వయంగా తాను, తన వ్యక్తిగత కారణాలతో సీఎం పిఆర్ఓ పదివికి రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్లో పేర్కొనడం, సోషల్ మీడీయా లో ఈ విషయం ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. సోషల్ మీడియాలో వచ్చిన కథనాల్లో ముఖ్యంగా పిఆర్ఓ విజయకుమార్ వ్యవహార శైళిపై ముఖ్యమంత్రి కుమారుడు, భవిష్యత్ ముఖ్యమంత్రి అయిన కేటీ రామారావు కు పిర్యాదు చేయడంతో డొంక కదిలిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎప్పుడూ, వెన్నంటి ‘నీడ’లా ఉంటూ ప్రతి పత్రికా సమావేశంలో వెనుకే కూర్చుని, మీడియాలో తన ప్రాబల్యాన్ని పెంచుకున్న విజయకుమార్ పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. వరంగల్ లో మామూలు పత్రికా రిపోర్టర్ అయిన గటిక విజయకుమార్, తెలంగాణా సాధన తరువాత ఉద్యమ సమయంలో కేసీఆర్ తో ఉన్న సంబంధాలను ఉపయోగించుకుని పిఆర్ఓ గా చేరారు. ఉదార స్వభావుడైన కేసీఆర్ అడిగిందే తడవుగా తన వద్ద పీఆర్ఓ గా పెట్టుకున్నారు. అయితే ఆయన పీఆర్ఓ గా నియమాకం వెనుక ఓ మంత్రి హస్తం కూడా ఉందట. అది వేరే విషయం. అయితే ఉద్యమ సమయంలో సహకరించిన ఎంతో మందికి ఆ తరువాత ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తరువాత కేసీఆర్ పెద్ద పదవులను కట్టబెట్టారు. అందులో రాజకీయ నాయకులతో పాటు, ఉద్యోగ సంఘాల నాయకులు, సాహితీవేత్తలు, బహుజన నాయకులు, పాత్రికేయులు ఉన్నారు. ఇందులో తప్పులేదు. కాని ఈ ప్రక్రియలో నిజాయితీ పరులు, సమర్ధులు కంటే ఎక్కువ మంది పైరవీకారులే అందలమెక్కారు. ఈ నేపధ్యంలో కొంతమందికి అపాత్రదానం చేసినట్లు పలు సంధర్భాల్లో రుజువైంది. రాజకీయ నాయకులపై అవినీతి ఆరోపనణలు రావడం సహజం. కాని పిఆర్ఓ లు, వ్యక్తిగత సహాయకులు, ఓఎస్డీల పై పెద్దఎత్తున అవినీతి ఆరోపణలు రావడమే చర్చనీయాంశం. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు అయిన ఆరేళ్ళ తరువాత కూడా ఇలాంటి వార్తలు రావడం ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి ప్రజ్ఞావంతుడి పాలనపై ఎన్నో ఆశలు పెట్టుకున్న వారికి ఆశ నిపాతంలా తలిగింది.
కొంత ఊరట…కేటీఆర్ సంప్రోక్షణ..
ఈ వార్తల్లో చెప్పుకోవాల్సింది, కొంత ఊరట నిచ్చింది, కెటీ రామారావు స్వయంగా విజయకుమార్ వ్యవహార తీరుపై మరియు అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించి, ఇంటెలిజెన్సు రిపోర్టు తెప్పించి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుంచారన్నది చెప్పుకోదగింది. అయితే ఆ వార్తలను ఆయనా ఖండించ లేదు. ఆయన కోటరీ వ్యక్తులూ కొట్టిపారేయలేదు. కాని అవినీతి పరుల సంప్రోక్షణ మొదలైందని, ముఖ్యమంత్రి పేరుచెప్పుకుని కోట్లు కూడబట్టుకుంటూ, పార్టీకి చెడ్డపేరు తెస్తున్నచీడ పురుగులను ఏరివేయాలని కేటీఆర్ ప్రణాళికాబద్దంగా పనిచేస్తున్నారన్న వార్తలు చాలా మందికి సంతోషం కలిగించింది. అసలు ముఖ్యమంత్రి కార్యాలయంలోనే కాదు, ఇతర మంత్రుల వద్ద కూడా పీఆర్ఓలు గా పనిచేస్తున్న వారు, ఇతర సిబ్బంది తమ చేతి వాటం చూపిస్తున్నారన్న ఆరోపణలు కూడా కోకొల్లలున్నాయి. రెండవ సారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత కేసీఆర్ మంత్రుల పేషీల్లో నియమించుకునే సహాయ సిబ్బంది నేపధ్యాన్ని చూసుకోవాలని, అంతకుముందు ప్రభుత్వాల్లో పనిచేసిన వారిని దూరంగా ఉంచాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. కానీ అది కాల క్రమంలో అమలు జరిగిన దాఖలాలు కనబడలేదు. ఉదాహరణకు ముఖ్యమంత్రి కార్యాలయంలోనే గతంలో ఢిల్లీ లో తన వద్ద పిఎ గా పనిచేసినతన్ని ఓఎస్డీ గా నియమించి ఎంతో ఉదారత చూపిన కేసీఆర్ కు ఆయన పంగనామాలు పెట్టారు. ఉద్యోగాలిప్పిస్తామని డబ్బులు వసూలు చేసినట్లు పత్రికల్లో వార్తలు రావడంతో అతనికి ఉద్వాసన పలికిన సంగతి విదితమే. ఆ తరువాత ఎంతో ఉదారంగా పాపం పోనీ అర్హతలను కొలమానంగా తీసుకోకుండా, ముఖ్యమంత్రి తన పేషీలో పిఆర్ఓ అవకాశం కల్పించిన మరో జర్నలిస్టుకూ ప్రగతి భవన్ ప్రవేశం పై నిషేధం పెట్టడం తెలిసిందే. ఈ జర్నలిస్టును ఉద్యోగం పీకెయ్యకపోయినా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం (ప్రగతి భవన్) ముందు అతని ప్రవేశం పై నో ఎంట్రీ బోర్డు పెట్టడం గమనార్హం.
పీఆర్ఓలు మీడియాలో కనిపించడం సాంప్రదాయ విరుద్ధం.
ఈ నేపధ్యంలో విజయ్ కుమార్ ఉదంతం ఊహించనిది. ఎందుకంటే పీఆర్ఓ విజయ్ కుమార్ కు ప్రగతి భవన్ లో చీఫ్.పీఆర్ఓ కంటె ఎక్కువ ప్రాధాన్యముండేది. అసలు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రజా సంబంధాల అధికారి (పిఆర్ఓ) పదానికే అర్ధం మారిపోయింది. అసలు పిఆర్ఓ మీడియాలో ప్రముఖంగా కనిపించే విధంగా ముఖ్యమంత్రి వెనుకే కూర్చోవడం ఎందుకు అన్నది వేయి రూకల ప్రశ్న. అది సాంప్రదాయ విరుద్ధం. పిఆర్ఓ, తన అధికారి అమలు చేసే కార్యక్రమాలకు ప్రచారం కల్పించే విధంగా ఉండాలి కాని, తనకు ప్రచారం కలిగేట్లు వ్యవహరించడం పెద్ద నేరంతో సమానం. ఈ మధ్యకాలంలో టీవీల జోరులో అనుభవం లేని వారు, రాజకీయ నాయకులకు కొమ్ముకాసే జర్నలిస్టులు మీడియా సంస్ధల్లో ఎక్కువై పోవడంతో జర్నలిస్టుల నిబద్దత నీరుకారిపోయిందని చెప్పవచ్చు.
ఆ విలువలేవి?
ప్రముఖ పాత్రికేయుడు జి. కృష్ణ తన వృద్ధాప్యంలో అనారోగ్యంతోనూ, ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకుని అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి రాంనగర్ లోని ఆయన ఉంటున్న చిన్న ఇంటికి వెళ్ళి ప్రభుత్వపరంగా ఆర్ధిక సహాయం చేస్తా అన్నా, వద్దని సున్నితంగా వారించారని ఎక్కడో చదివాను. అలాంటి మహానుభావులున్న తెలుగు జర్నలిజంలో, నేడు డొక్కచింపితే అక్షరం ముక్క రాని వాడు, కొన్ని టీవీల్లో, పత్రికల్లో ప్రముఖ పదవుల్లో తిష్టవేసిన దుస్ధితి చూడాల్సి వచ్చింది. ఎడిటర్ గా, సీఈఓ గా పలు పదవులపై కూర్చునే వారు, తమ ప్రతిభాపాటవాలను బేరీజువేసుకోకుండా, ఏడాదికి ఇన్ని లక్షల అడ్వర్టైజ్ మెంట్లు తెప్పిస్తాం, అంటూ యాజమాన్యాలను ఒప్పించి అందలమెక్కుతున్నారు. అయితే యాజమాన్యాలూ, జర్నలిస్టునని చెప్పుకుని తిరిగే వీరి నిబద్దత, నీతి, నిజాయితీలను బేరీజు వేయకుండ, తమ రాజకీయ పైరవీలకు సమర్ధత ఉందా అని, సంవత్సరానికి ఎంత ఆదాయం తెప్పించ గలవంటూ ఇంటర్యూలలో ప్రశ్నిస్తున్నారంటే ఆశ్చర్యపోవాల్సి వస్తోంది. రాజకీయనాయకులకు పాత్రికేయులకు మధ్య ఉన్న చిన్న అంతరం తరిగి పోయి, తమ అనుకూలురైన జర్నలిస్టులకు రాజకీయ నాయకులే ఉద్యోగాలు పెట్టిస్తున్న రోజులు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో అసలు నీతి వంత రాజకీయాలు, నిజాయితీ పరులైన జర్నలిస్టులను కోరుకోవడం, నేతి బీరకాయలో నేతిని వెతికినట్లే అన్నది నిర్వివాదాంశం.
పేషీల్లో పనిచేసే వారిపట్ల సందర్శకులు కృతజ్ఞత చూపించాలట…
ఇక తిరిగి కొందరు అమాత్యుల పిఆర్ఓలు, సిబ్బంది అవినీతి విషయానకి వస్తే ఆ మధ్య ఓ ప్రముఖ మంత్రి పేషీకి వెళ్ళి నప్పుడు, అక్కడి సంఘటన, ఆ కార్యాలయ సిబ్బంది మాట్లాడిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. ఓ జర్నలిస్టు పెట్టుకున్న ఓ విన్నపం పై సదరు ప్రముఖ మంత్రి గారు నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాల్సింగా సంబంధిత ఉన్నతాధికారికి ఎండార్సు చేశారు. అయితే ఆ లెటరు ఇవ్వడానికి కార్యాలయ సిబ్బంది నానా తిప్పలు పెట్టడంతో పాటు, సదరు కార్యాలయ ఉద్యోగి మీకు కృతజ్ఞతా భావం ఉండాలని రెండు మూడు సార్లు అన్నారు. అంతే కాదు ఆ సంబంధిత పీఆరోఓ కూడా పని అయిన తరువాత ఒక సారి వచ్చిపో అన్నా… అని మర్మగర్భంగా అనడం అక్షరాలా నిజమైతే, ఆ వ్యక్తికి తాను జర్నలిస్టుతో మాట్లాడుతున్నానన్న సోయి కూడా లేదు. ఈ విషయం మల్లీ మంత్రికి తెలుస్తుందేమో నన్న భయమూ లేదు. అంటే ఈ ఇద్దరూ ఎంత బాహాటంగా చేతివాటానికి అలవాటు పడ్డారో అర్ధం చేసుకోవాలి. తెరాస ప్రభుత్వంలోని ప్రముఖుల నేతల సిబ్బందికి అసలు భయమే లేదంటే అతిశయోక్తి కాదు. గత ప్రభుత్వాలతో బేరీజు వేసుకుంటే దీనికంతటికి కారణం అనుభవజ్ఞులైన మీడియా వారికి తేరాస నాయకులు దూరంగా ఉండడమే. దాంతో వారికి గ్రౌండ్ లెవెల్ పరిస్ధితులు తెలియటం లేదు. అడపా దడపా కేసీఆర్ కాని కేటీఆర్ కాని మీడియా మిత్రులతో పిచ్చాపాటి మాట్లాడుతున్నా, ఇబ్బడి ముబ్బడిగా టీవీ చానల్స్ వచ్చిన తరువాత అనుభవజ్ఞులైన ప్రింట్ మీడియా జర్నలిస్టుల సలహాలు సూచనలు తీసుకోవడానికి అందుబాటులో ఉండటం లేదు. ఆ మాటకొస్తే అసలు విలేఖరులకు సమాచారమిచ్చే పిఆర్ఓల వ్యవస్ధే ఛిన్నా భిన్నంగా మారింది. ఎక్కువ శాతం పిఆర్ఓలు పనితక్కువ, బిల్డప్ ఎక్కువ ఇస్తూ నెట్టుకొస్తున్నారు.
నిబంధనలు గాలికి
మరో విషయం పిఆర్ఓలు ఓ ప్రభుత్వ సంస్ధలో పనిచేయాలంటే కనీసం పట్టబధ్రులై ఉండాలి, జర్నలిజం లో డిగ్రీ ఉండాలి, మరీ ముఖ్యంగా తెలుగు, ఇంగ్లీషు భాషల్లో పట్టుండాలి. దాంతో పాటు పాత్రికేయ అనుభవం, ఆ వృత్తి పట్ల నిబద్ధత ఉండాలి. అలాంటి వారిని పీఆర్ఓ లు గా నియమించుకోవాలి. అప్పుడే ఆ పదవికి వన్నె తెస్తారు. కాని ఎదో రాజకీయ పదవులు ఇచ్చినట్లు అపాత్ర దానం చేస్తే ఇలాంటి ఫలితాలే వస్తాయి. వాస్తవానికి ఇప్పటికీ అలాంటి వారు కొందరు కొనసాగుతున్నారంటి అతిశయోక్తికాదు. కాని అలాంటి వారికి పెద్దల అభయ హస్తం ఉంటే అడిగే వారు ఎవరు? ‘వడ్డించే వారు మనవారైతే’ …అన్న సామెత అక్షరాల నిజమైతున్నది. కాని ఇలాంటి తప్పుడు నిర్ణయాలతో వ్యవస్ధలు నిర్వీర్యమైతున్నాయన్నదే విచారించాల్సిన విషయం.
ఇప్పటికైనా…..
ఇప్పటికైనా తెలంగాణా ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన పాత్రికేయులకు, సాహితీవేత్తలకు, కళాకారులకు తగిన ప్రాధాన్యమిస్తూనే ఆ యా రంగాల ఔన్నత్యాన్ని కాపాడటంలో కేటీఆర్ శ్రధ్ధ వహించి భావి తరాలకు మార్గదర్శకంగా నిలవాలి. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ అన్ని వర్గాలకు తెలంగాణా ఉద్యమంలో అందుబాటులో ఉన్నారు. ఆ పరిచయాలను ఉపయోగించుకుని ఎంతో మంది లబ్ది పొందారు. వ్యక్తిగత లబ్ది పొందితే నష్టం లేదు, కాని ఆ యా వ్యక్తుల వల్ల వ్యవస్ధలు నీరుగారి పోవటం, ప్రభుత్వానికి చెడ్డపేరు రావడం లాంటివి పునరావృతం కాకుండా భవిష్యత్ నాయకుడైన కేటీఆర్ శ్రధ్ధ వహించాలి. ముఖ్యంగా పలు కీలక నియామకాల్లో రాజకీయ లాభమే కాకుండా తెలంగాణా రాష్ట్ర పునః నిర్మాణంలో పనికి వచ్చే నీతి, నిబద్దతగల వ్యక్తులను తన సహచరులుగా నియమించుకుంటే, వచ్చే ఫలితాలు ‘బంగారు తెలంగాణ’ కల సాకారం కావడానికి దోహదపడతాయి.
పని చేయడం కంటే పర్యవేక్షణ మరింత అవసరం
యువనాయకుడైన కేటీఆర్ పనితీరు, నిబద్దత, నిజాయితీ పట్ల పలువురు సంతృప్తిగా ఉన్నా, ఆయన నిరంతరం పలు విభాగాల అధికారులతోనో, నాయకులతోనో సమీక్షా సమావేశాలతో నిర్విరామంగా ఉంటారు. నిజానికి ఆయన ముఖ్యమంత్రి కంటే ఎక్కువగా పనిచేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఆపై ఇటీవల పార్టీ కార్యనిర్వహక అధ్యక్ష పదవి చేపట్టిన తరువాత మరింత పని భారం పెరిగిందనవచ్చు. కాని కాబోయే ముఖ్యమంత్రిగా, కేసీఆర్ వారసుడిగా ఎంతో మంది తెలంగాణా యువకులకు ఆశాదీపంగా మారిన కేటీఆర్, తన పనితీరును మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అన్నీ తానై నిర్విరామంగా పనిచేసే బదులు వ్యవస్ధల పనితీరును పర్యవేక్షిండం అవసరం. తన సహచర రాజకీయ నాయకుల సమాచారంపై కాకుండా నీతి, నిజాయితీ, నిబద్దత కలిగిన వివిధ రంగాలకు చెందిన వారితో సమాచారం పొందుతూ అక్రమాలను అడ్డుకుంటూ, నిజాయితీ పరులకు పెద్దపీట వేయాల్సి ఉంది.
ఓ కన్నేస్తే నిజాలెన్నో….
ఏది ఏమైనా ముఖ్యమంత్రి కేసీఆర్ , కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ తమ ప్రసార మాధ్యమాల్లో పనిచేస్తున్న హెచ్ఓడీలపైన, మంత్రుల పేషీల్లో పనిచేస్తున్న అధికారులు, పీఆర్ఓలపై ఓ కన్నేస్తే ఎన్నో నిజాలు తెలుసుకోవచ్చు. అసలు పిఆర్ఓ లు మీడియాలో పనిచేస్తున్న పాత్రికేయులకు అందుబాటులో ఉంటూ, తమ ఉద్యోగానికి న్యాయం చేస్తున్నారా? లేక వారే మంత్రులుగా చెలామని అవుతూ సెటిల్మెంట్లు చేస్తూ, కోట్లు కూడబెట్టి ప్రభుత్వానికి మచ్చ తెస్తున్నారా? అన్న వివరాలు కనుక్కుంటూ, ఎప్పటి కప్పుడు చెక్ పెడితే కాని, జరుగబోయే అనర్ధాలను అడ్డుకట్టవేయలేమన్నది నిర్వివాదాంశం.