“హే మాలిక్.. తేరే బందే హమ్.. హై. హమారే కర్క్….”
“ఓ యాద్గిరీ… ఎటుపోతున్నవ్..” అని పిలువడంతో యాద్గిరి తల తిప్పి చూసాడు.. “నమస్తే ఇలేఖరన్నా… నమస్తే.. చాల్దినాలకు అవుపడ్డావ్… యాడికి పోయినవ్… ” ఏం చేస్తున్నవ్ ?.. గదే పేపర్లున్నవా? మారినవా?.. గీమధ్య ఫోను గూడ చేత్తలేవ్.. అన్నాడు యాద్గిరి..
“నా సంగతి సరే నీవేంటి జోరుగున్నవ్.. పాట పాడుకుంటపోతున్నవ్ ఎంది ఖషీ?”
“కాదన్నా… నా పాట ఇన్లే నువ్… మనుషులు మారిపోయిండ్రు… మా ఓళ్ళ పన్లు చూడు… వాళ్లని కాపాడు… అని సిన్మ పాట యాదికచ్చింది. “అన్నాడు యాద్గిరి.
“మీ ఓళ్ళంటే ఎవరు? ఏం జరిగింది?” అన్నాను.
“గదంత.. తరువాత మాట్లాడుకుందాం. కాని.. చాల్రోజులకు కన్పించినవ్.. చాయ్ దాక్కుంట మాట్లాడుకుందాం..పా..” అన్నాడు యాద్గిరి..
పక్కనే ఉన్న చాయ్ బండి దగ్గరకొచ్చి చెట్టు కింద కూర్చున్నాం…
తిరిగి యాద్దిరి మొదలు పెట్టాడు… “ఏం అన్నా. ఏందీ రాజకీయం?.. ఎలా తిరుగుతున్నది మల్ల… కొద్దిగ జెప్పు” అన్నాడు…. “నే చెప్పేదేముంది పేపర్ల చదవటం లేదా? కానీ… నీవే ఏదైన చెప్పు… నాకు పనికొస్తుంది…”అన్నాను.
“నేనేం చెప్పాలన్నా?… ఎక్కడ చూసిన అరాచకం… దుడ్డున్నోంది రాజ్యం నడుస్తున్నది.” అన్నాడు “యాద్గీరీ….. ఏమైంది? కొంచెం అర్థమయ్యేటట్లు చెప్పు. నేనేమైన సాయం చేస్తా…” అన్నాను.
“నువ్వేం చేస్తవ్ సారూ! పెద్ద పెద్దోళ్ళతోటే అయితలేదు… ముఖ్యమంత్రి కాదు కదా…… ఆ దేవుడు కూడా ఈ మనుషులను మార్చలేక సప్పుడు సెయ్యకుంట కూసున్నాడు” ….అన్నాడు యాద్గిరి….
“యాద్గిరీ… మరీ ఎక్కువగా చెప్పకు… ఏదో వింటున్నా కదా !. అని కథలు చెప్పకు… ముఖ్యమంత్రి తల్చుకుంటే కానిదేముంది కానీ… ఆయనకు నీ సమస్య గురించి తెలియాలి కదా… ఆయనకు ఎలాగైన తెలిసేటట్టు చెయి… ఆయన మాటంటే మాటే! తప్పకుంట చేస్తాడు. అందర్లాంటోడు కాదు” అన్నాను.
“సార్… నా ఒక్కడిది కాదు సార్… మనందరి సమస్య… సమాజం సమస్య…” అన్నాడు యాద్గిరి…. ” “అయితే మరీ మంచిది… సమస్యేంటో చెప్పు… ఎలాగోలా ముఖ్యమంత్రిని కలువు”… అన్నాను…
“సరేలే… నీ చాయ్ ఏమైంది. అప్పుడే 15 నిమిషాలు తలకాయ తిన్నావు” అన్నాను…. “సారీ అన్నా మాటల్ల మరిసిపోయిన… ఏక్ మినట్ల తెప్పిస్త… అరేయ్ చిన్నా…. దో చాయ్… మంచిగ దేరా! మసాల ఏసి మస్తుగ చెయి” అన్నాడు యాద్గిరి…..
తిరిగి మల్లీ “అరేయ్ చిన్నా జల్దీ తేరా సార్, జరకోపం మీదున్నడు” అన్నాడు యాద్గిరి.
“నాకేం కోపం… లేదు. అసలు విషయం చెప్పలేదు” అన్నాను.
“ఏం లేదన్నా…. మా ఏరియాల బోనాల్ పండుగ చేస్తున్నరు… మీ కాడ అయిందా? ” అన్నాడు… నేను చెప్పేలోపే తిరిగి… “ఒక్క బోనాలేందన్నా… గణేష్ నవరాత్రులు, దుర్గా పూజ, రంజాన్, -బక్రీద్, క్రిస్మస్….. ఒకటేందన్నా… ప్రతి పండుగ ఇంట్ల చేసుకునేది పోయి బజార్ల చేరుతున్నదన్న”
అన్నాడు.
“అరె… సామూహికంగా పండగ జరుపుకుంటే మంచిదే కదా… మనుషుల్లో స్నేహ భావం. పెరుగుతుంది… మత సామరస్యమూ వెల్లివిరుస్తుంది కదా… నీకేం నష్టం”… అన్నాను…
“పో అన్నా, నువ్ గట్లనే అంటవ్… గీ పండుగల పేరు మీద అరాచకం సృష్టిస్తున్నరన్న… నీకు తెలుసుకదన్న. గణేష్ నవరాత్రుల పేరు మీద జబర్దస్తీ చందాలు వసూలు చేస్తరు… అళ్ళను అడిగేటోడ్ లేదు” అన్నాడు…
మళ్ళీ అతడే… “అన్నా బోవాలు పేరు మీద మా గల్లీల కూడా వసుల్ చేసినారన్న… చేస్తే చేసిండ్రు… ఒక్క పోశమ్మ గుడి కాడ కాదన్న మొత్తం గల్లీ అంత మైకులు పెట్టిండ్రు… లైట్లు పెట్టిండ్రు”అన్నాడు…
“నీకేం నష్టం అన్నాను, అసహనంతో”… “అన్నా గట్ల అనకే… మా ఇంటి ముందట… గలుము. కాడనే… ఒక చెట్టుకు మైకు కట్టిండ్రన్నా…. పొద్దుగాల్నే పాటలు పెట్టిండ్రన్నా… ఇక మావోడు…. సిన్నాడు ఝుల్లుమని లేసిందు తెల్లారంగనే ఆ పాటలకు ఏడుస్తుండు… ఎంత సముదాయించిన ఆగలే…. ఇక నా పెళ్ళం సంగతి నీకు తెలుసు కద… సదువుకున్నదాయె… నాకెయ్ సూసింది… ఏం జూత్తున్నవ్ పోయి ఆ మైకు తీయించరాదన్నది… నాకేమో బయం బట్టింది. పోయి ఆళ్ళకు చెప్తే.. ఆళ్ళు ఈపు పలగొడ్తారు. ఏం చెయ్యాలో.. తోచలేదన్న”…
అటు ఇటు సూసి కొంచెం ఆలోచించి “మా అన్నోళ్ళింటికి పోదాం పద… ఆడనే అన్నం కూడా తిందాం అన్నా… దాంతో నా పెళ్ళం శాంతించి.. పిల్లాన్ని ఎత్తుకొని, తొందర తొందరగా బయల్దేరింది…. నా ఇస్కూటర్ తీసిన, మా ఆమె ఎనుక కూసున్నది… కొద్దిగ దూరం కూడ పోలే… ఆ బోనాలుతో జులుస్ తీస్తున్నరు.. నా పరిస్థితి ఎట్లున్నదంటే “ఇడువు మంటే పాము క్కోపం, కొరుకు మంటే కప్పకు కోపం ..ఏం చేయాలో తెలియలే… కొద్దిగ హిమ్మత్ చేసి ఒక వాలెంటర్”ని పిలిసి…అన్నా కొద్దిగ తొవ్వ.. ఇప్పియ్యవే… ఎల్లిపోత… పిల్లగాన్ని హాస్పిటల్ తీసుకుపోవాలి… అని అబద్దం చెప్పిన”….
“వాలెంటర్” సూటిగా చూసిండు… మల్ల ఏమన్కొన్నడో ఏమో… సారీ అన్నా…. తొవ్వ జేస్త ఆగు అని ” పుర్రెర్ ” అని నోట్లున్న సీటీ గొట్టిండు. “.. గా సప్పుడుకు “నా పెళ్ళం ఒళ్ళో పండుకున్న సిన్నాడు మల్ల ఉలిక్కిపడ్డాడు… నా పెళ్ళాం నాకేసి పెద్ద పెద్ద కళ్ళు తీసి సూసింది. నేనేం చేయాలి….. గా వాలెంటర్ దగ్గరేమో గుప్పు మని కల్లు వాసవచ్చింది. ఏమన్నంటే ఆడు తాగున్నడు…. పంచాయితీ అయితది… నేను సప్పుడేకున్న… సోచాయిస్తున్న… మనసులనే.. “
“మనం ఎటు పోతున్నాం? ఒక వైపు…. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో అభివృద్ధి చెందుతూ అమెరికోంతోటి పోటీ పడుతుంటే… ఈడ గల్లీలల్ల… దేవుడు… ధర్మం… భక్తి… గీటి పేరుతో ఈ లొల్లేంది? “
“భక్తి అంటే మనసుకు ప్రశాంతతనిచ్చేదిగా ఉండాలె కాని ఇట్ల లొల్లి చేయమని ఏ పుస్తకంల రాసి ఉన్నది?… ఏ ముఖ్యమంత్రి ఈళ్ళకు ఇట్ల చేయమని చెప్పిండు? ఏ గురువు (పీఠాధిపతి) చెప్పిండు?… చిన్న పోరగాళ్ళు రోడ్ల మీద డాన్సులు చేసుడేంది?.. ఏదో సల్లగ పూజ చేసుకొని..ఇండ్లండ్ల ప్రశాంతంగా ఆడుకోవాలి కాని ఈ లొల్లేంది. ఈ పెద్ద పెద్ద బ్యానర్లేంది?..ఈ కరెంటేంది?.. దీని గురించి పట్టించుకొనే వాడెవడన్నా ఉన్నాడా? “..
“అప్పుడే మల్ల పుర్ర్ ర్… అన్న విజిల్‌తో చూసిన… వాలెంటర్ అన్న పోనియ్యవె… జల్లీ… మల్ల జనాలొస్తే నాతోటైతే గాదు మరి… అన్నాడు. అదే సందని ఇస్పిడుగ స్కూటర్ పోనిచ్చిన.
అన్నా₹డు!… ఇప్పుడు సెప్పు… ఇది మన ముఖ్యమంత్రి మారుస్తడా? అన్నాడు యాద్గిరి”.
దానికి జవాబు దొరక్క చేతిలో వున్న కప్పు చాయిని గుటుక్కున మింగి “సరే… యాద్గిరి… మళ్ళీ కలుద్దాం… అప్పుడు తీరిగ్గా మాట్లాడుకుందాం” అని బుర్ర గోక్కుంటూ బయల్దేరాను.
అప్పుడు గుర్తొచ్చింది వాడు పాడే పాట.
“హే మాలిక్.. తేరే బందే హై హమ్…
ఐసే హై హమారే కర్మ్. “…
ఎవరో మహాత్ముడు ఎంత చక్కగా రాసాడు ” హాట్సాఫ్ ” అనుకున్నాను లోలోపల….