మామ… మాయ…. అంతా మాయ….” పాడుకుంటూ వెళ్తున్న యాదగిరిని చూసి. పిలిచా… “ఓ …. యాద్దిరీ…..
వెనక్కు తిరిగిచూసాడు, దూరంగా ఉన్న నేను కనబడకపోయేసరికి తనను కాదనుకొని అటూ ఇటూ మరోసారి చూసి ముందుకు అడిగేసాడు. చాయ్ బండి దగ్గర ఉన్నా… నేను కొద్దిగా బయటికొచ్చి తిరిగి యాద్గిరీ. ఇటు.. ఇటు.. చూడు” అని పిలిచాను.
ఈ సారి నా వైపు చూడటంతో… నేను చేయి పైకెత్తి ఇటు రమ్మంటూ సైగ చేశాను. నన్ను, చూసిన “నమస్తే ఇలేకరన్న! చాల్దినాలాయె… కన్పించలే? ఏంది.. పుల్లు బిజీగున్నవా?” అన్నాడు.
“ఏం బిజీ యాద్గిరీ! నీకు తెలుసుగా రాష్ట్రంలో రాజకీయాలు… ధర్నాలు… రైతు గర్జన… వికలాంగుల ధర్నా… సర్వజన సమ్మేళనం” ఇవేగా నీకు తెలియదా?” అన్నాను.
“అవునన్నాపేపర్ల సదువుతున్న…. ఫుల్లుగ రాస్తున్నరు.. పేపరోళ్ళ పనేగది కదా!” అన్నాడు. “అదేంది … నీ మాటల్లో వెటకారం ధ్వనిస్తోంది. ధర్నాలు.. రాస్తారోకోలు చేయట్లేదా? అందుకే రాస్తున్నాము. మా సొంత వార్తలు రాయం కదా? “అన్నాను..
“అదే అన్నా తప్పు అంటలేను. ఉన్నదే రాస్తున్రు… కాని కొంచెం మసాల బెట్టి రాస్తున్నరు. న్యూస్ కాదు దానికి ముందు..మీ వ్యూస్ కూడా జోడిస్తన్రు కదా! …అని అంటున్నాను” అన్నాడు .
ఈ సారి రాజకీయ నాయకుల మీదే కాదు, పేపరోళ్ళమీద కూడా కోపమొచ్చినట్లుందని లోలోన అనుకుంటూ “.
“చాయ్ దాగినవా ? నేను ఇప్పుడే తాగాను” అని.. “బాబూ ఒక చాయ్” అంటూ చేయి ఊపాను టీ బండి వైపు చూస్తూ… తిరిగి నేనే “ఏం జోరుమీద వెల్తున్నావు… ఏదో పాట పాడుకుంటున్నావు నీలో నీవు అన్నాను”.
“ఏం లేదన్నా, గదేదో సిమ్మల.. హీరో.. రజనీ కాంత్ అనుకుంట… మాయ… మాయ.. అనే పాటున్నది…కద…అన్న దాన్ని మార్చి పేరడి చేస్తన్న” అని అన్నాడు ,
“ఎలా? నాకు ఒక్కసారి చెప్పు వింటా..” అన్నాను. దాంతో సిగ్గు పడుతూ యాద్గిరి .. “నాకేం అస్తదన్న? నీ ముంగల నేను సిన్న పిల్లోన్ని… నువ్ ఇలేకరివాయె. నీ అంత తెలివి నా దగ్గరుందా? నీ లెక్క నాకు రాయస్తదా? ” అన్నాడు. ” అదేం లేదులే చెప్పు నాకంటే నీవే తెలివికల్లోడివి చెప్పు ” అన్నాను. ఈ లోపు చాయ్ ఇచ్చాడు…య టీబండి పిల్లోడు. చాయ్ తాగుతున్నాడు యాద్గిరి.
ఆ తర్వాత…”ఏం లేదన్నా! మల్ల ఎలచ్చన్ల టైం దగ్గరపడ్తునది కదా, మన లీడర్లందరు బాగా ప్రజలమీద ప్రేమ చూపుతున్నారు. దాంతో సిన్మా పాటను పేరడిగా పాడిన.. అన్నాడు .
నేను శ్రద్ధగా వింటున్న తీరును చూసి తిరిగి “అదే అన్నాగా పాట…
మాయ… మాయ… అంతా… మాయ…
మన అసెంబ్లీ మాయ….
రాజకీయం మాయ…,
నాయకుల మాయ…
పార్టీలేవయినా…
నాయకులందరు ఒకటే ఒకటే,
వారి మూలాలన్నీ ఒకటే.
ప్రజాసేవ ముసుగులో…
అందరూకు చేసేది షేవే… షేవే… అని మార్చిన” అన్నాడు.
“ఇంకా ఇలాంటివి తయారు చెయ్యి. నువ్ మషూర్ అయితవ్ ” అన్నాను. “పేరు కోసం కాదన్నా, ఈ మధ్య గీ టీవోల్లు, ప్రజావాణి అని ఓ కార్యక్రమం తీసేదానికి మాకాలనీకి వచ్చిండ్రు. రాజకీయాల మీద నన్ను అభిప్రాయం చెప్పుమన్నారు. గప్పుడు పాట పాడిన” అన్నాడు . అసలు విషయం ఇదా అన్పించింది. అప్పుడు అంటే ” ఇదంతా మాయ అంటావా ” అని అన్నాను, . యాద్గిరి మనసులో మాట తెల్సుకుందామని.
“ఏ ముందన్నా? పోయిన ఎలచ్చన్లల్ల వై.ఎస్. రాజశేఖర్ రెడ్డేమో చంద్రబాబు నాయుడు పెద్ద పెద్ద కంపినోళ్ళకు భూములు పంచుతుండు. గరీబోళ్ళకు గజం జాగ కుండా మిగలది …అని పాదయాత్ర జేసుకుంట చెప్పిండు…. రైతులకు కరెంటిస్త అన్నాడు.”.
“సరే కదా, అనుకున్నాం. మా గల్లీల అందరం కూసోని కాంగ్రెస్ కు ఓటేద్దాం అనుకొని ఓటేసినాం, వైఎస్సారేమో సి.ఎం. అయినాంక వ్యవసాయానికి ఉచిత కరెంటును, చిన్న సన్నకారు రైతులకు పరిమితం చేస్తున్నట్లు మాటమార్చిండు. చంద్రబాబు గిప్పుడు వరికి మద్దతు ధర ఇయ్యాలని రైతుగర్జన పెట్టిండు, పంట ఋణాలన్నీ మాఫ్ చెయ్యాలని అంటాడు. రైతులకు 3 శాతం వడ్డీకే లోన్లు ఇయ్యాలె అంటాడు. బీజేపోల్లేమో సెంటర్ల గవర్నమెంటు ఉన్నప్పుడు తెలంగాణ అంటే సప్పుడు చెయ్యలె. ఇప్పుడు మల్ల తెలంగాణ కావాలంటన్లు. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అన్నవాళ్ళ మాటలు వాళ్ళు మార్చిపోయిండ్లుకాని… పెజలు మరవలేదు. రామమందిరం అన్నారు. వాళ్ళు పవర్లో ఉన్నప్పుడు ఆ మాటే మార్చిండు. ఏమన్నంటే మాకు పూర్తి మెజారిటీ రాలేదు.. అంటారు. మరి పూర్తి మెజారిటీ కాకుంటే గవర్నమెంటు ఎందుకు చెయ్యాలె? టి.ఆర్.ఎస్ చంద్రశేఖర్ రావేమో మల్ల నిజాం.. చాలా మంచోడు అంటాడు. అదే నిజాం జమానలో రజాకార్లు తెలంగాణల గరీబోళ్ళకి, దళితులను ఒక్క తీరుగా గోస పుచ్చుకున్నరు. అది పోనీ గాని సర్కారు బాగుండేనా అంటే అది లేకుండే, దొరలు, పటేళ్ళు, పట్వారీలు, ఊళ్ళల్ల ఎంత గొసపుచ్చుకున్నారో అప్పుడే యాద్ మార్పిండా? సూసిన ఆడదాన్ని వదలలే, ఆఖరికి మంచి కోడి కన్పిస్తే దాన్ని కూడా ఇడ్వలేదప్పుడు. దాన్ని కోసి బిర్యాని వండుకొని తినేదాక నిద్ర కూడ పోకపోయేటోళ్ళట రజాకార్లు. గోండులకు పెట్టిన గోస సూసి కొమ్మురం భీం తుడుం మోగించిందు. పాణాలు పోగొట్టుకున్నాడు. కాని మల్ల ఓట్లకోసం నిజాం సాలా మంచోడంటాడు. ఏ గల్లీల ఏ చెట్టును, పుట్టనడిగినా గానికి ఎంతో మంది పెండ్లాలుండే అంటారు. నిజాంకు ఖిలాఫ్ మాట్లాడిన షోయబుల్లాఖాన్‌ను పబ్లిక్‌గా సంపిండంట? గయన్ని మర్చిపోయిండు? అది పోనీ గీ…..
గదే మాజీ అడ్వకేట్ జనరల్ సర్వజన సమ్మేళనం పెడ్తాందట చంద్రబాబు పవర్లున్నప్పుడు గన్ని రోజులు అడ్వకేట్ జనరల్ పదవిలుంటే ఎప్పుడైన ఒక గరీబోన్కీ న్యాయం చెయ్యాలని, పైసలు తీస్కోకుంట కోర్టుల వాదించిండా? గంతెందుకు ఎంతో మంది ఆళ్ళ కులమోళ్ళు…. ఆళ్ళ బాపనోల్లల్ల గరీబోళ్ళు. ఉన్నారు. ఆళ్ళకు ఏమన్న సాయం చేసిండా? సాయం చేయాలంటే రాజకీయాలే… కావాల్నా? గన్ని. పైసలున్నయ్. ఒక్క రోజన్న ఫీజు గట్టక సదువు ఆపేసిన పోరగాళ్ళకు ఫీజు గట్టిండా? ఒక్కని పేరేందుకు అన్నా! రాజకీయముల అచ్చే చానమంది గంతే… అంతా మాయ.. మాయ… రాజకీయమే ఒకమాయ… ఆళ్ళకు లాభం లేకుంట ఏం జేత్తలేరు. మన ప్రజలేమో గొర్రెల మంద కదా? గొర్రె ఎవల్ని నమ్ముతది? కట్యోన్ని నమ్ముతది. గంతే” అన్నాడు. పెద్ద లెక్కరిచ్చి యాద్దిరి. కోపం చూసి లోలోన నవ్వుకుంటూ “కనీసం నీకు నీ అభిప్రాయం చెప్పే స్వాతంత్ర్యముంది. ఒక విలేఖర్నయిన నాకు నా అభిప్రాయాలను, ప్రజాభిప్రాయాలను వ్రాసే స్వాతంత్రం లేదు” అనుకున్నాను మనసులో, పాపం కేం తెలుసు. మేనేజిమెంట్ల పెత్తనాలు విలేకర్లపాట్లు “సరే? వస్తాను” అన్నాను. నిజాన్ని నిర్భయంగా ‘ చెప్పిన ని మనసులోనే అభినందిస్తూ…..