Monday - December 23, 2024

ఫ్రీ తాళిబొట్టు… ఫ్రీ  పెళ్ళి…..!?

“ఎన్నికలొస్తేనే గుర్తొసారు. పేదరికం పోగొడ్తామంటారు.

వరాల వాన కురిపిస్తారు, అడగనిదే అన్ని ఇస్తామంటారు.

 డుం.. డుం…డిగా…డిగా… డుం…. డుం…డిగా…డిగా..

 పాడుకుంటూ వెల్తున్న ‘యాద్గిరి’, నా కంటబడటంతో ‘యాద్గిరీ’ అని పిలిచా…

నా పిలుపుతో వెనక్కు తిరిగి చూసిన యాద్గిరి. నన్ను చూసి, నమస్తే, అన్నా! బాగున్నవా? సాల పురసత్ కూకున్నవ్” అన్నాడు పురుసత్ ఏడున్నది యాద్గిరీ, ఓ ఫ్రెండ్ వస్తానని చేస్తే ఎదురు “చూస్తున్నా” అన్నాడు.

“ఔనుల్ల, పురసలేదుంటది ఇలేకర్లకు మల్ల ఎలచ్చన్లస్తున్నయ్ గద, ఇగ పనే పని’ అన్నాడు.

“ఎలక్షన్లు ఇప్పుడే ఎక్కడ యాద్గిరీ, ఇంకా యాన్నర్ధం ఉంది” అన్నాడు. “గదేమల్ల.. నేనదే చెప్తున్న.. అన్నా! గిప్పుడే మనకు ఎలచ్చన్లచ్చినట్లు గన్నిస్తలేదా? మీటింగుల మీద

మీటింగులు,  ఒరాల మీద ఒరాలు ఇస్తండ్రు కదా’ అన్నాడు యాద్గిరి.

“ఎలక్షనంటే గుర్తొచ్చింది. ఇప్పుడేదో పాట పాడుతున్నట్లున్నావు…” అన్నాడు.

అన్నా..గా… మధ్య పోసాని కృష్ణమురళి రాజకీయాల మీద సిన్మదీసిండు గదా! నా దోస్త్ ఒకడున్నడన్నా.. గాని దోస్త్ ఇంకొ సిన్మ దీస్తదంట. గీ లీడర్ల మీద, రాజకీయాల మీద, పాటలు గట్టితెమ్మన్నడట…. నీకు డెల్సు ..గదనె, నేను పేరడి పాటలు రాస్త గద…, గదే సోచాయిస్తున్న ఎట్ల రాయాలె అని” అన్నాడు యాద్గిరీ,

‘అదే అడుగుతున్నా? ఏం రాసావు ఒకసారి చెప్పు?” అన్నాను.

ఏం లేదన్న ఒక పాత తెలుగు సీన్మ పాటకు పేరడిగ రాసిన..

డుం… డుం..డిగా డిగా, డుం..డుం డిగా…

ఎన్నికలొస్తేనే గుర్తొస్తారు.

పేదరికం పొగొడ్తమంటారు.

అడగనిదే ఇస్తామంటారు.

వరాల వాన కురిపిస్తారు.

డుం… డుం..డిగా డిగా, డుం..డుం డిగా…

మహిళలకు పెద్ద పీటంటారు.  

అమ్మా! అక్కా అంటారు…

చిన్నా, పెద్ద, ముసలి, ముతక….

తేడా లేకుండా, ముద్దు, ముచ్చట, చేస్తారు …

అక్కున చేర్చుకుంటారు.

కౌగిలించుకుంటారు. ..

నోట్లో అన్నం పెడ్తామంటారు..

పిల్లల ముడ్డీ కడుగుతామంటారు…

వంగి వంగి సలాము చేస్తారు…

కాళ్ళకూ దండం పెడ్తారు…

అరచేతితో స్వర్గం చూపిస్తారు…

అవసరమైతే ప్రాణమిస్తామంటారు…

 ఆ ఓటోక్కటీ వేయమంటారు..

మళ్లీ అయిదేళ్ళూ అడ్రసు లేకుండా పోతారు.

డుం..డుండిగా డిగా, డుం డుం డిగా డిగా,..

మన నాయకులూ… ‘మహత్ముని’ వారసులూ..”

నేను మధ్యలోనే ఆపివేస్తూ “చాలా బాగా రాశావు కానీ, ఏమి చేయక పోతే ప్రభుత్వం ఏం చేయలేదంటారు. చేస్తానంటే, తప్పు పడ్డారు. ఇదేం పద్ధతి? అని మన నాయకులకు వత్తాసు పలికాను నేను” అయినా యాద్గిరి ఏం చేప్తాడో విందామని?

“అన్నా! మల్ల నన్ను గెల్కుతున్నావ్,

ఆళ్ళకు పేజల మీద ప్రేమ కాదన్నా… ఆళ్ళకు కుర్సీ కావాలె. పదవి కావాలె,  పదవితో వచ్చే ‘పవరు కావాలె! ‘ గందుకే గిన్ని మాటలు చెప్తున్నారు?

“అదేంది యాద్గిరీ, వాళ్ళకు డబ్బుకు తక్కువ లేదు. కోట్ల ఆస్థిఉన్నా ప్రజలకు సేవ చేసి ఈ జీవితం సార్ధకం చేసుకోవాలని రాజకీయాల్లో ఉన్నారు కానీ… వాళ్ళు హాయిగా, ఏ పని చేయకుండా జీవితం వెళ్ళబుచ్చొచ్చు” అన్నాను.

 “అవునన్నా! నా చెవుల బీడి కన్పిస్తునదా?

సెంద్రబాబుకు ఎం.ఎల్.ఎ అయినప్పుడు రెండెకరాలుండెనట, గిప్పుడు రెండువేల కోట్ల కంటె ఎక్కువ ఉన్నయ్యట, …మన దేవేందర్ గౌడ్, కల్లుదంద జేస్తుండెనట, గిప్పుడు రంగారెడ్డి జిల్లా 2వేల ఎకరాల భూమి ఉన్నదట.. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలూ ఆయనయ్యేట

మన పార్టీ.. అధ్యక్షుడు జ్ఞానేశ్వర్, .. గంతకు ముందు ఆటోడ్రైవరట, గిప్పుడు, కోటీశ్వరుడట. రంగరెడ్డి జిల్లాల కోట్ల రూపాయల భూములన్నీ గాయనయ్యేనట,… గంతెందుకు నీ రోజుల్ల ఇండిపెండెంట్ ఎవలన్న ఎం.ఎల్.సి.గా గెలుస్తరా అన్నా? ఒక్క ఎం.ఎల్.ఎకి కోటి రూపాలిచ్చి గెలిసిందంట, మీసం లేకున్నా మెలేసిండన్నా,తొడగొట్టి సవాల్ చేసిండు… గాయన గెలుపును ఎవరూ ఆపుజెయ్యలే, కేసిఆర్కి చెక్కు పెట్టిండు. తెలంగాణా అనే గీ చంద్రశేఖర్ సంగతేంది? గంతకు ముందు కాంగ్రెస్ ఉండెనట. ఉద్యోగాలిప్పిస్త అని దుబాయ్ పంపెచ్చెటోడెట, సాన మందికి కుచ్చుటోపి పెడ్తె కరీంనగర్ కాంగ్రెస్ లీడర్..గదే ఎం. సత్తెనారాయణ కాపాడింటట, మన ఎమ్మేల్యేలు కొందరు, అమెరిక పంపుత అని లచ్చలు తీస్కున్నరట గద, గందుకే నరెంద్ర ని పార్టీల కెల్లి ఎల్లగొట్టిండు గద కేసీఆర్, కొందరు ఎంఎల్ఎలలో పోలిసోల్లు అరెస్టు గూడ చేసిండ్రు గద. ఇంకెందరో ఉన్నారట “దొరికితే దొంగ లేకుంటే దొరొ గంతే, గంతెందుకు మన సి.ఎం. వైఎస్. రాజశేఖర్రెడ్డి సెప్పలేదా? గాయన కొడుకు జగన్కు ఒక్క బిజిలీ కంపెనీల యాడాదికి 40 కోట్లు అన్తయటగా, ఒక్క కంపెనీ గురించే సెప్పిండు. ఇంకెన్ని కంపెన్లున్నయో అన్న? మల్ల గాయన సంగతి జెప్పలే ఇడుపుల పాలయి ఎస్టేట్ సంగతేంది. గీ మద్య ఇస్టాట్ చేస్తున్న స్టీల్ ఫ్యాక్టరీ, సిమెంట్ ఫ్యాక్టరీల సంగతేంది? ఇయన్ని.. కాక, 600కోట్లతోటి పేపర్ పెడ్తాడంట, టీవి పెద్దడంట? గీ పైనులన్నీ ఎక్కడియి? మరి..గన్ని పైసలుంటే వైఎస్సార్ సి.ఎం. కాక ముందల ఎందుకు పేపరు పెట్టలే?” అన్నాడు.

“అధికారంలో ఉన్నారు కదా. ప్రభుత్వ పర్మిషన్లు దొరుకుతాయి అందుకే ఎన్నో ఏండ్లుగా అనావృష్టితో వెనుకబడి పోయిన రాయలసీమను అభివృద్ధి చేసి అక్కడి యువకులకు ఉద్యోగావకాశాలు కల్పించి, ఫ్యాక్షన్ తగ్గించాలనే ఫ్యాక్టరీలు పెస్తున్నారట” అన్నాను నేను…

“ఓ మల్ల గది రైటేమో కాని పెజాసేవ పేరుమీద గీ లొళ్లేంది?  గయల్ల చంద్రబాబు ఫ్రీకరెంట్ ఇయ్యంలేం, అన్నాడు కరెంటు తీగల్లమీద బట్ట లారేయాల అన్నాడు. గిప్పుడు పవర్ పోంగనే నేనిస్త. అన్నాడు. పించన్ వైఎస్సార్ 200 లిస్తున్నదని 500 ఇస్త అంటుండు. వైఎస్సారేమో ఎన్టీఆర్ 2 రూ॥కిలో బియ్యం ఇస్కీం మల్ల షురూ జేస్తండు. బీసీ ఓళ్ళకు ఎక్కువ సీట్లిస్త అంటుండ్లు, ఒక్కళ్ళ మీద ఒక్కళ్లు పోటీ పడ్తన్లు, ఆళ్ళకు ‘పవర్’ గావాలె… గండ్ల ఏం మజా లేందే గియాన్ని ఇస్తాం… ఓటేయ్యమంటున్రా?

ఇంకా ఏడాదిన్నర ఉంది. ఎలచ్చన్లకు టైము… ఒక కోయిల ముందే కూసింది. అన్నట్లు ఒక్క. కోయిల కాదు అన్ని కోయిలలూ ముందే కూస్తున్నాయి.” ఒకలు తెలంగాణ అంటాడు. ఒకలు రంగుల టీవీ ఇస్తా అంటాడు. ఇంకోలు, సైకిల్ ఇస్త అంటారు. బర్రెనిస్తు అంటారు. ఇంకొక్కడు అవునిస్తా, అంటారు. ఒకడు ఫ్రీగా పెళ్ళి చేస్త అంటే ఇంకొలు తాలిబొట్టు నిస్త అంటారు… అన్నాడు యాద్గిరి.

 “యాద్గిరీ” మంచిదే కదా! మన నాయకులు పేదరికం పావాలనే కదా ఇదంతా చేస్తామంటున్నారు. సంతోషించాలి మనమంతా, సంక్షేమం ..అభివృద్ధి మనకు రెండు కళ్ళ లాంటివి అన్నాను.

 “అన్నా! నువ్ బాగా చెప్తావ్… బియ్యం ఇస్తం …పెన్షన్ ఇస్తం. రాషన్ కార్డిస్తాం.. నౌకరిస్తాం.. లేకుంటే నిరుద్యోగభృతి ఇస్తం.. ఫ్రీగ కరెంటిస్తాం. ఫ్రీగ పెండ్లి చేస్తాం …అంటున్నారు. గీ జనం గూడా ఫ్రీ స్తే ఫినాయిల్ తాగుతాం …అంటారు గొంచెం కూడ ఆలోచిస్తలేరు. కొన్రోజులైతే ఫ్రీగా.. పెండ్లితో పాటు శోభనం కూడా అళ్ళే చేయిత్తాం అంటారు… ఆఖరికి పొరగాండ్లను కూడా కష్టం లేకుండా కనిపెడ్తామంటారు. అయినా జనంకి తెలివిరాదన్నా” మొద్దులు…, సుద్దమొద్దులు ఏం చెప్పాలన్నా ఈల్లకు …దిమాక్ లేదు” …అన్నాడు యాదిరి,

“యాద్గిరీ, మన ప్రజలు చాలా తెలివిగలవాళ్లు, ఎప్పుడు ఎవరికి ఓటెయ్యాలో, ఎవర్ని దించెయ్యాలో.. తెల్సు, నువ్వేం దిగులు పడకు, వాళ్ళకు మైండ్ లేదనకు. గత ఎన్నికల ముందు సెంద్రబాబు ప్రజల మైండ్ సెట్లో మార్పు రావాలని పదే పదే చెప్పెవాడు. ఆఖరికి ఆయన మైండ్ సెట్ మార్చారు. ఫ్రీ కరెంట్ ససేమిరా అన్నతడే ఇప్పుడు సరే అంటున్నాడు.

తెల్సిందిగా….మన జనం తదాఖా ఎందో?” అన్నాడు. అన్నా….గీ ఎలచ్చన్లల్ల మన జనం ఎవరికి కర్రుకాల్సి వాతపెడ్తారో తెలుస్తలేదన్నా? అన్నాడు.

“తొందరెందుకు ఇంకా టైముందిగా, ప్రజలూ మారారు, సమాజమూ మారింది. మనమూ మారాలి.

తప్పదు” అన్నాను.

 “అన్నా! సమాజం అంటే గుర్తొచ్చింది. మన మెగాస్టార్ చిరంజీవి పార్టీ పెడ్తాడు గదా? పార్టీల్లో గిప్పుడు సమాజ సేవ చేస్తరట” అన్నాడు.

సరే నాకు టైమైంది. మళ్లీ కలిసినపుడు మాట్లాడదాం. యాద్గిరీ” అన్నాను.

అన్నా చాయ్ దాగుదాం చాల్దినాలాయె అన్నాడు యాద్గిరీ.

“చాయ్ దేముంది యాద్గిరీ, రోజూ పది చాయ్ లు తాగుతాం” వెళ్లొస్తా అంటూ బైబై చెప్పాను. యాద్గిరీకి.

Related Posts

Cartoons Sence

Galleries

Latest Updates